ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిలిచాయి. ఇది ఆంధ్రరాష్ట్రానికి గర్వకారణం.


ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఆంధ్రపదేశ్‌లో ఐదింటిని ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ (ఐసీఐడీ) గుర్తించింది. ఇప్పటికే నాలుగు కట్టడాలను గుర్తించిన ఐసీఐడీ ఇటీవల దవళేశ్వరం బ్యారేజ్‌ను కూడా ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించి గుర్తింపు పత్రాన్ని అందజేసింది. వారసత్వ కట్టడాలుగా గుర్తించిన వాటిలో ప్రకాశం బ్యారేజ్, కేసీ (కర్నూలు–కడప) కెనాల్, కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువులను 2020లో గుర్తించారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజ్‌ను 2022లో ఎంపిక చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా జలవనరుల సంరక్షణ, తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే విధానాలపై అధ్యయనం చేసి వాటి ఫలితాలను దేశాలకు అందించడమే లక్ష్యంగా 1950 జూన్‌ 24న ఐసీఐడీ ఏర్పాటైంది. ప్రకాశం బ్యారేజ్‌ ద్వారా 13.08 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.


కంభం చెరువు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశంజిల్లా కంభంలో ఉంది. ఈ చెరువును 15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించారు. ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది.
గోదావరి డెల్టాను 160 సంవత్సరాలుగా సస్యశ్యామలం చేస్తున్న దవళేశ్వరం బ్యారేజ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం అక్కడి వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. గోదావరి డెల్టా భారతదేశపు ధాన్యాగారంగా పిలువబడుతున్న విషయం తెలుసు. ఐసీఐడీ ఈ మేరకు 2022 అక్టోబరు 6న ఆస్త్రేలియాలోని ఆడిలైట్‌లో ఏర్పాటు చేసిన సభలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డిలకు దవళేశ్వరాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తూ గుర్తింపు పత్రాన్ని అందజేసింది. ఆ సంస్థ చైర్మన్‌ ఫ్రొఫెసర్‌ ఆర్‌ రగబ్‌ రగబ్‌ అందజేశారు.


కాకినాడ నుంచి పాండిచ్చేరికి జల రవాణా మార్గానికి కేంద్ర బిందువుగా చేసేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం అప్పట్లో దవళేశ్వరం ఆనకట్టను నిర్మించింది. కాకినాడ కెనాల్‌ మీదుగా దవళేశ్వరం బ్యారేజ్‌కు చేరి అక్కడి నుంచి కొమ్మమూరు, బకింగ్‌హాం కెనాల్‌ ద్వారా బంగాళా ఖాతంలోకి చేరుకుని అక్కడి నుంచి చెన్నై, పాండిచ్చేరికి వెళ్లేలా అప్పట్లో జల రవాణా మార్గాన్ని ఏర్పాటు చేశారు.
రాజమహేంద్రవరానికి సమీపంలో 1844 దవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టాల్సిన అవసరాన్ని ఒక రిపోర్టు ద్వారా సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ప్రభుత్వ రెవెన్యూ బోర్డుకు పంపించారు. ఆనకట్ట నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 1846లో అనుమతి మంజూరు చేసింది. దవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం 1847లో ప్రారంభమై 1852 నాటికి పూరై్తంది. అంటే ఐదేళ్ల కాలంలోనే ఒక భారీ ప్రాజెక్టును అప్పటి పాలకులు పూర్తి చేశారు. ఆ కట్టడాన్ని ఎంతో గొప్ప కట్టడంగా ఇప్పటికీ ఆర్క్‌టెక్చర్‌ నిపుణులు చెబుతుంటారు. ఆనకట్ట నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం సర్‌ ఆర్థర్‌ కాటన్‌కే అప్పగించడం విశేషం. అప్పటి ఎస్టిమేషన్‌ ప్రకారం 1,50,000 పౌండ్‌లతో పూర్తయింది. ఈ ఆనకట్ట ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా లేనందున దీని స్థానంలో మరో కొత్త ఆనకట్టను 1970లో నిర్మించి దానికి సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజ్‌ అని ప్రభుత్వం పేరు పెట్టింది. దవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో భారతీయ అధికారి వీనం వీరన్న సర్‌ ఆర్థర్‌ కాటన్‌కు అప్పట్లో సహకరించారు. వీరన్న జ్ఞాపకార్థంగా ఆనకట్టపై ఆయన పేరును కూడా లిఖించారు. అంతే కాకుండా వీరన్నకు కాటన్‌ దొర రావు బహదూర్‌ అనే బిరుదు కూడా ఇచ్చాడు. తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాల్లో 10,13,376 ఎకరాలకు సాగునీరు అందుతోంది. అలాగే 833 గ్రామాలకు తాగునీరు కూడా అందుతోంది. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలువలను ఆధునీకీకరించారు.
Next Story