వివేకా ఇంట్లో ఎంత సొత్తు పోయినట్టు?
x
Source: Twitter

'వివేకా' ఇంట్లో ఎంత సొత్తు పోయినట్టు?

నెల్లూరు నగరంలో అలజడి రేగింది. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో ఏం జరిగింది.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: నెల్లూరు నగరంలో అలజడి చెలరేగింది. అది కూడా " ఆనం" కుటుంబంలో మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన జిల్లాలో చర్చకు ఆస్కారం కల్పించింది. ఆనం కుటుంబం. పరిచయం అవసరం లేని వ్యక్తులు. సింహపురి రాజకీయాల్లో వారి ముద్ర ప్రత్యేకమైనది. విలక్షణమైనది. ఎన్నికల వేళ జరిగిన సంఘటన నేపథ్యంలో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
నెల్లూరు మున్సిపల్ చైర్మన్‌గా, నగర ఎమ్మెల్యేగా పనిచేసిన ఆనం వివేకానంద రెడ్డి వ్యవహార శైలి విభిన్నమైనది. సాధారణంగా అందరితో కలిసి పోతారు. గన్మెన్ లేకుండా ఒంటరిగానే తిరగడం ఆయనకు సరదా. అలంకరణ వస్తువులు అంటే మహా ప్రీతి. చెప్పులు నుంచి, వాడే డ్రెస్, కళ్లద్దాలు, చెవికి పోగు, హెయిర్ స్టైల్, వినియోగించే సెల్ ఫోన్లు అన్నిట్లో ఆయన ప్రత్యేకత చూపిస్తారు. ఇక మాట తీరు ఇలా ఉంటుంది అంటే.. సినిమా నటులు కూడా పనికిరారు. అంతలా హావభావాల ప్రదర్శనతో పాటు డైలాగులు కూడా ఉంటాయి. అది ఆనం వివేకానంద రెడ్డి స్టైల్. ఆనం వివేకానంద రెడ్డి నెల్లూరు నగర శాసనసభ స్థానం నుంచి 1999, 2004 రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనం వివేకానంద రెడ్డి 2018 ఏప్రిల్ 25వ తేదీన తుది శ్వాస విడిచారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే..

గదిని పరిశీలిస్తున్న ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు

కలకలం రేపిన చోరీ
వివేకానంద రెడ్డి నివాసంలో జరిగిన చోరీ నగరంలోనే కాదు. జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ప్రచార సరళి ఊపు అందుకుంటున్న పరిస్థితుల్లో జరిగిన సంఘటన కలకలం రేపింది. వివేకానంద రెడ్డి తుది శ్వాస విడిచినప్పటి నుంచి.. నివాసంలో.. ఆయన వినియోగించే గది తాళం వేసి ఉంచారు. అప్పటి నుంచి ఆ గది వినియోగంలో లేదని సమాచారం. వివేకానంద రెడ్డి జీవించి ఉన్న సమయంలో ఆయన వినియోగించిన అలంకరణ వస్తువులతో పాటు కొన్ని ఆభరణాలను కూడా ఆ గదిలోనే ఉంచారనే చర్చ జరుగుతోంది. గది తాళం పగలగొట్టి సామాగ్రి చిందర వందర చేశారు.. గదిలోపల సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. ఇది ఎవరి పని? తెలిసినవారే చోరీకి పాల్పడ్డారా? ఎవరైనా ప్రవేశించారా? ఇందులో ఎలాంటి వస్తువులు చౌడేకి గురయ్యాయి. అనే మిస్టరీ వీడలేదు. ఇప్పటివరకు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదని సమాచారం.
మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి గమనించారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆయన ఫిర్యాదు చేస్తే కానీ ఏమి చోరీకి గురిందనేది తెలియదు. ఈ సంఘటనపై నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని ఫెడరల్ న్యూస్ సంప్రదించింది. మాజీ ఎమ్మెల్యే నివాసంలో చోరీ జరిగిన విషయం ఇంకా తమ దృష్టికి రాలేదని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.


Read More
Next Story