‘రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి’.. గుడ్లవల్లేరు సీక్రెట్ కెమెరాపై ఐజీ క్లారిటీ..
x

‘రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి’.. గుడ్లవల్లేరు సీక్రెట్ కెమెరాపై ఐజీ క్లారిటీ..

గుడ్లవల్లేరు ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా తమ పిల్లలను హాస్టళ్లకు పంపే తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టింది. ఎక్కడ ఏం జరుగుతుందోనన్న భయం పట్టుకుంది.


గుడ్లవల్లేరు ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా తమ పిల్లలను హాస్టళ్లకు పంపే తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టింది. ఎక్కడ ఏం జరుగుతుందోనన్న భయం పట్టుకుంది. అందులోనూ అమ్మాయిల తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోలు రికార్డ్ చేయడం ఏంటని వారంతా తీవ్ర ఆందోళన చెందారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఈ వ్యవహారంపై విద్యార్థినులంతా ఏకమై పోరాటం చేశారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో అంతే వేగంగా స్పందించింది. వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ఒకవేళ సీక్రెట్ కెమెరా వాస్తవం అయితే ఒక్క వీడియో కూడా బయటకు రాకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందంతో పాటు కేంద్ర స్థాయి నుంచి నిపుణులను రంగంలోకి దించారు. ఆగస్టు 29న రాష్ట్రమంతా గందరగోళం సృష్టించిన ఈ సీక్రెట్ కెమెరా వ్యవహారంపై ప్రత్యేక బృందాలు వారం రోజుల నుంచి దర్యాప్తు కొనసాగించాయి. తాజాగా తమ దర్యాప్తులో తేలిన వాస్తవాలను ఐజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. ఎస్పీ గంగాధర్ సహా ఇతర అధికారులతో కలిసి ఆయన ఈ విషయాలను ప్రకటించారు.

అలాంటిదేమీ లేదు..

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల హాస్టర్ బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టడం, విద్యార్థినుల వీడియోలను చిత్రీకరించి వాటిని షేర్ చేసుకోవడం, లేదా అమ్ముకోవడం జరిగిందనడంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి విద్యార్థినులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘గుడ్లవల్లే ఘటన రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్వయంగా దృష్టి సారించారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని, సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అదే రోజున దర్యాప్తును ప్రారంభించారు. ప్రత్యేక మహిళా బృందం, విద్యార్థినులతో కలిసి హాస్టల్, బాత్రూమ్‌లు అన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశాం. 35 మంది విద్యార్థినులు, వార్డెన్లు, సిబ్బందిని విచారించాం. వారెవ్వరూ కూడా కెమెరా చూసినట్లు చెప్పలేదు’’ అని వెల్లడించారు.

రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి..

ఈ ఘటనను సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారని, ఈ విషయం విద్యార్థినుల భవిష్యత్తుకు సంబంధించిందని, వారి మానానికి చెందిన అంశంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోలేమని చంద్రబాబు తమతో చెప్పారని ఐజీ చెప్పారు. ‘‘సీఎం చొరవతో ఢిల్లీకి చెందిన కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ), పూణెకు చెందిన సీ-డాక్ సాంకేతిక నిపుణులు గుడ్లవల్లేరుకు చేరుకున్నారు. కళాశాలలోని కేంద్ర సర్వర్‌ను, వసతిగృహాలను, విద్యార్థుల ఫోన్లు, ట్యాప్‌టాప్‌లు సహా ఇతర గ్యాడ్జెట్‌లను వారు తనిఖీ చేశారు. ఒక క్రిమినల్ కేసులో సీఈఆర్‌టీ పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. అనుమానితుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లో గ్యాడ్జెట్లను కూడా పరిశీలించారం. లోతైన దర్యాప్తు కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నాం. ఐదు రోజుల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు పూర్తి వివరాలు బహిర్గతం చేస్తాం’’ అని తెలిపారు.

అవి అనుమానాలు మాత్రమే..

ఈకేసుకు సంబంధించి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి సందేహాలను నివృత్తి చేయడానికి సీఈఆర్‌టీ ఆయా వర్గాల నుంచి పలు వివరాలు సేకరించిందని, కాగా వారివన్నీ అనుమానాలేనని తెలిసిందని చెప్పారు. వారు ఎటువంటి సాక్ష్యాలు ఇవ్వలేకపోయారని, ఎవరైనా సాక్ష్యాలు ఇస్తే దర్యాప్తును కొనసాగిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు వారం రోజులుగా సాగిన దర్యాప్తులో సీక్రెట్ కెమెరాల ఏర్పాటు, వీడియోల షేరింగ్ ఏమీ జరగలదేని ఆయన నిర్ధారించారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై కూడా దృష్టి సారిస్తున్నామని, వచ్చిన వివరాల ఆధారంగా చర్యలు చేపడతామని ఐజీ పేర్కొన్నారు.

Read More
Next Story