ఆంధ్ర ప్రజలకు అలెర్ట్.. వందేళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన ఎండలు
x

ఆంధ్ర ప్రజలకు అలెర్ట్.. వందేళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన ఎండలు

భారతదేశంలో ఎండలు మండుతున్నాయి. వందేళ్ల రికార్డులు కూడా బద్దలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రజలకు విపత్తుల సంస్థ అలెర్ట్ ప్రకటించింది.


ఆంధ్రలో ఎన్నికల వేడి నానాటికీ అధికం అవుతోంది. దానికి ఏమాత్రం తీసిపోకుండా వేసవి ఎండలు కూడా అల్లాడిస్తున్నాయి. రోజురోజుకు భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భయటకు రావాలంటే భయమేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో వడగాలుల తీవ్రత తీవ్ర స్థాయిలో ఉందని, రేపు(శనివారం) రోజున దాదాపు 58 మండలాల్లో తీవ్రస్థాయి వడగాలులు, 169 మండలాల్లో ఒక మోస్తరు వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తమ సంస్థ అంచనా వేస్తుందని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అదే విధంగా ఎల్లుండి(ఆదివారం) కూడా 78 మండలాల్లో తీవ్ర వగాలులు, 273 మండలాల్లో వడగాలులు వీయొచ్చని తెలిపారాయన.

ఈ మండలాల్లోనే

శ్రీకాకుళం 12, విజయనగరం 23, పార్వతీపురం మన్యం 14, విశాఖ 1, అనకాపల్లి 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందని, అదే విధంగా శ్రీకాకుళం 13, విజయనగరం 3, పార్వతీపురం మన్యం 1, అల్లూరి సీతారామరాజు 9, విశాఖ 2, అనకాపల్లి 10, కోనసీమ 5, కాకినాడ 17, తూర్పుగోదావరి 4, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 11, కృష్ణా 9, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 22, బాపట్ల 3, ప్రకాశం 14, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1, శ్రీసత్యసాయి 1, వైయస్సార్ 4, అన్నమయ్య 1, తిరుపతి 5 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ అంచనా వేసినట్లు వివరించారు.

బయటకు రావొద్దు

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మందపాటి దుస్తులు ధరించడానికి వేసవిలో వీలైనంతవరకు మానుకోవాలని వివరించారు. అంతేకాకుండా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పని పరిస్థితుల్లో తప్ప మరెప్పుడు బయటకు రావొద్దని సూచించారు. ఒకవేళ బయటకు వస్తే ప్రతి 15 నిమిషాలను ద్రవ పాణీయాలు తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేషన్‌లో ఉంచుకోవాలని చెప్పారు.

వందేళ్ల రికార్డు బ్రేక్

ఈ నేపథ్యంలో ఈఏడాది వేసవిలో దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఎండలు వందేళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసినట్లు జాతీయ స్థాయి అధికారులు వెల్లడించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో వీస్తున్న వడగాలుల వల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారని, కావున ఎవరూ కూడా ఎండలను, వడగాలులను నిర్లక్ష్యం చేయకుండా వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వివరిస్తున్నారు. ఈ ఏడాది సూర్యుడు.. శతాబ్దాల రికార్డులను తిరగరాస్తున్నాడు. ఈ క్రమంలోనే వందేళ్ల రికార్డును బ్రేక్ చేసినట్లు కూడా అధికారులు వెల్లడించారు. దాదాపు 103 ఏళ్ల క్రితం అంటే 1921లో ఏప్రిల్ నెలలో అత్యధికంగా నమోదైనా ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా ఉందని, ఆ తర్వాత ఇప్పటివరకు ఏప్రిల్ నెలలో అంతటి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని, కానీ ఈఏడాదిలో మాత్రం ఈ రికార్డులను ఏప్రిల్ తొలివారంలోనే ఎండలు బ్రేక్ చేసేశాయి.

ఏప్రిల్ తొలివారంలో ఉగ్రరూపం చూపడం ప్రారంభించిన సూర్యుడు.. రోజురోజుకూ తన విశ్వరూపాన్ని చూపుతూ ప్రజలను వణికిస్తున్నాడు. అంతేకాకుండా రానున్న ఐదు రోజుల్లో ఎండలు మరింత మండనున్నాయని భారత వాతావరణశాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అందులోనూ దక్షిణ, తూర్పు భారతదేశంలో ఈ ఎండల తీవ్రత మరింత అధికంగా ఉందని, మే నెలలో కూడా భానుడి భగభగలు ఇంతకన్నా ఎక్కువగానే కొనసాగుతాయిన సంస్థ అంచనా వేస్తోంది.

నష్టాల్లో పంటలు

వేసవిలో మండుతున్న ఎండల వల్ల తీవ్రంగా పంట నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. భూగర్భజలాలు క్షీనించడంతో పొలానికి కావాల్సినన్ని నీరు అందడం లేదని, దాని వల్ల మొక్కల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి వ్యాధుల బారిన పడుతున్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నారు. తమ పొలాలకు కావాల్సిన నీటిని అందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Read More
Next Story