గగన్ యాన్ కు మార్గం..
"స్పేస్‌లో 2 వేర్వేరు శాటిలైట్లను అనుసంధానించి.. సింగిల్ ఆబ్జెక్ట్‌గా మార్చింది" ఈ ప్రయోగం ద్వారా యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా , రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. అంతేకాకుండా, ఇది స్పేస్ స్టేషన్, గగన్‌యాన్, చంద్రయాన్-4 ప్రయోగాలకు మార్గం సుగమం చేసిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
వాటి ఆలంబనగా...
భారీ వాహక నౌకల ప్రయోగం చేయడానికి మూడో లాంచ్ ప్యాడ్ అవసరమని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ (మూడు రోజుల కిందట ఆయన ఆ పదవి నుంచి వైదొలిగారు) కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు.
2024 డిసెంబర్ 30వ తేదీ ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ 60 విజయవంతమైన తరువాత డాక్టర్ సోమనాథ్ ఏమి చెప్పారంటే..
"2025లో ఇస్రో ద్వారా శ్రీహరికోట నుంచి ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో భారీ వాహక నౌకల ప్రయోగంతో పాటు వ్యోమగాములను పంపించడమే కర్తవ్యం" అని చెప్పడం గమనార్హం. జాబిల్లి చెంత స్పేస్ స్టేషన్ నిర్మాణం, యాత్రికులను తీసుకువెళ్లే కలలను సాకారం చేస్తాం" అని కూడా ఆయన ప్రకటించారు. శాస్త్రవేత్తల కలలు, లక్ష్యాలను సాకారం చేసే దిశగా భారీ వాహక నౌకల ప్రయోగానికి అవసరమైన మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు అనువుగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం కూడా ఇస్రో శాస్త్రవేత్తలు లక్ష్యాలు సాధించడానికి బాటలు వేసిందని చెప్పవచ్చు.
అమలు.. వ్యూహం.. లక్ష్యాలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోట షార్ కేంద్రంలో మూడో లాంచ్ ప్యాడ్ ( Third Lanch Pad - TLP ) లక్ష్యాలు ఇవి. రూ. 3984.86 కోట్ల వ్యయంతో నాలుగేళ్ల కాలపరిమితి లోపు నిర్మించాలనేది లక్ష్యం. దీనికి ప్రస్తుతం ఉన్న రెండో లాంచ్ ప్యాండ్ (SLP) సహాయకారిగా ఉండే విధంగా నిర్మాణం సాగించనున్నారు. కొత్తగా నిర్మించే మూడో లాంచ్ ప్యాడ్ (TLP) నుంచి NGLV (Next Generetion Lanch Vechile) భారీ వాహక నౌకల ప్రయోగం చేయవచ్చు. సెమి క్రయోజెనిక్ స్టేజ్‌తో పాటు NGLV స్కేల్ అఫ్ కాన్ఫిగరేషన్ తో ఉన్న LVM3 వాహనాల ప్రయోగానికి కూడా తోడ్పడుతుంది.
ఏమి సాధిస్తుందంటే..
ఈ మూడో లాంచ్ ప్యాడ్ నుంచి భారీ వాహక నౌకలు ప్రయోగిస్తారు. అంటే 25 టన్నుల బరువును అంతరిక్షంలోకి మోసుకుని వెళుతుంది. ఇందులో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అనువైన సామగ్రితో పాటు, అది పూర్తయ్యాక వ్యోమగాములను తీసుకుని వెళ్లి, వారితో పాటు అవసరమైన మరమ్ముతులు చేయడానికి వీలుగా పరికరాలను పంపడానికి అవకాశం ఉంటుందని షార్ పీఆర్ఓ గోపాలకృష్ణ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి వివరించారు. ఈ భారీ వాహక నౌకల ద్వారా అంతరిక్షయానానికి వెళ్ల వ్యోమగాములు అంతరిక్షంలో అన్వేషణ సాగిస్తారు. అవసరమైన యంత్రాలు కూడా అమర్చడానికి మార్గం ఏర్పడుతుంది.
రెండు లాంచ్ ప్యాడ్లే...
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) లో భారతీయ అంతరిక్ష రవాణా వ్యవస్థకు రెండు లాంచ్ ప్యాడ్ లపైనే ఆధారపడి ఉన్నారు.
1. మొదటి లాంచ్ ప్యాడ్ (FLP) 1989లో ఏర్పాటు చేశారు. అప్పటి ప్రయోగాలకు అనుగుణంగా సుమారు రెండు టన్నులు బరువు ఉన్న వాహకనౌకల ప్రయోగానికి ఇది వేదికగా నిలిచింది.
2. రెండవ లాంచ్ ప్యాడ్ (SLP) 2004లో ఏర్పాటు చేశారు. దీని నుంచి నాలుగు నుంచి ఆరు టన్నుల సామర్థ్యం కలిగిన వాహక నౌకల ప్రయోగానికి వీలుగా ఉంది. ఇదే వేదిక షార్ సాధించిన విజయాల్లో అనేక మైలురాళ్లకు సాక్ష్యంగా నిలిచింది. దీనిని. PSLV రాకెట్ల ప్రయోగం కోసం 30 సంవత్సరాల క్రితం FLP ఏర్పాటు చేశారు. PSLV, SSLV కోసం ప్రయోగాలకు వేదికగా నిలిచింది.
3. ఈ రెండు లాంచ్ ప్యాడ్ ప్రధానంగా GSLV, LVM3 కోసం నిర్మించినా, PSLV కోసం స్టాండ్‌బైగా కూడా పనిచేస్తోంది.
SLP దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తోంది, ఈ ప్లాట్ ఫాం నుంచి చంద్రయాన్-3 మిషన్‌తో సహా PSLV/LVM3, కొన్ని వాణిజ్య మిషన్‌లను ప్రయోగించేందుకు సామర్థ్యాన్ని పెంచారు. రెండో లాంచ్ ప్యాడ్ నుంచి (SLP) కూడా గగన్‌యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను పంపడానికి సమాయత్తం అవుతోంది.
ఎప్పటికంటే..
ఇస్రో రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నది. అందులో ప్రధానంగా 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ (BAS) పూర్తి చేయడం.
2040 నాటికి ఇండియన్ క్రూడ్ లూనార్ ల్యాండింగ్‌తో చేయాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఇందుకోసం ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ విస్తరించడానికి కొత్తతరం భారీ ప్రయోగశాలల అవసరాన్ని ప్రధానంగా ఎంచుకున్నది. రానున్న 25 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల్లో అంతరిక్ష యానంలో కొత్తపుంతలు తొక్కించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి మూడో లాంచ్ ప్యాడ్ ద్వారా సుదీర్ఘ స్వప్నం సాధ్యమైనంత త్వరలో సాధించాలని షార్ శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి కేంద్రం అనుమతించిన నెక్స్ట్ జనరేషన్ లాంచ్ ప్యాడ్ (NGLV) ఆలంబనగా ఉంటుందని పీఆర్ఓగోపీకృష్ణ స్పష్టం చేశారు.