సీను మారింది...కబ్జాదారులు ఖబడ్దార్...
x
ఫిర్యాదు తీసుకుంటున్న పోలీసులు

సీను మారింది...కబ్జాదారులు ఖబడ్దార్...

భూ వివాదాల పరిష్కారానికి విశాఖ పోలీస్ శాఖ నడుం బిగించింది. ఫిర్యాదు అందితే పక్కకి తప్పుకునే పోలీసులు ఇప్పుడు పిలిచి మరీ ఫిర్యాదులు ఎందుకు స్వీకరిస్తున్నారు...?


తంగేటి నానాజీ విశాఖపట్నం



విశాఖ వంటి మేజర్ నగరాల్లో భూ వివాదాలు పెరిగిపోయాయి.విపరీతంగా భూముల రేట్లు పెరగడం... కబ్జాలు చేసినా పోలీసుల జోక్యం అంతంత మాత్రంగా ఉండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు...ఇక భూవివాదాలపై కోర్టులకు ఎక్కితే ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరగడమే...ఈ లొసుగులనే అడ్డం పెట్టుకుని పలువురు భూ దందాలు నిర్వహిస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాదారులు పాగా వేసేస్తున్నారు.నకిలీ డాక్యుమెంట్లతో, దౌర్జన్యాలతో భూముల ఆక్రమణలకు తెగబడుతున్నారు. ఇటీవల కాలంలో విశాఖ నగరంలో ఇలాంటి ఫిర్యాదులు అధికమైపోయాయి...

పొమ్మన్న పోలీసే రమ్మంటున్నారు...

భూ వివాదమా... అమ్మో సివిల్ కేస్... కోర్టుకెళ్ళి తేల్చుకోండి... అంటూ ఫిర్యాదుదారులను వెనక్కి పంపించేసే పోలీసులు... రండి బాబు రండి... ఫిర్యాదు చేసుకోండి.... మీ భూ వివాదాన్ని పరిష్కరించుకోండి... అంటూ బాధితులను పిలిచి మరీ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఉన్నతాధికారుల సమక్షంలో స్వీకరించిన ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం సూచిస్తున్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాల మేరకు భూ కబ్జాలు, ఆక్రమణాలపై 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో 191 ఫిర్యాదులు అందాయి.

భూ కబ్జాలు కొత్త కాదు...

విశాఖ మహానగరంలో భూకబ్జాలు కొత్త కాదు... గతంలో భారీ ఎత్తున భూ కుంభకోణాలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వాలకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీంతో గత టిడిపి ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తో పాటు రెవెన్యూ పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను నియమించింది. ఈ బృందం దర్యాప్తులో పలు భూకబ్జాలు, రెవెన్యూ రికార్డుల టాంపరింగ్లు బయటపడ్డాయి. అయితే ఈ భూకబ్జాల వెనక బడా బాబులు ఉండడంతో సిట్ బృందం నివేదిక సమర్పించినప్పటికీ అది బహిర్గతం కాలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ విశాఖ భూ కుంభకోణాలపై మరో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం దర్యాప్తు పూర్తయినప్పటికీ నివేదిక మాత్రం బహిర్గతం కాలేదు. తర్వాతి కాలంలో న్యాయశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, గ్రేటర్ కార్పొరేషన్ అధికారుల బృందంతో భూ సమస్యల పరిష్కారానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి వారం ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో కొన్ని పరిష్కరించినప్పటికీ ఎక్కువ కాలం ఇది సాగలేదు.


స్పెషల్ డ్రైవ్ కి కారణం ఏంటి...

ఒక్కసారిగా పోలీసులకు ప్రజల భూ సమస్యలను పరిష్కరించాలని ఎందుకు అనిపించింది... 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నతాధికారుల సమక్షంలో ప్రజల నుండి భూ వివాదాల ఫిర్యాదులు స్వీకరించాలని పోలీస్ బాస్ ఎందుకు ఆదేశించారు.... దీని వెనక కదేంటి...
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా రెండు వారాల క్రితం ఉదయం 11 గంటల నుంచి 1:00 వరకు జరిగే స్పందన కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ ఐ ఎన్ ఆర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. సమయం ముగియడంతో కార్యక్రమాన్ని క్లోజ్ చేసి బయటకు వెళ్తున్న క్రమంలో ఓ పండు ముదుసలి ఆయన కంటపడింది. దీంతో ఆయన ఒక్క క్షణం ఆగి ఆమెను పలకరించారు.
'ఏంటి అవ్వ ఇలా వచ్చావు నీ కష్టం ఏంటి' అనగానే ఆమె ఒక ఫిర్యాదు చేతిలో పెట్టింది. తన భూమి కబ్జాకు గురైంది అంటూ విలపించింది. అంతే ఒక్కసారిగా చలించిన కమిషనర్ ఆమెను వెంటబెట్టుకొని విశాఖ నగర శివారు ప్రాంతమైన మధురవాడ వివాద స్థలానికి చేరుకున్నారు. స్థానిక పోలీస్ అధికారులను పిలిచి అవ్వ వివాదాన్ని చిటికలో పరిష్కరించారు. దీంతో ఇలాంటి సమస్యలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్న కమిషనర్ మీడియాని పిలిచి ప్రతి బుధవారం భూ సమస్యలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.


Read More
Next Story