రిపబ్లిక్‌డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఆంధ్ర రాష్ట్రంలో అన్నా చెల్లెళ్ల మధ్య చెలరేగిన గాలివాన ఇప్పుడు తుఫాన్‌గా మారుతున్నది. ఈ తుఫాన్‌ ఏ తీరాన్ని తాకుతుందో వేచి చూడాల్సిందే.


ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రానురాను ప్రతిపక్షాన్ని జనం మరిచిపోయేట్టున్నారు. ఎందుకంటే ఆసక్తికరమైన రాజకీయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మధ్య జరుగుతోంది. తిరుపతిలో మూడు రోజుల క్రితం జరిగిన ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై వ్యాఖ్యానించారు. అప్పటి వరకు వైఎస్‌ షర్మిల కుటుంబ వ్యవహారాల జోలికి పోలేదు. రాజకీయ పరమైన అంశాలపైనే దృష్టిపెట్టారు. రాష్ట్రంలో అధికారపక్షం, ప్రతిపక్షం ప్రజలకు సౌకర్యాలు కలుగ జేయడంలో విఫలమైన విషయంపై బాణం ఎక్కుపెట్టారు. పైగా నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదని కూడా బాధ్యతల స్వీకరణ సభలో స్పష్టం చేశారు. నేను ఆంధ్రరాష్ట్ర ప్రజల బాగోగులు చూడటానికి మాత్రమే వచ్చానని, నా తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఆదుకున్నారో ఆ విధంగా ఆదుకోవాలని తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. పైగా ప్రాజెక్టుల విషయంలో అధికార ప్రతిపక్షాల తీరును దుయ్యబట్టారు. రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏ విధంగా దాసోహం అంటున్నాయో వివరించారు.

అన్నాచెల్లెలి మధ్య పొరపొచ్చాలు ఎందుకొచ్చాయో ఒక్కొక్కటిగా...
ఇప్పుడు రాష్ట్రభివృద్ధి రాజకీయాలు మరుగున పడుతున్నాయి. వైఎస్‌ఆర్‌ కుటుంబ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. అన్నా చెల్లెళ్ల మధ్య ఎందుకు పొరపొచ్చాలు వచ్చాయో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సోషల్‌ మీడియాలో తండ్రి ఇంటిపేరు కుమార్తెకు ఎందుకు వస్తుంది, భర్త ఇంటిపేరు రావాలి కదా అంటూ సెటైర్లు వేశారు కొందరు ఆకతాయిలు. వారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులే. అయితే రిపబ్లిక్‌ రోజున ఆమె ధీటైన సమాధానం ఇచ్చారు. నేను వైఎస్‌ఆర్‌ బిడ్డను ఆయన రక్తం నాలో ఉంది. నేను ఆయన కూతురైనప్పుడు ఆయన ఇంటిపేరు లేకుండా ఎలా పోతుంది. ఇటువంటి మాటలు మాట్లేడేవారికి తలాతోకా ఉండదన్న భావం వచ్చే విధంగా మాట్లాడి ప్రజల అభినందనలు అందుకున్నారు.

నిజంగా భారతమ్మ పాదయాత్ర చేయాలనుకున్నదా?

అన్న వైఎస్‌ జగన్‌ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య భారతమ్మ పాదయాత్ర చేయాలనుకున్నదంట, ఈ విషయం జైలు సూపరింటెన్‌డెంట్‌ చెప్పాడంట, ఇదే నిజమైతే ఆ సూపరింటెన్‌డెంట్‌తో మాట్లాడించండి. నేను ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధం. ఎందుకు ఇటువంటి స్వార్థపూరిత రాజకీయాలపై మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు షర్మిల. జగన్‌ సీఎం అయ్యాక నా తల్లి విజయమ్మతో కలిసి ఒకే ఒక్కసారి జగన్‌ వద్దకు వెళ్లాను. నా భర్త ఒక్కరోజు కూడా జగన్‌ అన్నను కలవలేదు. నేను డబ్బుసంపాదనే ధ్యేయంగా స్వార్థం కోసం వ్యవహరించి ఉంటే ఇలాగే ఉంటానా? అంటూ మండిపడటం కూడా పలువురిలో ఉద్వేగాన్ని రేకెత్తించింది. నన్ను అడిగితేనే నేను పాదయాత్ర చేశా. అది గుర్తుంటే చాలని చెప్పడం, తప్పుడు నిందలు వేస్తే పైన దేవుడున్నాడంటూ వ్యాఖ్యానించడం విశేషం.
కలకలం సృష్టిస్తున్న వ్యాఖ్యలు
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. జనం చూపు షర్మిలవైపు మళ్లింది. పైగా ఆమె రాష్ట్రంలోని వైఎస్సార్‌కు అత్యంత ప్రీతి పాత్రులైన వారిని కలుస్తోంది. అది కూడా షర్మిలకు ఒక విధంగా కలిసొచ్చే అవకాశం. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను గురువారం తన ఇంట్లో కలిసిన తరువాత ఆయన స్వరంలో కొంచెం తేడా వచ్చింది. అప్పటి వరకు జగన్‌పై ఒక్క మాట కూడా పడకుండా సోషల్‌ మీడియాలో మాట్లాడిన అరుణ్‌కుమార్‌ కాస్త వాయిస్‌ తగ్గించుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా వచ్చి పలకరించింది. నన్ను ఆశీర్వదించమని కోరింది. అందులో తప్పేముంది అంటూ ముక్త సరిగా మీడియా ముందు మాట్లాడి వెళ్లిపోయారు. నిజానికి ఆయన మీడియా ముందుకు వస్తే కనీసం అరగంటపైనైనా మాట్లాడతారు.
Next Story