ఏపీలో ఇప్పటివరకు హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వెల్లడించింది.


హ్యూమన్‌ మెటానిమో వైరస్‌(హెచ్‌ఎంపీవీ) ఇప్పుడు భారత దేశాన్ని వణికిస్తోంది. కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు హడిలి పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైరస్‌ కేసులు నమోదు కాలేదని, ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హెచ్‌ఎంపీవీ గురించి, దాని వ్యాప్తి గురించి, తీసుకోవలసిన జాగ్రత్తలు, వైద్య సదుపాయాలు, మందులు అవెయిలబులిటీ, ఆక్సిజన్ సరఫరా, అత్యవసర పరిస్థితులు వంటి అనేక అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు దీనిపైన ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని సీనియర్‌ వైద్య నిపుణులు చెబుతున్నారని ఆయన వివరించారు. మన రాష్ట్రంలో ఎలాంటి హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఈ వైరస్‌కు తేలికపాటి స్వభావం ఉన్నందున ఆందోళన అవసరం లేదన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక ఇన్‌పుట్‌లను అందించడానికి మైక్రో బయాలజిస్ట్‌లు, పీడియాట్రిషియన్‌లు, పల్మోనాలజిస్ట్‌లు, ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌లతో నిపుణుల కమిటీ (టాస్క్‌ ఫోర్స్‌) ఏర్పాటు చేశామన్నారు. పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అంశంపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు అందచేస్తుందన్నారు. ఇది సీజనల్‌ వైరస్‌ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైరస్‌ ప్రభావితుల పరీక్ష కోసం, హెచ్‌ఎంపీవీ వైరస్‌ని పరీక్షించడానికి యూనిప్లెక్స్‌ కిట్‌లను సేకరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఐసిఎంఆర్‌ గుర్తింపు పొందిన 10 వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటిల్లో హెచ్‌ఎంపీవీ పరీక్షలు చేయవచ్చని చెప్పారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పూణేలో హెచ్‌ఎంపీవీ నిర్ధారణ పరీక్ష జరగాలని కేంద్రం సూచించిందన్నారు.

ఐసిఎంఆర్‌ గుర్తింపు పొందిన వీడీఆర్‌ఎల్‌ ల్యాబ్‌లకు అవసరమైన టెస్టింగ్‌ కిట్‌లను సరఫరా చేస్తామని కేంద్రం తెలిపిందన్నారు. జర్మనీ నుండి మొదటగా 3000 టెస్టింగ్‌ కెపాసిటీ కిట్‌లను కొనుగోలు చేయాలని సూచించారు. 4.50 లక్షల 95 మాస్క్‌లు, 13.71 లక్షల ట్రిపుల్‌ లేయర్డ్‌ మాస్క్‌లు, 3.52 లక్షల పీపీఈ కిట్లు తక్షణమే అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియచేశారు. రాబోయే మూడు నెలలకు సరిపడా వీటిని సేకరించాలని సీఎం సూచించారు. చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతపైన కూడా సీఎం సమీక్షించారు. హెచ్‌ఎంపీవీ సంబంధిత అనారోగ్యం చికిత్సకు అవసరమైన మందులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియచేశారు. అవసరమైతే, రిబావిరిన్‌ వంటి ప్రత్యేక మందులను ఎపిఎంఎస్‌ఐడిసి ద్వారా సరఫరా చేసే వరకు స్థానికంగానే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.

అన్ని ప్రభుత్వ బోధన, జిల్లా ఆసుపత్రులలో 20 పడకల ఐసోలేషన్‌ వార్డులను అవసరమైతే సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని అన్ని ఓపీ ప్రాంతాలలో ఆటో శానిటైజర్‌ డిస్పెన్సర్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అంతరాయం లేని ఆక్సిజన్‌ సరఫరా, ఆక్సిజన్‌ పైపు లైన్లు, లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా, పిఎస్‌ఎ ప్లాంట్ల లభ్యత వంటి అంశాలపై అన్ని ఆసుపత్రులలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలో నమోదయిన అనుమానాద్సద కేసులను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. హ్యాండ్‌ వాష్, మాస్క్‌ వాడకం, పరిశుభ్రత నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్‌ సీఎస్‌ ఎంటీ కృష్ణబాబుతో పాటు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ మంజుల, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ వాకాటి కరుణ, ఎపిఎంఎస్‌ ఐడిసి ఎండి డాక్టర్‌ ఎ సిరి, డిఎంఇ డాక్టర్‌ నరసింహం, డిహెచ్‌ డాక్టర్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
Next Story