ఓటుకు అమ్ముడు పోయిన నేరం కింద ఎస్ఐ, నలుగురు కానిస్టబుళ్లపై పోలీస్ శాఖ వేటు వేసింది. వారిని సస్పెండ్ చేశారు. ఈ నెల 8న పోస్టల్ బ్యాలెట్ ఓటుకు వీరు అమ్ముడు పోయారు.


ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు ఎక్కడ చూసినా కనిపించింది. పోస్టల్ బ్యాలెట్ లలో ఓటుకు రూ. 5వేలు, సాధారణ ఓటుకు రూ. 2 నుంచి 5వేల వరకు వెచ్చించి అభ్యర్థులు ఓట్లు కొనుగోలు చేశారు. ఇది జగమంతా తెలుసు. అయితే ఫిర్యాదు చేసేవారు లేకపోవడంతో ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఎన్నికల కమిషన్ ఉంది. నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఉద్యోగులు, అధికారులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ డబ్బు పెట్టి ఓట్లు కొనుగోలు చేసిన నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఒకటి. ఇక్కడ అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్లకు ఒక్కో ఓటుకు రూ. 5లు ఇచ్చి కొనుగోలు చేశారు. అందుబాటులో ఉన్నవారికి డబ్బులు ఆయా పార్టీల స్థానిక నాయకులు అందజేశారు. దూరంగా ఉన్నవారికి వివరాలు కనుక్కొని ఫోన్ పే, ఇతర నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా డబ్బులు పంపించారు. ఈ దారిలో దొరికారో సబ్ ఇన్ స్సెక్టర్, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు. ఎస్ఐ ప్రస్తుతం మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పేరు ఖాజాబాబు.

ఏమి జరిగింది?

ఓట్ల కొనుగోలు దర్శి నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు జోరుగా సాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అభ్యర్థులు కొనుగోలు చేశారు. ఉద్యోగుల్లో 80శాతం మంది నోటుకు ఓటును ఈ నియోజకవర్గంలో అమ్మేశారు. ఇద్దరు టీచర్లు, ఒక అంగన్‌వాడీ టీచర్, ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లకు తెలుగుదేశం, వైఎస్సార్సీపీ నాయకులు డబ్బులు ఇచ్చేందుకు వచ్చారు. దర్శిలోని ఒక టీచర్ కు టీడీపీకి చెందిన ఒక నాయకుడు డబ్బులు ఇచ్చి టీచర్లు, అంగన్ వాడీ కార్యకర్తకు చేర్చాల్సిందిగా కోరారు. డబ్బలు తీసుకున్న టీచర్ నలుగురి అకౌంట్స్ కు ఫోన్ పే ద్వారా పంపించారు. దర్శిలోని అంగన్‌వాడీ టీచర్ కు పంపించిన డబ్బులు భర్తకు చూపించింది. ఆమె ఫోన్పేకు వచ్చిన డబ్బుల వివరాలను స్క్రీన్ షాట్ తీసి వైఎస్సార్సీపీ నాయకుడికి అంగన్‌వాడీ టీచర్ భర్త పంపించాడు. అంగన్‌వాడీ టీచర్ తెలుగుదేశం పార్టీ మద్దతు దారు. అయితే ఆమె భర్త మాత్రం వైఎస్సార్సీపీ మద్దతు దారు. దాంతో వైఎస్సార్సీపీ వారు జిల్లా ఎస్పికి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ వారు పోస్టల్ ఓట్లు కొనుగోలు చేశారని, దీనికి ఆధారాలు ఉన్నాయని చూపించారు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానికంగా ఇద్దరు టీచర్లు, అంగన్‌వాడీ టీచర్ ను విచారించారు.

మంగళగిరిలో ఎస్ఐగా పనిచేస్తున్న ఖాజాబాబు, మరో నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ కు వైఎస్సార్సీపీ నాయకుడు వెన్నపూస పేరిరెడ్డి డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించారు. పేరిరెడ్డి నలుగురు కానిస్టేబుల్స్ కు పంపించిన డబ్బులు కానిస్టేబుల్ అకౌంట్ కు కాకుండా కానిస్టేబుళ్లు చెప్పినట్లు వేరే వారి అకౌంట్ కు పంపించారు. ఎస్ఐకి మాత్రం నేరుగా ఆయన అకౌంట్ కే పంపించారు. ఈ విషయం కూడా ఎస్పికి ఫిర్యాదు అందింది. దీంతో దర్శి పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. విచారణలో తనకు ఇవ్వాల్సిన డబ్బులు స్నేహితుడు ఇచ్చాడని చెప్పినా వినకుండా ఎస్ఐని డిఐజి సర్వశ్రేష్ఠ త్రిపాటి సస్పెండ్ చేశారు. అదే విధంగా నలుగురు కానిస్టేబుళ్లు కూడా సస్పెన్షన్ కు గురయ్యారు. కురిచేడుకు చెందిన ఖాజాబాబు ఎన్నికలకు ముందు మంగళగిరి స్టేషన్ కు బదిలీపై వచ్చారు. నలుగురు కానిస్టేబుళ్లలో ఇద్దరు దర్శి పోలీస్ స్టేషన్, మరో ఇద్దరు కురిచేడు పోలీస్ స్టేషన్స్ లో పనిచేస్తున్నట్లు సమాచారం.

ఈ విషయమై దర్శి డిఎస్పి హర్షవర్థన్ ను ఫెడరల్ ప్రతినిధి ప్రశ్నించగా ఇప్పటికే కేసు నమోదు చేశామని, వారి సస్పెన్షన్ డిఐజి చేతుల్లో ఉంటుందన్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఓటర్లు దర్శి నియోజకవర్గం వారైనా వేరువేరు ప్రాంతాల్లో ఉద్యోగులుగా ఉన్నారని తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసినందున ఇద్దరు ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్ పై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ వారి వద్ద డబ్బులు తీసుకున్న టీచర్లపై కూడా కేసు నమోదైంది. డబ్బులు పంచిన వైఎస్సార్సీపీ నాయకుడు పేరిరెడ్డిపై కూడా దర్శి ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.

నాయకుడి వాగ్మూలం చెల్లుతుందా?

ఎస్పీకి మొదట ఫిర్యాదు అందటంతో దర్శి ఎస్ఐ సుమన్, డిఎస్పి హర్షవర్థన్ లు మాట్లాడుకుని డబ్బులు ఇచ్చిన వారు, తీసుకున్న వారిపై కేసులు నమోదు చేసి తమ పని తాము చేశామనిపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నాయకుడు, వైఎస్సార్సీపీ నుంచి ఒక నాయకుడు ఈ కేసులో ఉన్నారు. టీచర్లు, పోలీసులు ఈ కేసులో ఉండటం విశేషం. మంగళగిరి టౌన్ ఎస్ఐ బ్యాంక్ అకౌంట్ కు నేరుగా డబ్బులు జమ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాను ఎస్ఐ, కానిస్టేబుళ్లకు డబ్బులు ఇచ్చినట్లు చెప్పిన వైఎస్సార్సీపీ నాయకుడి వాగ్మూలం చెల్లుతుందా? లేదా? అనేది ఇప్పుడు చర్చనియాంశంగా మారింది. తనకు ఇవ్వాల్సిన పదివేలు ఫోన్ పే ద్వారా తన మిత్రుడు పంపించాడని ఎస్ఐ చెబుతున్నారు. ఓటుకు నోటు కేసు ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారి ఉద్యోగ ఓటర్లపై నమోదు కావడం విశేషం. అందులో పోలీసులు, టీచర్లు ఉండటం మరీ విశేషం.

Next Story