ఉచిత బస్ ప్రయాణంపై ప్రభుత్వం స్వరం మార్చింది. గతంలో కూడా ఎన్నో హామీలు ఇలాగే గాలిలో కలిసాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒక మేజర్ హామీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. ఎంతో మంది మహిళలు ఈ హామీకి ఆకర్షితులై కూటమి పార్టీలకు ఓట్లు వేశారు. ఎన్నికలు జరిగి ఏడాది కావస్తోంది. వచ్చే ఉగాది నుంచి ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఉంటుందని ముఖ్యమంత్రి సైతం మాట్లాడారు. రవాణా మంత్రి ఎన్నో సార్లు మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై మాట్లాడారు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా ఉచితంగా మహిళలకు బస్ ప్రాయాణంపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఉన్నట్లుండి చావు కబురు చల్లగా చెప్పారు. గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.
జిల్లాల్లోనే ఉచిత ప్రయాణ మట..
ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఆయా జిల్లాల పరిధిలోనే ఉంటుందని మంత్రి సంధ్యారాణి వివరించారు. మండలి సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ చెప్పటం విశేషం. పైగా తాము ఇచ్చిన హామీ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాలో మాత్రమే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఉంటుందని మాత్రమే చెప్పామన్నారు. విన్నవారు విస్తుపోవడం తప్ప నోరు విప్పినా ఉపయోగం లేదని ఆమె మాటలు విష్పష్టం చేశాయి.
ఎప్పటి నుంచో కూడా స్పష్టత లేదు
ఉచిత బస్ ప్రమాణం ఎప్పటి నుంచో కూడా స్పష్టత లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడు సార్లు ఉచిత బస్ ప్రయాణం పై ప్రకటనలు చేశారు. ప్రతిదీ ఊరించడం తప్ప అనుకున్నప్పుడు అమలు చేసే పరిస్థితులు లేవు. హామీ ఇచ్చిన ఉచిత పథకాలన్నీ అమలు చేయాలంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఈ హామీలను చూస్తే భయమేస్తోందని చెప్పకనే చెప్పారు. అంటే అమలు చేసే అవకాశాలు చాలా తక్కువని ఆయన మాటలు చెప్పకనే చెప్పాయి. మంత్రి జిల్లాల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందని అన్నారే కాని ఎప్పటి నుంచి అమలు చేస్తామో చెప్పలేదు.
ఉపయోగం లేని ఉత్తుత్తి అధ్యయనాలు
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకంపై మూడు సార్లు అధ్యయనాలు జరిగాయి. రెండు సార్లు మంత్రుల కమిటీలు కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి అధికారులు, మంత్రులతో సమావేశాలు నిర్వహించి అమలు ఎలా చేస్తున్నారు. అందులో ఎదురవుతున్న సాధక బాధకాలు ఏమిటనేవి తెలుసుకున్నారు. ఆ తరువాత ఉన్నతాధాకారుల కమిటీ ఒకసారి వెళ్లి ఆయా రాష్ట్రాల్లో పర్యటనలు చేసి వారి నివేదికను కూడా ప్రభుత్వం తీసుకుంది. ఆ నివేదికల్లో ఏముందనే విషయం నేటికీ బయట పెట్టలేదు. సీఎం, డిప్యూటీ సీఎం, విద్య మంత్రి లోకేష్ లాంటి వారు ఉచిత బస్ ప్రయాణంపై ఎన్నోసార్లు మాట్లాడారు. అమలు చేదూసి తీరుతామన్నారు.
భగ్గుమంటున్న మహిళలు
ప్రభుత్వం చెప్పిందేమిటి? చేస్తున్న దేమిటి? ఎందుకు ఈ సన్నాయి నొక్కులు అంటూ మహిళా నాయకు రాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎం మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూళిపాళ రమాదేవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏ ఎన్నికల్లో అయినా జనాభాను నమ్మించటానికి హామీలు ఇస్తాడు. మోసం చేయటం కూడా ఆయనకు పరిపాటి. ఏ హామీనైనా నీరు గార్చడం అనేది చంద్రబాబుకు వెన్నతో నేర్పని విద్య అన్నారు. గతంలోనూ ఎన్నో హామీలు ఇలాగే నీరు గార్చారన్నారు. ఈ జనాలను ఈజీగా మభ్య పెట్టొచ్చు అనే ధైర్యం చంద్రబాబుకు ఉంది. రోడ్డుపైకి వచ్చి చొక్కా పట్టుకునే ధైర్యం ప్రజలకు లేదనే ధైర్యం కూడా చంద్రబాబుకు ఉందని ఆమె చెప్పటం విశేషం.
ఉచిత బస్ ప్రయాణ పథకమే కాదు, చాలా పథకాలు ఇప్పటికీ అమలు చేయలేదు. కూటమి నాయకులు మహిళల విశ్వాసం ఎప్పుడో కోల్పోయారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షు రాలు వరుదు కల్యాణి అభిప్రాయ పడ్డారు. మహిళల్లో 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారికి నెలకు రూ. 1500 లు ఇస్తామని ప్రకటించిన మహా శక్తి పథకం కూడా అటకెక్కిందన్నారు. ఇక సూపర్ సిక్స్ లో చెప్పిన మహిళలకు ఉచిత హామీ పథకం లేదనే భావనకు మహిళలు వచ్చారన్నారు. తల్లికి వందనం పథకంలోనూ ఇంట్లో ఒక్కరికే నని కోత విధించారని, చెప్పనవి చెప్పినట్లు చంద్రబాబు ఎప్పుడూ అమలు చేయలేదన్నారు.