ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రీ సర్వేలో చెప్పుకో దగిన సిత్రాలు ఎన్నో ఉన్నాయి. రైతులతో మాట్లాడిన తరువాత వారి అంగీకారంతోనే సర్వే చేయాలంటోంది ప్రభుత్వం.


భూమి రీ సర్వేతో గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. అసలు టైట్లింగ్ యాక్ట్ మంచిది కాదని, దీనిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ప్రభుత్వం ఆమోదించింది. అందరూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అయిందని అనుకున్నారు. కానీ మళ్లీ రీ సర్వే ను ప్రభుత్వం కొనసాగిస్తోంది. అయితే గతంలో మాదిరి సర్వే త్వరగా పూర్తి కావాలని మాత్రం ప్రభుత్వం వత్తిడి చేయటం లేదు. ఏ రోజు ఏ ప్రాంతానికి రీ సర్వే చేసేందుకు సర్వేయర్లు వస్తున్నారో ఆ ప్రాంత పొలాల రైతులకు ముందు రోజు సమాచారం ఇస్తున్నారు.

తగాదాలు మీరే పరిష్కరించుకోవాలి

సర్వే చేసేటప్పుడు ఎవరి భూమి ఎంతవరకు ఉందో రైతే చూపించాలి. వాస్తవానికి ఎవరి పేరుతో ఏ సర్వే నెంబరులో ఎంత ఉందో రికార్డుల్లో ఉంటుంది. ఆ వివరాలు కూడా వారి వద్ద ఉంటాయి. ఇద్దరు రైతుల మధ్య గట్టు సమస్యలు కావొచ్చు. ఒకరి పొలాన్ని మరొకరు ఆక్రమించుకుని ఉండొచ్చు. ఆ విషయం వారికి చెబితే అది పరిష్కరించే పని మాది కాదు. కొలత వరకు మాత్రమే మేము చేస్తాం అంటున్నారు సర్వేయర్లు. ఎవరి పొలం ఎంత ఉంది. ఎక్కడి వరకు ఉందో చెబితే దాని ప్రకారం బౌండ్రీలు ఫిక్స్ చేసి హద్దులు నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా సమస్య ఉన్న చోట హద్దులు ఫిక్స్ చేయకుండా ఎవరి పేరుతో ఎంత పొలం ఉందో గతంలో ఉన్న వివరాల ప్రకారం వివాదం ఉన్న పొలాలన్నింటికీ ఒకే నెంబరు కిందకు తీసుకొచ్చి ఆ భూమి యజమానుల పేర్లు కలిపి రాస్తున్నారు. దీని వల్ల కొత్తగా ఇవ్వబోయే ఈ పాస్ పుస్తకాల్లో ఎంత మంది రైతుల భూమి హద్దులు ఫిక్స్ చేయలేదో వారందరి పేర్లు ఉంటాయి. సమస్య పరిష్కారం అయిన తరువాత మాత్రమే ఆ రైతుల హద్దులు నిర్ణయిస్తారు. అంతవరకు అందిరి పేర్లు అందరి పాస్ పుస్తకాల్లో ఉంటాయి. ఇది సిత్రంగా లేదూ...

బ్యాంకు రుణాలు రెన్యువల్ కావడం లేదు

చాలా మంది రైతులు తమ పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో పెట్టి అప్పులు తీసుకున్నారు. ఆ అప్పులు ప్రతి సంవత్సరం చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది చివర మార్చిలోపు చెల్లించలేక పోతే మొత్తం అసలు వడ్డీ ఎంత అయిందో చూసి అందులో ఎంతో కొంత రైతు నుంచి బాకీ కట్టించి రుణం తిరిగి రెన్యువల్ చేస్తారు. ఆ సందర్భంగా పాస్ పుస్తకాలు మరొక సారి పరిశీలిస్తారు. ఎందుకంటే ఆ భూమిని వేరే వారికి అమ్మారా? వారి పేరుతోనే ఉందా అని పరిశీలించేందుకు ఇలా చేస్తారు. ఇప్పటికే సర్వే పూర్తయిన వారికి టైటిల్స్ వచ్చాయి. ఆ పాస్ పుస్తకంలో సర్వే నెంబర్లకు బదులు వేరే నెంబర్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకం (ఎఫ్ఎంబి)లో ఇకపై ఆ పేరు ఉండదు. దీనికి బదులు ల్యాండ్ పార్సెల్ మ్యాప్ (ఎల్ఫిఎం) అనే పేరుతో పేరుతో నెంబరు క్రియేట్ అవుతుంది. అలా ఎఫ్ఎంబి పేరు మారటంతో సమస్యగా మారిందని రైతులు చెబుతున్నారు. పైగా చాలా మంది రైతులకు గతంలో ఉన్న సర్వేయర్లు పొలాన్ని కొలిచి సబ్ డివిజన్ చేయకుండా ఒక సర్వే నెంబరు వేసి దానికి ఎదురుగా ‘పి’ అని పెట్టారు. అంటే ఆ సర్వే నెంబరులో పార్ట్ అని అర్థం. పార్ట్ అనేది పోయి ప్రత్యేకంగా నెంబరు రావాలంటే సబ్ డివిజన్ జరగాలి. కానీ అలా జరగని పొలాల్లో ప్రస్తుతం సర్వే నెంబరు ఎదుట పి అనే దానికి బదులు ఏదో ఒక నెంబరు కేటాయిస్తున్నారు. గతంలో ఉన్న పాస్ పుస్తకానికి, ఈ పాస్ పుస్తకానికి సర్వే నెంబర్లు మారడంతో బ్యాంకు వారు రుణాన్ని రెన్యువల్ చేయడానికి నిరాకరిస్తున్నారు.

రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తల పట్టుకుంటున్న అధికారులు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాత రికార్డులు ఉన్నాయి. సర్వేకు సంబంధించి ఎప్పటి కప్పుడు సర్వే జరిగిన రికార్డులు రిజిస్ట్రార్స్ కు ప్రభుత్వం ఇవ్వటం లేదు. సర్వే పూర్తయిన తరువాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డుల్లో అప్డేట్ జరుగుతుంది. అయితే ఈలోపు భూముల కొనుగోలు అమ్మకాలు జరుపుకునే వారికి సమస్యగా మారింది. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సర్వే పూర్తయిన వ్యక్తి తన భూమిని వేరే వారికి అమ్మాలనుకుంటే సబ్ రిజిస్ట్రార్ ఆన్ రికార్డుల్లో ఉన్న సర్వే నెంబర్లకు, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న సర్వే నెంబర్లకు సంబంధం లేకుండా ఉంది. కొత్త నెంబర్లు సర్వే పూర్తయిన పొలాలకు అలాట్ అవుతున్నాయి. దీంతో ఆ పొలాల రిజిస్ట్రేషన్ లు జరగటం లేదు. దీంతో చాలా మంది రైతులు సచివాలయాలకు వచ్చి జరుగుతున్న ఇబ్బందులను అక్కడి సిబ్బందికి చెబుతున్నారు. ఈ సమస్యలు తాము పరిష్కరించేవి కాదని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే పరిష్కరించేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు.

సమస్యలు సమస్యలుగానే..

రీ సర్వే వల్ల సమస్యలు తీరతాయని, ప్రతి ఒక్క రైతుకు హద్దులు నిర్ణయించి సమస్యలు లేకుండా ప్రభుత్వం చేస్తుందని అందరూ భావించారు. కానీ అవేమీ జరగటం లేదు. సమస్యలు సమస్యలుగానే ఉంటున్నాయి. వివాదమున్న భూముల సర్వే నెంబర్లు అన్నీ కలిపి సుమారు పది మంది రైతుల పేర్లు ఒకే పాస్ పుస్తకంలో నమోదు చేసి ప్రతి రైతుకూ ఇస్తుండటంతో వారి మధ్య ఉన్న వివాదాలు అలాగే ఉంటున్నాయి. ముందుగా రెవెన్యూ కోర్టులు, ఆ తరువాత న్యాయస్థానాల్లో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్కో మండలంలో వేల మంది సమస్యలు అలాగే ఉంటున్నాయి. సమస్యలు పరిష్కారం ఎప్పటికి జరుగుతుందో... విడి విడిగా పాస్ పస్తకాలు ఎప్పటికి వస్తాయోనని రైతులు ఎదురు చూస్తున్నారు.

Next Story