విజయవాడ వరదలు నగర వాసులకు కన్నీళ్లు మిగిల్చాయి. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్చలేదని వరద బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.
విజయవాడ వాసులను అటు బుడమేరు, ఇటు కృష్ణా నది వరదల్లో ముంచెత్తాయి. పీకల్లోతు నీళ్లు ప్రవహించాయి. నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల వరకు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. సింగ్‌నగర్, కండ్రిక, పాయకాపురం, సుందరయ్యనగర్, తారకరామనగర్, గీతానగర్, జక్కంపూడి కాలనీ, వైఎస్‌ఆర్ కాలనీ వంటి అనేక కాలనీల్లో దాదాపు 10 అడుగుల వరకు వరద నీరు ప్రవహించింది. ఒక్క సారిగా వరద నీరు వచ్చి చేరడంతో వస్తువులను కాపాడుకునేందుకు కూడా వీలు లేకుండా పోయింది. బయటకు తెచ్చుకునేందుకు కానీ, పై పోర్షన్లలోకి కూడా తీసుకెళ్లలేని దుస్థితి నెలకొంది. దీంతో బియ్యం, ఉప్పు, పప్పులతో పాటు మంచాలు, ఫ్రెజ్‌లు, వాషింగ్ మిషన్లు, పరుపులు, బీరువాలు, ఫ్యాన్లు, కూలర్లు, బల్లలు, టీవీలు, బైక్‌లు ఇలా అన్నీ వస్తువులు వరద నీటిలో తడిసి ముద్దయ్యాయి. కనీసం కట్టుకునే బట్టలను కూడా కాపాడుకోలేని హృదయ విదారక వాతావరణం నెలకొంది.
తారకరామనగర్‌కు చెందిన దేవకన్య మాట్లాడుతూ కట్టుబట్టలు తప్ప ఏమీ కాపాడుకోలేమని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఇద్దరు పిల్లలు. కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఎంతో కష్టపడి చిన్న ఇల్లు కట్టుకున్నారు. కష్టపడి సంపాదించుకున్న కూలీలో కుటుంబ పోషణతో పాటు తన పిల్లలను చదివించుకుంటున్నారు. వచ్చిన కూలీలోనే కూడబెట్టుకున్న డబ్బులను పోగేసుకొని ఫ్రెజ్, టీవీ, కూలర్, మంచాలు, టేబుల్ ఫ్యాన్, పరుపులు వంటి వస్తువులు సమకూర్చుకున్నామని, వరదలో అన్నీ తడిసి పోయాయని అవేదన వ్యక్తం చేశారు. చివరకు వండుకునేందుకు బియ్యం, పప్పులు కూడా కాపాడుకోలేక పోయామని కన్నీటి పర్యంతమయ్యారు.
కట్టుబట్టలతో తాను, తన భార్య, ఇద్దరు పిల్లలు వదర నుంచి బయట పడ్డామని, ఇంట్లో ఉన్న వస్తువులేమీ కాపాడుకోలేక పోయామని ఇదే ప్రాంతానికి చెందిన దుర్గారావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తను ఆటో వేస్తానని, వచ్చిన రాబడితో ఎంతో కష్టపడి చిన్న ఇల్లు కట్టుకున్నానని, ఫ్రెజ్, కూలర్, మంచాలు, పరుపులు వంటి వస్తులు సమకూర్చుకున్నానని, ఇప్పుడవన్నీ పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంట్లోకి ఇంత వరద వస్తుందని అనుకోలేదని, ఒక్క సారిగా వరద ప్రవాహం వచ్చి చేరడంతో ఇంట్లోని సామానంతా మునిగి పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.
ఎంతో శ్రమటోడ్చి సమకూర్చుకున్న వస్తువులన్నీ బుడమేరు వరద పాలయ్యాయని సింగ్‌నగర్‌కు చెందిన కృష్ణారావు చెప్పారు. తాను రోజు వారీ కూలీ పనులకు వెళ్తానని, వచ్చిన దానితో కుటుంబం పోషించుకుంటూ ఫ్రెజ్, కూలర్, మంచాలు, పరుపులు వంటి వస్తువులు సమకూర్చుకున్నానని వరదల్లో అన్నీ మునిగి పోవడంతో తమకు కన్నీళ్లే మిగిలాయని చెప్పారు. వంట చేసుకునేందుకు కూడా గింజలు లేకుండా పోయాయని, వంట సామాగ్రితో పాటు బియ్యం, పప్పులు అన్నీ మునిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చూసుకుంటూ రూపాయి.. రూపాయి మిగిల్చుకుని కొన్న ఫ్రెజ్, కూలర్, మంచాలు, బట్టలు, బియం్య, పప్పులు, వంట సామాను ఇలా అన్ని వస్తువులు తడిసి పోయాయని కండ్రికకు చెందిన శేషగిరి చెప్పారు. తాను తాపీ మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని ఎంతో కష్ట పడి కొనుకున్న వస్తువులు వరద పాలు కావడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంత మయ్యారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది విజయవాడ నగర వాసులను వరదలు బాధితులుగా మారారు. ప్రతి ఒక్కరిది ఇదే ఆవేదన. బుడమేరు వరదల ముంపునకు గురైన ప్రతి కాలనీలో ఇవే రోదనలు. ఎక్కడ చూసినా హృదం చలించిపోయే హాహాకారాలు. నాలుగైదు రోజుల పాటు వరద నీటిలో మగ్గి పోయి, కంపు కొడుతున్న వస్తువులు ఎంత ఆరబెట్టుకున్నా ఏ మాత్రం పాటుకొస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
దాదాపు 2లక్షలకుపైగా కుటుంబాలు వరదల ప్రభావానికి గురయ్యారు. ఉన్న సామానంతా వరద మంపునకు గురి కావడంతో ప్రతి ఇంట్లో రూ. 50వేల నుంచి రూ. 1.5లక్షల వరకు నష్ట వాటిల్లిందని బాధితులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే బైక్‌లు కూడా పాడై పోయాయి. వీటితో కలుపుకుంటే నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నారు. కూలీ నాలీ చేసుకునే వారికి, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్న వారికి ఇది పెద్ద నష్టమనే చెప్పాలి. వరదల వల్ల వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకోవడానికి, తిరిగి వస్తువులను సమకూర్చుకోవడం అనేది తలకు మించిన భారమే అవుతుంది.