చేపల వ్యాపారుల వద్ద బ్రహ్మణి

ఫ్యామిలీ ప్యాక్‌లా మారిన ఎన్నికల ప్రచారాలు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు మాత్రమే వస్తారు.


ఎన్నికల సమయంలో అభ్యర్థుల కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించడం ఒక ట్రెండ్‌గా మారి పోయింది. బరిలో ఉన్న అభ్యర్థి, ఆయన ఏ పార్టీకి చెందిన వారో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రచారం నిర్వహిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లైతే మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని, అధికారంలో ఉన్న వాళ్లైతే ఈ ఐదేళ్లల్లో ఎన్నో మంచి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఈ సారి కూడా ఓట్లేసి గెలిపిస్తే ఇంత కంటే మంచి పనులు చేస్తామని, ఈ సారి కూడా తమకే ఓట్లేయాలని అభ్యర్థిస్తూ కోరుతుంటారు. ఇది సహజం.

ఫ్యామిలీ ప్యాక్‌లా ప్రచారాలు
అయితే వీరితో పాటు ఆయా అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం రంగంలోకి దిగుతున్నారు. గతం నుంచి ఇది కొనసాగుతున్నా ఈ మధ్య కాలంలో ఇది ఒక ట్రెండ్‌గా మారింది. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది తమ కార్యకర్తలు, అనుచరులను వెంటేసుకొని కాన్వాస్‌ చేయడం ఒక ఫ్యాషనై పోయింది. అప్పటి వరకు కనిపించని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వారిపైన ఎనలేని ప్రేమను కురుపిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆ సమయంలో ప్రజలు బట్టలు ఉతుకుతుంటే వీరు బట్టలు ఉతకడం, ఇడ్లీలు వేస్తుంటే వీరు వేయడం, దోసెలు పోస్తుంటే వీరు పోయడం ఇలా రకరకాలుగా ఓటర్లకు దగ్గరయ్యే ప్రతయ్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల కూతుళ్లు, కొడుకులు, అల్లుళ్లు, అమ్మలు, భార్యలు, అత్తలు ఇలా కుటంబం యావత్తు ప్రచార రంగంలో నిమగ్నమయ్యారు.
ఎన్నికల తర్వాత..?
అయితే అసలు విషయం ఆ తర్వాతే ఉంది. ఎన్నిలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత ఒక వారు అడ్రస్‌ ఉండరు. అప్పటి వరకు సునామీల్లా ఓటర్లను చుట్టు ముట్టిన కుటుంబ సభ్యులు ఇక కంటికి కనిపించరు. ఏదైనా సమస్యలపై వాళ్ల ఇంటికి వెళ్తే కనీసం పలకరించే దిక్కు కూడా ఉండరు. చిన్న చిన్న లీడర్ల నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు ఇదే వరుస. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణం ఉంది. సీఎం జగన్‌ గెలుపు కోసం పులివెందులలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి గత ఎన్నికల్లోను ప్రచారం చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. గెలిచిన తర్వాత ఆమె ఆ ప్రాంతంలో ప్రజల్లో వెళ్లింది లేదు. వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించింది లేదనేది కూడా స్థానికుల్లో చర్చగా ఉంది.
నారా బ్రాహ్మణిది కూడా ఇదే వరుస. లోకేష్‌ గెలుపు కోసం మంగళగిరిలో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లేసి తన భర్త లోకేష్‌ను గెలిపించాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లోనూ ఆమె ప్రచారం నిర్వహించారు. తర్వాత మాయం అయ్యారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడూ ఎన్నికల ఊసే ఎత్తని నారా భువనేశ్వరి ఈ ఎన్నికల్లో భర్త ముఖ్యమంత్రి కావడం కోసం ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లిన తరువాత నిజం గెలవాలి పేరుతో ప్రచారం ప్రారంభించారు. ఓట్లు అడగటంతో పాటు వ్యాపార రంగంలో ఎలా రాణించాలో కూడా చెప్పుకుంటూ వెళుతున్నారు.
నెల్లూరు ఎంపీలుగా పోటీలో ఉన్న విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి కుమార్తెలు వారి తండ్రుల పక్షాన ప్రచారం నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారాయణ తరపున ఆయన కుమార్తె ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయవాడ ఎంపీ కోసం పోటీలో ఉన్న కేశినేని బ్రదర్స్‌ తరపున వారి కుమార్తెలు ప్రచారం నిర్వహిస్తున్నారు.
విజయవాడ సెంట్రల్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్‌ గెలుపు కోసం ఆయన కూమార్తె, అల్లుడు, బొండా ఉమా కోసం ఆయన కుమారుడు, కోడలు ప్రచారం చేస్తున్నారు. పామర్రులో కైలే అనిల్‌ కుమార్‌ గెలుపు కోసం ఆయన భార్య లీనా, అనిల్‌ సోదరుడు జగదీష్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. కైకలూరులో దూలరం నాగేశ్వరరావును గెలిపించాలని ఆయన కుటుంబ సభ్యులు దూలం వీరకుమారి, దూలం అనుపమ, దూలం స్వాతిలు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు ప్రతి అభ్యర్థికి వారి కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే గెలిచిన తర్వాత ఎంత మంది వచ్చి ఓటర్ల సమస్యలు తెలుసుకుంటారు, ఎంత మంది సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తారనేది స్థానికుల్లో చర్చగా మారింది.వారు ఎన్నికప్పుడే కనిపిస్తారుఫ్యామిలీ ప్యాక్‌లా మారిన ఎన్నికల ప్రచారాలు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు మాత్రమే వస్తారు.
Next Story