ఇక్కడ కమ్మోళ్ల ఓట్లెక్కువే.. కానీ వారికి సీటు లేదు!

కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే, అయినా ఆ వర్గానికి ఇక్కడ సీటు లేదు. ఆ సామాజిక వర్గం నుంచి నాకు సీటు కావాలని పట్టుపట్టిన వారు కూడా లేరు.


ఇక్కడ కమ్మోళ్ల ఓట్లెక్కువే.. కానీ వారికి సీటు లేదు!
x
జగ్గయ్యపేట టౌన్ వ్యూ ఫొటో

G. Vijaya Kumar

ఆం«ధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జగ్గయ్యపేట నియోజక వర్గం కమ్మ సామాజిక వర్గానికి బలమైన కేంద్రం. మొత్తం ఓటర్లలో సుమారు 40వేలకుపైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే ఉన్నాయి. ఇంత బలమున్న జగ్గయ్యపేట నియోజక వర్గంలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి దొరక పోవడవం ఎన్టీఆర్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ నియోజక వర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నెట్టెం రఘురామ్‌ తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.
నెట్టెం కు టిక్కెట్ ఎందుకివ్వరు..
రఘురాం రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఎన్టీఆర్‌ జిల్లా టిడిపి బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఎన్టీర్‌ జిల్లా టిడిపి అధ్యక్షులుగా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. టిడిపిలో ఆయన గెలిచిన కాలంలో మంత్రి పదవి కూడా నిర్వహించారు. అటువంటి నెట్టెం రఘురామ్‌కు ఎందుకు సీటు ఇవ్వ లేదనిది కూడా చర్చ సాగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆర్థికంగా స్థితి మంతులైతే తప్ప పోటీని తట్టుకుని నిలబడటం అనేది రాజకీయ పార్టీల్లో పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యమే ఆయనకు సీటు దక్కకుండా చేసిందనేది ఆ పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న ప్రచారం.
తెలుగుదేశం పార్టీ నుంచి నేను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కమ్మ సామాజిక వర్గానికి చెందిన బొల్లా రామకృష్ణ తెర ముందుకు వచ్చారు. ఆయనది జగ్గయ్యపేటలోని వత్సవాయి మండలం. అయినా టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రామకృష్ణ వైపు మొగ్గు చూపలేదు. డబ్బు ఒక్కటే సరిపోదని పార్టీలో సీనియరిటీ, నాయకత్వం లక్షణం కూడా ఉండాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు చేశారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయనకు సీటు ఇవ్వలేక పోయారని సమాచారం.
తాతయ్యకే టికెట్‌
ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా మాజీ ఎమ్మెల్యే టిడిపి సీనియర్‌ నేత శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్యకు చంద్రబాబు బెర్తు కేటాయించారు. ఈయన వైశ్య సామాజికి వర్గానికి చందిన వారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓట్లు జగ్గయ్యపేట నియోజక వర్గంలో చాలా తక్కువేనని చెప్పాలి. జగ్గయ్యపేట పట్టణంలో పసుమారు 5వేలు వైశ్య ఓటర్లు ఉండగా నియోజక వర్గంలోని తక్కిన ప్రాంతాల్లో కలిపి అదనంగా మరో 1000 వరకు వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే శ్రీరామ్‌ తాతయ్యకు సీటు దక్కే అవకాశమే లేదు. అయితే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కావడం, రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండటం, ఓటర్లును ఆకట్టుకొనే సత్తా ఉండటంతో పాటుగా ఆర్థికంగా స్థితి మంతులు కావడం వల్లే ఆయనకు సీటు దక్కిందనే ప్రచారం సాగుతోంది.
స్థానికేతరులను స్వాగతిస్తారో లేదో అనే అనుమానం
ఆర్థికంగా బలమైన కమ్మ సామాజిక వర్గం నాయకులు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరినో ఒకరిని ఎంపిక చేసి జగ్గయ్యపేటలో పోటీకి దించొచ్చు. అయితే ఆ పని కూడా చంద్రబాబు చేయలేదు. స్థానికేతరులను స్వాగతిస్తారో లేదో అనే అనుమానంలో ఆ సాహసం చంద్రబాబు చేయలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి వైఎస్‌ఆర్‌సిపిలోను కొనసాగుతోంది. అంత బలమైన కమ్మ సామాజిక వర్గం నుంచి వైసిపి వైపు చూసే నాయకుడే లేకపోవడం ఆశ్చర్యంగానే భావించొచ్చు.
వైఎస్‌ఆర్‌సిపి ప్రస్తుత ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో రెండు సార్లు తాతయ్యమీద ఓటమిని చవి చూశారు. 2019 ఎన్నికల్లో గెలిచారు. తిరిగి వైసిపి అభ్యర్థిగా టిడిపి అభ్యర్థి శ్రీరామ్‌ తాతయ్యపై పోటీ చేసే అవకాశం ఉంది.
ఆదిపత్య వర్గానికి చోటు దక్కలేదు..
ఏ నియోజక వర్గంలోనైనా ఏ సామాజిక వర్గం బలంగా ఉంటుందో ఆ సామాజిక వర్గానికి పార్టీలు పెద్ద పీట వేస్తాయి. వారిలో నుంచే ఒకరిని నాయకుడిగా ఎంపిక చేసుకుంటారు. కానీ జగ్గయ్యపేటలో విశేషం ఏమిటంటే ఎవరైతే ఆదిపత్య సామాజిక వర్గంగా ఉంటున్నారో వారికి రాజకీయాల్లో చోటు దక్కక పోవడం గమనార్హం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గెలుపే ముఖ్యమని సీటిచ్చారు: నెట్టెం రఘురాం, మాజీ మంత్రి, ఎన్టీఆర్‌ జిల్లా టిడిపి అధ్యక్షులు.
నేను 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నాను. అప్పట్లో నాకున్న ఇబ్బందుల దృష్ట్యా నేనే శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్యను రాజకీయల్లోకి తీసుకొచ్చాను. పార్టీ ఆయనపై నమ్మకం ఉంచింది. నన్ను, శ్రీరామ్‌ తతాయ్య అభ్యర్థిత్వాన్ని నమ్మి ఓటర్లు గెలిపించారు. సామాజిక వర్గం పరంగా చూసినప్పుడు వైశ్య సామాజిక వర్గానికి కూడా ఎక్కడో ఒక చోట అవకాశం కల్పించాల్సిందే. టిడిపికి నమ్మకమైన నాయకుడిగా ఉండటం, ప్రజల్లో మంచి పేరు సంపాదించు కోవడంతో గెలవగలిగిన సత్తా ఉన్న నాయకుడు శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్యేనని భావించి చంద్రబాబు టికెట్‌ ఇచ్చారు. నేను టీడీపీలో బాధ్యత కలిగిన వ్యక్తినే. ఎన్టీర్‌ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా పని చేస్తున్నాను. టిడిపి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి. అందుకే శ్రీరామ్‌ తాతయ్యని అందరం బలపరుస్తున్నాం. అంతే తప్ప సామాజిక వర్గం ఎక్కువ ఉన్నంత మ్రాతాన ఆ సామాజిక వర్గానికే సీటు ఇవ్వాలనే ఆలోఎచన సరైంది కాదని మా నాయకుడికి అనిపించింది.
Next Story