ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఎస్సీలకు ప్రాతినిధ్యం ఉండేంది. ప్రతి జిల్లా నుంచి ఒకటో, రెండో ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండేవి. కొన్ని జిల్లాల్లో అయితే మూడు వరకు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతంర కూడా ఇవి కొనసాగాయి. విభజన అనంతరం 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆ స్థానాలు పదిలంగానే ఉన్నాయి. 2019లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజన, పార్లమెంట్ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. అప్పటి వరకు ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 2022 కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. 2022 ఏప్రిల్ మాసంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అదే నెల 4 నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన అనంతరం ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఉన్న ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాలు కొత్త జిల్లాలకు వెళ్లి పోయాయి.
సంఖ్య మార లేదు కానీ జిల్లాలు మారాయి
ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు కానీ జిల్లాల విభన అనంతరం కానీ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల సంఖ్య అలానే ఉంది. దీంతో పాటుగా కేటాయించిన అసెంబ్లీ స్థానాలు, వాటి పేర్లు అలానే ఉన్నాయి. జిల్లాలు మారాయి.
ఉమ్మడి 13 జిల్లాల్లో స్థానాలు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం ఎస్సీ రిజర్వుడు స్థానం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్వతీపురం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పాయకరావుపేట, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం, రాజోలు, గన్నవరం, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడి, ఉమ్మడి కృష్ణాలో పామర్రు, తిరువూరు, నందిగామ, ఉమ్మడి గుంటూరులో తాడికొండ, వేమూరు, ప్రత్తిపాడు, ఉమ్మడి ప్రకాశంలో ఎర్రగొండపాలెం, కొండేపి, సంతనూతలపాడు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు, సూళ్ళూరుపేట, ఉమ్మడి కడపలో బద్వేలు, రైల్వే కోడూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కోడుమూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల, మడకసిర, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు స్థానాలు ఉండేవి.
విభజన అనంతరం మార్పులు
జిల్లాల పునర్విభజన అనంతరం వీటి స్థానాలు మారాయి. వేరే జిల్లాలకు వెళ్లి పోయాయి. రాజాం నియోజక వర్గం విజయనగరం జిల్లాకు, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోకి వెళ్లాయి. పాయకాపురం అనకాపల్లి జిల్లాకు, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు అమలాపురం, రాజోలు, గన్నవరం, తూర్పు గోదావరి జిల్లా కిందకు కొవ్వూరు, గోపాలపురం, ఏలూరు జిల్లా పరిధిలోకి చింతలపూడి, కృష్ణా జిల్లా కింద పామర్రు, ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి నందిగామ, తిరువూరు, గూంటూరు జిల్లా కింద తాడికొండ, ప్రత్తిపాడు, బాపట్ల జిల్లా పరిధిలోకి వేమూరు, ప్రకాశం జిల్లా కిందకు సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, కొండేపి, అన్నమయ్య జిల్లా కిందకు రైల్వే కోడూరు, కడప జిల్లా పరిధిలో బద్వేలు, నంద్యాల జిల్లా పరిధిలోకి నందికొట్కూరు, కర్నూలు జిల్లా కిందకు కోడూమూరు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోకి మడకసిర, అనంతపురం జిల్లా పరిధిలోకి సింగనమల, చితూర్తు జిల్లా కిందకు గంగాధర నెల్లూరు, పూతలపట్టు, తిరుపతి జిల్లా పరిధిలోకి సూళ్లూరుపే, గూడూరు, సత్యవేడు వెళ్లి పోయాయి.
ప్రాతినిధ్యం లేని జిల్లాలు ఇవే
ఇలా ఉమ్మడి జిల్లాల కిందకు ఎస్సీ రిజర్వుడు స్థానాలు వెళ్లడంతో నాలుగు జిల్లాల్లో ఎస్సీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామ రాజు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా ఎస్సీ రిజర్వుడు స్థానాలు లేకుండా పోయాయి.