సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పగలు, ప్రతీకారాలతో రగిలి పోతున్నారు. బుల్డోజర్లతో పాలనకు శ్రీకారం చుట్టారు.


గతంలో తమిళనాడు, ప్రస్తుత తెలంగాణాలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పగలు ప్రతీకారాలే పరమావధిగా రాజకీయాలు తయారయ్యాయి. పగలు ప్రతీకారాలు తీర్చుకోవడం ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదని, ముఠా నాయకులు, ఫ్యాక్షన్‌ లీడర్లకు మించి ఇద్దరు ప్రవర్తిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలపై కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం, గృహ నిర్బంధాలు చేయడం, అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ నేతలను, ఇబ్బందులు పెట్టడం, వారిపై కేసులు నమోదు చేయడం వంటి కార్యక్రమాలు పరిపాటిగా మారిపోయాయి.

2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీటికి తెర తీసారు. అంతకు ముందు చంద్రబాబు టైమ్‌లో కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వెచ్చించి చంద్రబాబు నాయుడు నిర్మించిన ప్రజావేదికను కూల్చడంతో నాడు జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనను ప్రారంభించారు. చట్ట విరుద్దంగా ప్రజావేదిక నిర్మాణం చేపట్టారని, దీనిని కూల్చడం ద్వారా అక్రమ కట్టడాలకు స్వస్తి చెప్పాలని, ప్రజావేదిక కూల్చడం నుంచే వీటికి నాంది పలకాలని నిర్ణయించారు. ప్రజావేదికలో తొలి సారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశం నిర్వహించిన జగన్‌ అదే సమావేశంలో ఈ అంశాలను వెల్లడించారు. ప్రజావేదికను కూల్చేందుకు ఆ సమావేశంలోనే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడిన మాటలు ఒక సారి పరిశీలిస్తే.. సామాన్యులు ఇలాంటి తప్పులు చేస్తే మనమే అక్కడకు వెళ్లి ఆ నిర్మాణాలను కూల్చి వేస్తాం. కానీ మనమే.. ప్రభుత్వంలో ఉంటూ.. ఒక ముఖ్యమంత్రిగా మనమే ఉంటూ.. మనమంతట మనమే రూల్స్‌ని ఉల్లంఘిస్తే ఎలా? మనమే ఈ స్థాయిలో రూల్స్‌ను పాటించకుండా ఉంటే.. రేపు ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే వారికి ఏమని సమాధానం చెబుతాం. ఇలాంటి అంశాల్లో ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోవాలి. మనము రాష్ట్రాన్ని లీడ్‌ చేస్తున్నాము, మనము రోల్‌ మోడల్స్‌గా ఉండాలి. కానీ మనమే రూల్స్‌ పాటించకుండా వేరే వాళ్లు రూల్స్‌ పాటించాలంటే ఎంత వరకు సబబు. ఇలా నిబంధనలు పాటించకుండా వ్యవస్థ ఎలా దిగజారి పోయిందో తెలియజెప్పడం కోసమే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, జిల్లాల కలెక్టరందరినీ, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులందరిని, హెచ్‌ఓడీలందరిని ఇక్కడకు పిలిపించడం జరిగింది. ఎలాంటి వ్యవస్థలో మనము బతుకుతున్నామనేది చెప్పాలని రప్పించడం జరిగింది. ఇదే హాల్‌లో నుంచి ముఖ్యమంత్రిగా నేను ఆదేశాలు ఇస్తున్నాను. ఇదే ఈ హాల్‌లో ఆఖరి సమావేశం. రేపు ఎస్పీల సమావేశం అయిపోయిన వెంటనే దీనిని కూల్చి వేయడం జరుగుతుంది. అక్రమ కట్టడాల కూల్చి వేతలు ఇక్కడ నుంచే మొదలవుతాయని జగన్‌ నాడు ప్రకటించారు. ఇన్ని సూక్తులు చెప్పిన నాటి సీఎం జగన్‌ ప్రజావేదికకు చుట్టు పక్కల ఉన్న భవనాల జోలికి మాత్రం పోలేదు. వాటిని కూల్చే ప్రయత్నమూ చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు మీద పగ తీర్చుకునేందుకు, చంద్రబాబును మానసికంగా సమస్యలు సృష్టించేందుకు ప్రజావేదికను కూల్చారనే విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి.
తర్వాత తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడుతో పాటు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా, నారా లోకేష్‌ ఇలా రాష్ట్ర స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యే స్థాయి నాయకులు, కార్యకర్తల వరకు కేసులు పెట్టి జైలుకు పంపే కార్యక్రమాలు చేపట్టారు. ఇవి కావలనే జగన్, ఆయన ప్రభుత్వం చేస్తోందని విమర్శలు టీడీపీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోను వినిపించాయి.
తాజాగా మరో సారి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో జగన్‌ మాదిరిగానే ప్రతీకార చర్యలకు తెర తీసింది. అధికారం చేపట్టగానే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని కూల్చేసింది. చంద్రబాబు నివాసం నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లే దారిలో ఉంది. ఫస్ట్‌ ఫ్లోర్‌ కంప్లీటై శ్లాబ్‌కు రెడీగా ఉంది. ఈ నెల 22న శనివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లుతో క్చూల్చేశారు. కూల్చి వేత సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరింప చేశారు. నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్‌డేఏ ప్రాథమిక ప్రొసీడింగ్స్‌ను వైఎస్‌ఆర్‌సీపీ హైకోర్టులో సవాల్‌ చేసింది. చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని కోర్టు సీఆర్‌డిఏకు సూచించింది. ఇదే విషయాన్ని వైఎస్‌ఆర్‌సీపీ తరపున న్యాయవాది సీఆర్‌డిఏ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పెడచెవిన పెట్టారు. అంతటితో వదలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలపై కన్నేసింది. వీటిల్లో అధిక శాతం నిర్మాణాలు అక్రమంగానే కొనసాగుతున్నాయని చెబుతూ వాటిని కూడా కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపైన కేసుల నమోదుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెర తీసింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్, మాజీ ఎంపీ సత్యనారాయణతో పాటు పలువురు వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లపైన కేసులు నమోదు చేశారు. ఇది ఇప్పటితో ఆగదని, రానున్న రోజుల్లో కేసులు పెరుగుతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Next Story