
మద్యంతో తడిసిముద్దవుతున్న ఆంధ్రా పల్లెలు
ఆంధ్రాలో ప్రతి పల్లే పానశాలే... ప్రతి కొట్టూ బెల్ట్ షాపే..
అది గుంటూరు శివార్లలోని ఓ పెద్ద పల్లే.. ఊరి చివర ఓ పూరిగుడిశ లాంటి కిళ్లీ కొట్టు.. దాన్లో పెద్దగా చిరుతిండ్లు ఏమీ లేవు. నాలుగైదు ప్లాస్టిక్ డబ్బాలు... చూరుకి ఓ నాలుగైదు రకాల చిన్న ప్యాకెట్ల వేరుశనగలు, ఉప్పుశనగలు, బఠానీలు, కారప్పూస లాంటివి వేలాడుతున్నాయి. బడ్డీలోపల ఓ వాటన్ క్యానన్, కొన్ని ఖాళీ వాటర్ బాటిల్స్.. టీ తాగే కప్పులు, వాటర్ గ్లాసులు ఉన్నాయి. మూడు నాలుగు రకాల సిగరెట్లు కూడా
... ఓ నడివయసు దాటిన పెద్దాయన కొట్లో కూర్చుని ఉన్నారు. ఆయన్ని చూసినపుడు ఇలాంటివి ఎన్ని అమ్మితే ఈ మనిషి కుటుంబం పొట్టపోసుకుంటుందా అని మనకు అనుమానం రావడం సహజం..
మిట్టమధ్యాహ్నం కావొచ్చింది. ముందు నాలుగైదు మోటారు సైకిళ్లు అక్కడ ఆగాయి. వచ్చిన వాళ్లు వచ్చినట్టు కిళ్లీ కొట్టు వెనుకున్న నాపరాతి అరుగుపై కూర్చున్నారు. బండ్లు కనపడతాయి తప్ప మనుషులు కనిపించరు.
వచ్చిన వాళ్లు వచ్చినట్టు గ్లాసులు, నీళ్లు తీసుకెళుతున్నారు. జైబుల్లో నుంచి తీసేవాళ్లు కొందరైతే మరికొందరు.. అన్నా, ఓ క్వార్టర్ అంటున్నారు. ఓ అరగంట గడిచే పాటికి కొంచెం మాటల సందడి వినిపిస్తుంది. ఇంకొంచెం సేపటికి ఆ కిళ్లీ కొట్టు ముందు ఇంకొన్ని మోటారు సైకిళ్లు జమ అవుతుంటాయి..
ఇలా మధ్యాహ్నం మూడు, నాలుగింటి దాకా సాగుతుంది. పోయే వాళ్లు పోతుంటారు, వచ్చే వాళ్లు వస్తుంటారు.. బాటిల్ తెచ్చుకున్న వాళ్లు గ్లాసులకీ, మంచింగ్ ప్యాకెట్లకి, మంచినీళ్ల ఖరీదుతో పాటు సిటింగ్ చార్జీ కింద 10 రూపాయలు ఇచ్చిపోతుంటారు. బాటిల్ తెచ్చుకోని వాళ్లయితే మందు సీసా ఖరీదుతో పాటు మరో 25 రూపాయలు అదనంగా ఇచ్చివెళుతున్నారు.
ఇదేదో ఒక్క ఆ పల్లెకే పరిమితం కాలేదు. నగరాలు, పట్ణణాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పల్లే ఓ పానశాలలా మారింది. విధివీధినా కిళ్లీ కొట్లే, ఆ కొట్లన్నీ బెల్ట్ షాపులే. అవన్నీ అనధికార మినీ బార్లే. ఏదైనా కిళ్లీ కొట్టుకు తాటాకు కప్పి ఉందంటే అక్కడ మందున్నట్టే. పగలూ రేయి అనే తేడా లేదు. సందడే సందడి.. చీకటి పడితే మరింత సందడి.
గుంటూరు శివార్లలోని ఓ కిళ్లీబడ్డీ ఎదుట ఇలా..
జేబులో డబ్బుంటే చాలు, ప్రతిదీ అక్కడే దొరుకుతుంది.. మద్యం, గ్లాసు, నీళ్లు, సోడా, నంజుడు.. దేనికీ కొరత రాదు. అంతా సెల్ఫ్ సర్వీసే. కల్లు కాంపౌండ్ల మాదిరిగా ముంత మసాలాలు, చీకులు, చికెన్ పకోడాలు దొరకవు గాని మూడో కంటికి తెలియకుండా మందు కొట్టడానికి అనువైన ప్రాంతాలుగా మారాయి ఈ కిళ్లీ బడ్డీలు కమ్ బెల్ట్ షాపులు.
మొత్తం మీద పల్లెల్లో మద్యం కంపు గుప్పుమంటోంది. క్వార్టర్ పై 25రూపాయలు అదనం. 90 ఎంఎల్ మినీ బాటిల్స్ కూడా దొరుకుతాయి. ఏది కొన్నా 15 నుంచి 25 రూపాయలు అదనంగా చెల్లించాలి. బీరుపై 15 రూపాయలు అదనం (బాగా కూలింగ్ అంటే కుదరదు) బయట నుంచి తెచ్చుకుని ఈ కొట్లలో అర్థరాత్రి దాకా తాగొచ్చు, ఊగొచ్చు.
ప్లాస్టిక్ గ్లాసు పది, సోడా 20, 5 రూపాయల శనగలు, పల్లీలు, ఉప్పుశనగల ప్యాకెట్లు దొరుకుతాయి. సిగరెట్లు అదనం. వైన్ షాపు నుంచి మద్యం తెచ్చుకుంటే ఇక్కడ కూర్చుని పోబోయే ముందు పది రూపాయలు ఇచ్చి పోవాలి.
13,324 గ్రామాలు.. 75 వేల బెల్ట్ షాపులు...
రాష్ట్రంలో సుమారు 13,324 వేల గ్రామాలుంటే 3396 వైన్ షాపులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిన విధానంతో దాదాపు 75వేలకు పైగా బెల్ట్ షాపులు వచ్చాయి. టీడీపీ కూటమి, వైసీపీ అనే తేడా లేకుండా ముఖ్య ప్రజాప్రతినిధులందరూ ఈ షాపులకి అండదండలుంటాయి. ఎక్సైజ్ నిఘా కళ్లకు ఇవి కనిపించినా పెద్దగా పట్టించుకోరు.
ఇక్కడ కూర్చుని తాగే వాళ్లలో బ్యాంకులు, ఎల్ఐసీ, మెడికల్, పోలీసు అధికారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మొదలు సామాన్యుల వరకు అందరూ ఉంటారు. ఆస్తులు, అంతస్తులు, రియల్ ఎస్టేట్లతో ఇక్కడ సంబంధాలు ఉండవు. కొండకచో వ్యాపార లావాదేవీలు కూడా ఇక్కడ సాగిపోతుంటాయి.
మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణలో ఈ స్థాయిలో రాజకీయ జోక్యం మునుపెన్నడు చూడలేదని ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారంటే ఏ స్థాయిలో విస్తరించారో ఇట్టే తెలుస్తుంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు వైన్స్ వచ్చాయి. కావాల్సిన బ్రాండ్లు కొనుకోవచ్చు.. తాగొచ్చు. అయితే.. ఎక్కడో ఉన్న లైసెన్సుడ్ మద్యం షాపులకు వెళ్లి కొనుక్కునేందుకు ఇబ్బంది పడకుండా.. మద్యం ప్రియులకు అందుబాటులోకే మద్యం అన్నట్లు పల్లెపల్లెన.. వీధివీధిన అనధికారిక బెల్ట్ షాపులు బార్లా తెరుచుకున్నాయి.
క్వార్టర్ సీసాపై రూ.25 అదనం..
ప్రభుత్వ లైసెన్డ్ మద్యం షాపులో విక్రయించే ఎమ్మార్పీ ధరలు కంటే ఎక్కువ ధరలకు బెల్ట్ షాపుల్లో విక్రయిస్తున్నారు. ప్రభుత్వం సామాన్యులకు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు ఇవ్వాలనే లక్ష్యంగా రూ.99లకే క్వార్టరు లిక్కరు తీసుకొచ్చారు. ఇదే సీసా గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో రూ.125 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఇతర బ్రాండ్ల మద్యం క్వార్టర్ సీసా, బీరు సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.15 నుంచి రూ.25 వరకు అదనంగా వసులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అదనుగా బెల్ట్ షాపుల్లోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్-ఎన్‌డీపీఎల్ వచ్చి చేరుతోంది.
ఒక్కో బెల్ట్ షాపునకు ఒక్కో రేటు...
ఒక్కో బెల్ట్ షాపుకు ఒక్కో రేట్ చొప్పున మద్యం షాపుల యజమానులు రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు డిపాజిట్ రూపంలో వసూలు చేసినట్లు తెలుస్తున్నది. డిమాండ్ ఉన్న పల్లెల్లో రూ.లక్ష వరకు తీసుకున్నారనే ఆరోపణులు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతి షాపు నుంచి నెల మామూళ్లు నిర్ణయించడం, ముఖ్య ప్రజాప్రతినిధులు జోక్యంతో ఎక్సైజ్, పోలీసు యంత్రాంగం చూసీచూడనట్లు వెళ్తున్నారనే ఆరోపణులు ఉన్నాయి. బెల్ట్ షాపుల నిర్వహణలో రాజకీయాలు ఏమాత్రం అడ్డురావడం లేదు. అటు అధికార టీడీపీ కూటమి నేతలతో పాటు ప్రతిపక్ష వైసీపీ నాయకులు కూడా ఉంటున్నారు.
బెల్ట్‌కు కళ్లెం పడేనా..?
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్లి మండలం నేమకల్లు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ .. మద్యం మాఫియాను అరికట్టి తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచాం.. మద్యం వ్యాపారంలో ఇతరుల జోక్యాన్ని సహించను. బెల్టు షాపులు పెడితే నేను కూడా బెల్టు తీయాల్సి వస్తుంది.... అని హెచ్చరించారు. అయినా టీడీపీ కూటమి నాయకుల్లో మార్పు వస్తుందా..? ఎక్సైజ్ అధికారుల్లో కదలిక వస్తుందా..? ఊరూవాడా విచ్చలవిడిగా వెలసిన మద్యం బెల్టు షాపులకు తాళం పడుతుందా..? అన్నది ప్రశ్నార్థకమే. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కీలక ప్రజాప్రతినిధులే జోక్యం చేసుకోవడంతో నిఘా అధికారులు కళ్లకు గంతులు కట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారులు ఏమంటున్నారంటే..
గ్రామాల్లో బెల్డ్ షాపులపై నిఘా పెట్టాం. ఎక్సైజ్ స్థానిక, విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు అని చెప్పారు ఎక్సైజ్ శాఖ అధికారి సుధీర్‌బాబు.
కల్లుగీత కార్మికుల పోరుబాట..
రాష్ట్రంలో 75వేల మద్యం బెల్ట్‌షాపులను తొలగించి, గీత కార్మికుల ఉపాధిని కాపాడే వరకు పోరాటం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం(ఎంబీవీకే)లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఇటీవల జరిగింది.
రాష్ట్రంలో బెల్ట్‌షాపులు తొలగించి గీత కార్మికుల ఉపాధిని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 58 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదరర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోకపోగా ఉన్న ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. మద్యం ఆదాయం రుచి మరిగిన ప్రభుత్వం కల్లు అమ్మకాలను దెబ్బతీసి గీత కార్మికుల పొట్ట కొట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
58 రోజులపాటు నిర్వహిస్తున్న దశలవారీ పోరాటంలో ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని జి.నరసింహమూర్తి పేర్కొన్నా రు. 30న జిల్లాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి సెప్టెంబర్ 8న మంగళగిరిలో ఎక్సైజ్ కమిషనర్‌ను కలుద్దాం రండి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు.
సెప్టెంబర్ 10న ముఖ్యమంత్రికి సమస్యలపై వినతిపత్రం అందించి 12న బెల్ట్ షాపులు, కల్లు పాలసీ, ఉపాధిపై జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇదీ రాష్ట్రంలో పరిస్థితి...
మొత్తం గ్రామాలు- 13,324 (శివారు గ్రామాలు సహా)
లైసెన్స్ ఉన్న మొత్తం లిక్కర్ షాపులు- 3,396
వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ షాపులు- 3,500
రాష్ట్రంలో బెల్ట్ షాపులు సుమారు 75 వేలు
(కల్లుగీత కార్మికుల సంఘం లెక్కల ప్రకారం)
ఎక్సైజ్ ఆదాయం- 2021-2022లో- రూ.21,432 కోట్లు
ఎక్సైజ్ ఆదాయం -2022-23లో రూ. 23,785 కోట్లు
ఎక్సైజ్ ఆదాయం-2025-2026లో అంచనా- 35 వేల కోట్లు
బెల్ట్ షాపులంటే ఏమిటీ...
ఒక్క మాటలో చెప్పాలంటే అనధికార లిక్కర్ షాపు. అధికారికంగా లైసెన్స్ ఉన్న లిక్కర్ షాపుల నుంచి మద్యం కొని తెచ్చుకుని ఊళ్లల్లో అమ్ముతుంటారు. ఇలా ఇక్కడ నిర్వహించుకునేందుకు లైసెన్స్ షాపుల వాళ్లు కొంత మొత్తాన్ని బెల్ట్ షాపు నిర్వాహకుల నుంచి తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల వీటికి అనుమతి ఇచ్చింది.
ఏపీ స్టేట్ ఎక్సైజ్ విభాగం, పోలీసు లెక్క ప్రకారం 2022-23లో రాష్ట్రంలో ఈ తరహా బెల్ట్ షాపులు 18 నుంచి 20 వేల మధ్య ఉంటే 2024కి ఆ సంఖ్య 25 వేలకు చేరింది. ప్రతి లిక్కర్ షాపుకి అనుబంధంగా 3 నుంచి 5 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి.
2022లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 15వేలకు పైగా బెల్ట్ షాపులను మూసివేయించినట్టు చెప్పినా ఇప్పుడా సంఖ్య బాగా పెరిగింది.
Next Story