2019 మార్చి 15న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఆరేళ్లు న్యాయం కోసం పోరాడుతున్నట్లు ఆయన కుమార్తె సునీత చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మరో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి హత్య జరిగి ఆరేళ్లు అవుతున్నా ఇంత వరకు కేసు కొలిక్కి రాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన వాళ్లు యథేచ్చగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. ఆరేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని, కానీ ఈ కేసు ముందుకు సాగడం లేదని, విచారణ జరగడం లేదని, ట్రైల్స్ కూడా నడవట్లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు. అయినా తాను ఈ కేసును వదిలేదని లేదని, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటానని వెల్లడించారు. ఆరేళ్ల క్రితం జరిగిన తన తండ్రి హత్యను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్థంతి సందర్భంగా శనివారం ఆయన కుమార్తె సునీత, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి సమాధికి సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ అజాత శత్రువైన తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కేసు గురించి ఎంతగా పోరాటం చేస్తున్నా న్యాయం జరగడం లేదని, ఈ కేసులో నిందితుల కంటే తమకు, తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనకు అనిపిస్తోందని ఆవేదన చెందారు. సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభించాలన్నారు. సాక్షుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఈ నేపథ్యంలో హత్య కేసులోని
సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ మరణాల మీద కూడా తనకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. సాక్షులను భయబ్రాంతులకు గురి చేసినా, వారి మీద తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చినా, న్యాయం కోసం తన పోరాటం ఆగదని సునీత స్పష్టం చేశారు.
2019 సార్వత్రి ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య చోటు చేసుకుంది. 2019 మార్చి 15న అత్యంత పాశవికంగా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారు. అయితే గుండె పోటుతో వివేకా మరణించారని, రక్తపు వాంతులు చేసుకొని మరణించారని తొలుత వార్తలు వెలువడ్డాయి. నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనిపై విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. తర్వాత ఎన్నికలు జరగడం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం వంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. వివేకా కూతురు సునీత సీబీఐ విచారణ జరిగే విధంగా పోరాటం చేశారు. దీనికి హైకోర్టు అంగీకారం తెలుపడంతో నాటి నుంచి నేటి వరకు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల మీద సీబీఐ చార్చిషీట్ నమోదు చేసింది. అయితే దస్తగిరి అప్రవర్‌గా మారి పోయాడు.
Next Story