
తిరుమల వైకుంఠ దర్శనానికి మార్గాలు ఇవే..
టీటీడీ, పోలీసు శాఖ సిద్ధం చేసిన రూట్ మ్యాప్ ఇదీ..
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలకు ఈ నెల 30 వ తేదీ నుంచి మూడు రోజులు.. మూడు ప్రదేశాల నుంచి యాత్రికులను అనుమతించడానికి ఏర్పాట్లు చేశారు. టైంస్లాట్ టోకెన్ లో సూచించిన సమయం ప్రకారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కడి నుంచి క్యూలో ప్రవేశించాలనే రూట్ మ్యాప్ తిరుపతి జిల్లా పోలీస్ శాఖ సిద్ధం చేసింది. ఆ ప్రదేశాల్లో మొదటి మూడు రోజులు ఈ డిప్ స్లాటెడ్ టోకెన్లు ఉన్న యాత్రికులను మాత్రమే అనుమతిస్తారు. టోకెన్లు లేని వారిని ఆలయంలోకి అనుమతి ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.
తిరుమలలో యాత్రికులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే కార్యక్రమాలకు టీటీడీ, తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించాయి. ఈ నెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. 31వ తేదీ, 2026 జనవరి ఒకటో తేదీ వరకు మూడు రోజుల పాటు టోకెన్లు ఉన్నవారికి మాత్రమే దర్శనం ఉంటుంది. దీనికి సంబంధించి టీటీడీ 1.70 లక్షల మందికి ఆన్ లైన్ ద్వారా టోకెన్లు కేటాయించిన విషయం తెలిసిందే.
తిరుమలలో ఈ నెల 30వ తేదీ వైకుంఠ ద్వార దర్శనానికి శ్రీవారి ఆలయంలోకి వెళ్లడానికి రూట్ మ్యాప్ ప్రకటించారు.
తిరమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 30వ తేదీ (ఏకాదశి), 31వ తేదీ (ద్వాదశి), జనవరి 1వ తేదీకి 1.76 లక్షల మంది భక్తులకు ఈ-డిప్ విధానంలో ముందస్తుగా స్లాటెడ్ సర్వ దర్శన టోకెన్లు కేటాయించినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రోజుకు 60 వేల మందికి పైగా భక్తులకు, మొత్తం 14 స్లాట్లలో టోకెన్లు జారీ చేశామని ఆయన తెలిపారు. ఆ యాత్రికులను క్యూలోకి రావడానికి తిరుమలలో ప్రవేశ మార్గాలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు
ఉదయం: స్లాట్ల భక్తులు కృష్ణతేజ సర్కిల్ నుంచి
మధ్యాహ్నం: స్లాట్ల భక్తులు ఏటీజీహెచ్ నుంచి
రాత్రి: స్లాట్ల భక్తులు శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది.
Note: టోకెన్ లేని భక్తులకు ఈ మూడు రోజులు దర్శనాలు ఉండవని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది.
భద్రత కోసమే..
తిరుమలలో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు. వైకుంఠద్వార దర్శనాల సందర్భంగా భక్తుల భద్రత, సౌకర్యవంతమైన దర్శనం కోసం కొన్ని సూచనలు చేశారు.
1) టీటీడీ కేటాయించిన స్లాట్ సమయానికి మాత్రమే భక్తులు ప్రవేశ మార్గాల వద్దకు చేరుకోవాలి.
2) టోకెన్, ఆధార్/గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
3) సూచించిన ప్రవేశ మార్గాలనే అనుసరించాలి, మార్గం మార్పు చేయకూడదు.
4) పోలీస్, టీటీడీ సిబ్బంది ఇచ్చే ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
"తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే యాత్రికులు ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా చేరకుండా శాంతి భద్రతలకు సహకరించండి" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు కోరారు.

