సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటించారు. గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలను అడిగి తెలుసుకున్నారు. ఈడ్పుగల్లు రెనిన్యూ సదస్సులో పాల్గొన్నారు.
భూముల రీసర్వే వల్ల భూములు పోయాయని ఫిర్యాదులు వస్తున్నాయని, సెంటు, రెండు సెంట్లు భూమి పోయిందని ఫిర్యాదులు చేస్తున్నారని, ఇలా భూమి గురించి వచ్చే ప్రతి ఫిర్యాదును స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో గంగూరు, ఈడ్పుగల్లులో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును ఆయన పరిశీలించారు. రైతులతో ఆయన ముచ్చటించారు. ఏ పంటను పండిస్తున్నారు? ఏ పద్ధతులను పాటిస్తున్నారు, దిగుబడి ఎలా ఉంది వంటి పలు అంశాలపైన రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేకుండా చూడాలన్నారు. పెట్టుబడి తగ్గించి, రైతుకు ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు.
పెట్టుబడి తగ్గించి రైతులను ఆప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ సంకల్పమన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది పంట ఎక్కువగా వచ్చిందని, మిషన్ కోత వల్ల ఎకరానికి ఐదారు వేలు కలిసి వచ్చిందని రైతులు చెప్పారు. కోసిన గడ్డిని బయో ఫ్యూయల్ ప్లాంట్ వాళ్లు తీసుకుంటే మరో రూ.5 వేల వరకూ వస్తుందని రైతులకు సీఎం తెలిపారు. సాగు చేస్తున్న పొలాన్ని బట్టి రైతుకు దిగుబడి ఎంత వస్తుందో కూడా నమోదు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. అనంతరం ధాన్యం తేమ శాతాన్ని ఎలా గణిస్తారో స్వయంగా సీఎం చంద్రబాబు పరిశీలించారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం తేమశాతం పరిశీలించిన అనంతరం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఏ పంట పండిస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో రైతులు ఆలోచించుకోవాలి. ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు కోరిన విధంగా డ్రయర్ మిషన్లు పొలం వద్దకే పంపే ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం రైతులకు సీఎం చంద్రబాబు టార్ఫాలిన్ పరదాలు పంపిణీ చేశారు. ఈడ్పుగల్లులో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని కబ్జా చేయాలనే ఆలోచన వచ్చే అక్రమార్కులకు జైలు గుర్తుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. భూమిని కబ్జా చేసేందుకు వీల్లేకుండా కొత్త చట్టం తెచ్చామన్నారు. రీ సర్వేలో భూమి కొలతల్లో తేడాలు వచ్చినా, సర్వే నంబర్లలో తేడాలు వచ్చినా వాటిని పరిష్కరిస్తామన్నారు. పట్టాదారు పాస్‌బుక్‌లో క్యూఆర్ కోడ్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 95,200 పిటీషన్లు వచ్చాయని, అన్నింటిని పరిష్కరిస్తామన్నారు.