జగన్, షర్మిల తగాదా పరిష్కరించడం విజయమ్మకు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విషయంలో ఎవ్వరూ తలదూర్చవద్దని మాజీ మంత్రి బాలినేని అన్నారు.
ఆస్తుల కోసం అన్నా చెల్లెలు తగాదాలు పడటం మంచిది కాదని, విజయమ్మ మాత్రమే వీరి తగాదాను పరిష్కరిస్తుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మధ్య ఆస్తుల గొడవలు జరుగుతుండటంపై ఆయన స్పందించారు. ఈ వ్యవహారంలో ఇతరులు ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా వైఎస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటానని అన్నారు.
ఆస్తులు బాగా సంపాదించి పార్టీ మారినట్లు కొందరు ప్రచారం చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘నా కుమారుడి సాక్షిగా చెబుతున్నా వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు నా ఆస్తులు పోగొట్టుకున్నానే కాని సంపాదించుకోలేదు. ఈ విషయం జగన్‌కూ తెలుసు. ఎలా అన్నది మనసులో పెట్టుకున్నా. చాలా ఇబ్బంది కలిగించినా ఏమిటన్నది బయట పెట్టలేదు. సంస్కారం ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడలేదన్నారు. అప్పులు నా తండ్రి, కోడలి ఆస్తులు అమ్మి తీర్చాను. ఇది జగన్‌కు తెలుసు. డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసినప్పుడు ఎన్నికలకు ముందే పార్టీలోకి తీసుకుందామనుకున్నాను. కానీ జగన్‌కు ఎంతైనా బంధువు కదా అని అడగలేకపోయానని పవన్ అన్నట్లు చెప్పారు. జగన్ ఒంగోలు వచ్చినప్పుడు కూడా ఇండ్ల పట్టాల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. మంత్రి పదవి వదులుకుని జగన్ వెంట నడిచాను. ఆ పార్టీలో నాకు ఏమి జరిగిందో ప్రజలకు తెలుసునన్నారు.