రుషికొండపై ఉన్న భవనం వైఎస్ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండని సజ్జల అన్నారు.
చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒక మాఫీయా ఏపీలో రాజ్యం ఏలుతోందని విమర్వించారు. ఆదివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా కనిపించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వ నేతలు రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. నాలుగు నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, వీటిని మనం చూస్తూనే ఉన్నామన్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా కూటమి నాయకులు అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు వైఎస్‌ఆర్‌సీపీ నేతల వ్యక్తిత్వాలను హననం చేస్తున్నారని విమర్శించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనపై ఏదో రాద్దాంతం చేశారన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు విష ప్రచారం చేశారని అన్నారు.