తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులకు శాఖల నిర్వహణ సవాలేనని చెప్పొచ్చు. నిర్వీర్యమైన శాఖలను పునరుద్దరించే బాధ్యత ఈ మంత్రులపై ఉంది.
కొత్త మంత్రి వర్గానికి ప్రభుత్వ శాఖల పునర్‌వ్యవస్థీకరణ ఒక సవాల్‌గా చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో శాఖలకు ఇవ్వాల్సిన ప్రయారిటీలే లేకుండా పోయాయి. ఏ ఉద్దేశ్యంతో అయితే విభాగాలు ఏర్పడ్డాయో ఆ విభాగాలు ఆ పనులు చేయలేకపోయాయి. వైద్య ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పౌర సరఫరాలు వంటి శాఖలు తప్ప మిగిలిన శాఖలు ఏవీ పనిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ప్రతి వర్గానికీ డిబిటీ పద్ధతి ద్వారా డబ్బులు ఇస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఏ విధమైన పథకాలు ప్రజలకు అవసరమో ఆలోచించి ప్రభుత్వాలు రూపొందించాయి. అయితే ఆ విధానానికి స్వస్థి చెప్పిన గత ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించిందని చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏయే శాఖలు అనేదానిపై ఇంతవరకూ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. శుక్రవారం సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఊహించిన విధంగానే డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్‌కు అత్యంత ప్రయారిటీ ఇచ్చారని ఆయనకు కేటాయించిన శాఖలను బట్టి చెప్పొచ్చు. ఐదు శాఖలను ఆయనకు కేటాయించారు. గతంలో ఎప్పుడూ ఇన్ని శాఖలు ఏ మంత్రికీ కేటాయించలేదు. ప్రస్తుతం పర్యావరణ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రాణవాయువు కూడా రానురాను లేకుండా పోయే పరిస్థితులు ఉత్పన్న మయ్యాయి.
యువ నాయకుడు నారా లోకేష్‌లకు విద్యా శాఖ (మానవ వనరుల అభివృద్ధి)ను కేటాయించడం చాలా మంచి ఆలోచన అని పలువురు అంటున్నారు. ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు కూడా లోకేష్‌లో ఉండే ప్రతిభకు మరింత పదును పెట్టే శాఖలని చెప్పొచ్చు. ఐటీ సంస్థలు రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర లోకేష్ పోషించాల్సిన అవసరం ఉంటుంది. హోం శాఖను ఎవరికి కేటాయిస్తారనే అంశంపై పలు సందర్బాల్లో రాజకీయ విశ్లేషకుల్లో చర్చలు జరిగాయి. మొదట పవన్ కళ్యాణ్‌కు హోంశాఖ ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత గ్రామీణాభివృద్ది శాఖను కోరుకుంటున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోం శాఖను కేటాయించారు.
ఇక కేటాయించిన శాఖల్లో చెప్పుకోదగినవి వ్యవసాయం, సహకార మార్కెటింగ్, పశు సంవర్థక, పాడి అభివృద్ధి, మత్య శాఖ. ఈ శాఖలు కింజరాపు అచ్చెన్నాయుడుకు ఇచ్చారు. గ్రామీణ రంగంలో ఈ శాఖలు కీలకమైనవిగా చెప్పొచ్చు.
జనసేన ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్‌కు కూడా ప్రాధాన్యత ఉన్న శాఖలు కేటాయించారు. ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు వంటి శాఖలు కేటాయించడం ద్వారా జనసేనకు మంచి ప్రయారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. బిజెపి నాయకుడు సత్యకుమార్ యాదవ్‌కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యను కేటాయించారు. ఈయనకు కూడా ప్రయారిటీ ఉన్న శాఖలు కేటాయించారు.
డోలా బాలవీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను అప్పగించారు. సాంఘిక సంక్షేమం అనే పదానికి గత ప్రభుత్వంలో అర్థం మారిపోయింది. కేంద్రం నుంచి ఎస్సీలకు రాజ్యాంగ పరంగా వచ్చే సౌకర్యాలు కూడా ఆగిపోయేలా గత ప్రభుత్వం చేసింది. సబ్సిడీ పథకాలు లేకుండా పోయాయి. మూడు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసినా అలంకార ప్రాయంగా మారాయి. సాంఘిక సంక్షేమం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ముందుకు నడవాలంటే స్వామి చాలా కష్ట పడాల్సి ఉంటుంది. నిర్వీర్యమైన శాఖను పునరుద్ధరించాల్సి ఉంది. బాలవీరాంజనేయ స్వామికి మంత్రివర్గంలో తప్పకుండా స్థానం దక్కుతుందని అందరూ బావించారు. వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాదించారు. ప్రకాశం జిల్లాలో సౌమ్యుడైన ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు.
విద్యుత్ శాఖను గొట్టిపాటి రవికుమార్‌కు ఇచ్చారు. ఇప్పుడు ఇది కత్తిమీద సవాల్ అని చెప్పొచ్చు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. అంతే కాకుండా వివిధ రకాల సర్వీస్ చార్జీలు కూడా పెంచి వినియోగదారునిపై మోయలేని భారాన్ని మోపారు. భారీ ఎత్తున చార్జీలు పెంచడం కూడా గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఒక ప్రధానమైన కారణమని పలువురు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
Next Story