ఒక యువతి చెన్నైలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యువకుడిని కారుతో తొక్కించి చంపేసింది. ఎవరు ఆమె. ఎందుకు ఈ సంఘటన జరిగింది.


డబ్బులు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ల పిల్లలు ఏమి చేసినా చెల్లుబాటవుతుంది. చెన్నైలో అదే జరిగింది. ఒక యువకుడిపై నుంచి కారుపోనిచ్చి ఆ యువకుడి మరణానికి కారకురాలైన ఆ యువతిని పోలీసులు స్టేషన్‌ బెయిలిచ్చి వదిలేశారు. ఇదేమి విచిత్రం అనుకుంటున్నారా? ఇది నిజం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు వాసి బీద మస్తాన్‌రావు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు. ఆయన కుమార్తె బీద మాధురి యాదవ్‌ బిఎంఆర్‌ గ్రూపుకు వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. డాక్టర్‌ బీద మస్తాన్‌రావు పేరుతో బిఎంఆర్‌ గ్రూపు ఏర్పడింది. ఈ గ్రూపు దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తోంది. ప్రధానంగా రొయ్యల ఎగుమతులు, రొయ్యలతో తయారు చేసిన ఫుడ్‌ ఐటమ్స్, ఫాసెసింగ్‌ వంటివి చేయడం ద్వారా బీఎంఆర్‌ గ్రూపుకు మంచి పేరు వచ్చింది. వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందింది. బీద మస్తాన్‌రావు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండే వారు 2019లో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ తరువాత 2022లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. టీడీపీలో ఉండగా జడ్‌పీటీసీ సభ్యునిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు.
మాధురి బాగా చదువుకున్నారు. అమెరికాలో లా పూర్తి చేసింది. చదువు పూర్తి కాగానే తండ్రి మస్తాన్‌రావు తెలంగాణలోని నాగార్జుసాగర్‌కు చెందిన మైతేజ్‌ అనే వ్యక్తితో వివాహం చేశారు. మైతేజ్‌ను ఇల్లరికం తెచ్చుకున్నారు. మస్తాన్‌రావు ఇంట్లోనే ఉండే వారు. మాధురి, మైతేజ్‌ కలిసి బిఎంఆర్‌ వ్యాపార లావాదేవీలు చూసుకునే వారు. రానురాను వారిద్దరి మధ్య స్పర్థలు వచ్చాయి. ఇటీవల వారు వేరువేరుగా ఉంటున్నారు. బీఎంఆర్‌ గ్రూపుకు ఏపీ, తమిళనాడు, ఒడిస్సా, గుజరాత్‌ రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉన్నాయి. రొయ్యలు, రొయ్యల ఉత్పత్తులు విదేశాలకు ఈ రాష్ట్రాల నుంచి ఎగుమతులు జరుగుతుంటాయి. హేచరీస్‌ కూడా ఉన్నాయి. రొయ్యల రైతులకు ఫీడ్‌ సప్లై చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. రొయ్యల ప్రాసెసింగ్‌ ఎక్స్‌పోర్టు మీద ఎక్కువ దృష్టి పెట్టారు.
బిఎంఆర్‌ గ్రూపుకు వైస్‌ చైర్మన్, డైరెక్టర్‌గా మాధురి వ్యవహరిస్తున్నారు. చెన్నైలో తన స్నేహితులతో కలిసి ఎక్కువగా ఉంటుందని సమాచారం. మాధురి ఆలోచనలతో నాన్‌వెజ్‌ ఐటమ్స్‌ డోర్‌ డెలివరీ చేసే సంస్థను ఏర్పాటు చేశారు. ఇస్కపో పేరుతో ఈ సంస్థను స్థాపించి కొంతకాలం నడిపారు. దీనికి ఈమె ఎండీగా ఉన్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి రిటైల్‌ ధరలకు నాన్‌వెజ్‌ సప్లై చేసే సంస్థకు నష్టాలు రావడంతో దీనిని మూసి వేశారు. ప్రస్తుతం బీఎంఆర్‌ సంస్థ పరిపాలనా వ్యవహారాలు చెన్నై కేంద్రగా ఈమె నిర్వహిస్తున్నారు.
ఆరోజు ఏమి జరిగిందంటే..
సోమవారం రాత్రి తన కంపెనీలో పనిచేసే స్నేహితురాలు ప్రియ సుందరంతో కలిసి సరదాగా బిఎండబ్లు్య కారులో బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో చెన్నైలోని బీసెంట్‌ నగర్‌లో ఫుట్‌పాత్‌పై పడుకుని ఉన్న పెయింటర్‌ సూర్య (24)పైకి కారు అదుపు తప్పి ఎక్కింది. దీంతో సూర్య ఎముకలు విరిగి చావు బతుకుల మధ్య ఉండగా తన స్నేహితురాలు అంబ్‌లెన్స్‌కు ఫోన్‌ చేసింది. ఈలోపు చుట్టుపక్కల వారు వచ్చి గొడవకు దిగారు. మాధురి స్నేహితురాలు ప్రియ సుందరం వారిపై వాదనకు దిగింది. గొడవ ఎక్కువ కావడంతో తమపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన వీరు కారుతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయారు. సూర్యను ఆస్పత్రికి తీసుకు పోయేలోపులోనే మృతి చెందాడు. సూర్య పెయింట్‌ పని చేస్తుంటాడు. ఆయనకు ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది. భార్యతో గొడవపిన సూర్య ఫుట్‌ఫాత్‌పై పడుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తరువాత వేగంగా వచ్చిన కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకు వెళ్లడంతో టైర్లకిం సూర్య నలిగిపోయాడు. తన భర్త చావుకు కారణమైన మాధురిపై సూర్య భార్య వినిత చెన్నైలోని జె–5 శాస్త్రి నగర్‌లో పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాధురిని అరెస్ట్‌ చేశారు.
వీరు సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోవడం వల్ల ఎవరనేది తెలియలేదు. సీసీ టీవీ పుటేజ్‌ ఆధారంగా కారును గుర్తించి కారు నెంబరు తీసుకున్నారు. మాధురి స్నేహితురాలు అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినందున ఆ నెంబర్‌ను అంబులెన్స్‌ డ్రైవర్‌ వద్ద తీసుకుని ఆమెకు ఫోన్‌ చేసి స్టేషన్‌కు పిలిపించి అరెస్ట్‌ చేశారు. అయితే ఆమె ఒక పెద్ద సంస్థకు వైఎస్‌ చైర్మన్‌ కావడం, బాగా డబ్బున్న రాజ్యసభ సభ్యుడు తండ్రి కావడం వల్ల ఆమెకు పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి వెంటనే పంపించారు. ఒక యువకుడు దుర్మరణం చెందటానికి కారణమైన యువతికి స్టేషన్‌ బెయిల్‌ ఎలా ఇస్తారనేది చర్చనియాంశంగా మారింది. కారు నడిపే సమయంలో ఆమె మద్యం సేవించి ఉన్నారా? లేదా? అనేది వైద్య పరీక్షల్లో మాత్రమే వెల్లడి అవుతుంది. పబ్బులు, ఇతర విలాస వంతమైన జీవితానికి దూరంగా మాధురి ఉంటుందని బిఎంఆర్‌ సంస్థలోని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఇటీవల భర్తతో దూరంగా ఉంటున్నందున పద్దతులు మారాయేమోననే అనుమానాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోనే ఎక్కువ రోజులు ఉన్నారు. అక్కడే చదువులు సాగినట్లు సమాచారం. మస్తాన్‌ రావుకు కుమారుడు కూతురు ఉన్నారు. కుమారుని పేరు మనోజ్, కుమార్తె పేరు మాధురి యాదవ్‌.
Next Story