క్యాష్ ఇవ్వలేదని.. కారు ఎత్తుకెళ్లాం.. తీగలాగితే కదిలిన యువతి..
x
మృతురాలు జయమ్మ(ఫైల్)

క్యాష్ ఇవ్వలేదని.. కారు ఎత్తుకెళ్లాం.. తీగలాగితే కదిలిన యువతి..

చంద్రగిరి పోలీస్ స్టేషన్, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తిలా కనిపించే అతను వచ్చి పోలీసులతో మాట్లాడూ తొండవాడలో తన కారు పోయిందని, వివరాలు అందిస్తూ ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు అయ్యాక పోలీసులు రొటీన్ గానే విచారణ ప్రారంభించి, దొంగలను పట్టుకున్నారు. కానీ కథ ఇక్కడే అసలు మలుపు తిరిగింది. దొంగలను పట్టుకున్నాక పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించగానే.. అసలు విషయాన్ని కక్కేశారు. ఓ మర్డర్ కేసులో ఇస్తా అన్నా డబ్బులు ఇవ్వకపోవడంతో కారును ఎత్తుకెళ్లామని సదరు దొంగలు నిజం చెప్పేశారు. ఇంతకీ జరిగిన క్రైమ్ ఏంటంటే..

అనంతపురం జిల్లా..

అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రా రెడ్డి, షెడ్యూల్డ్ కులానికి చెందిన జూట్ల జయమ్మను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరు మొదట్లో అన్యోన్యంగానే ఉండేవారు. ఓ మగబిడ్డ సైతం జన్మించాడు. ఆ తరువాత ఆమెతో రవీంద్రా రెడ్డికి మనస్పర్థలు వచ్చాయి. మొదటి భార్య కు తెలియకుండా రెండో వివాహం చేసుకుని అక్కడ నుంచి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి మకాం మార్చాడు. పక్కనే ఉన్న బుచ్చినాయుడు పల్లెలో కోళ్ళ ఫామ్‌ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. భర్త రవీంద్రా రెడ్డి ఆచూకీ కోసం వెతికిన జయమ్మ చివరకు తిరుపతిలో ఉన్నాడని తెలుసుకుంది.



భర్తను నిలదీసిన జయమ్మ

గత ఏడాది మే 25న జయమ్మ, రవీంద్రా రెడ్డిని అతను నిర్వహిస్తున్న కోళ్ళ ఫామ్ వద్ద నిలదీసింది. తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించింది. తరువాత ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ జరిగింది. ఘర్షణలో రవీంద్రారెడ్డి, భార్య జయమ్మను కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని కోళ్ల ఫాంలో పనిచేసే వారి సాయంతో రాజంపేట ప్రాంతంలో పూడ్చిపెట్టాడు. తిరిగి యథావిధిగా తన పనుల్లో బిజీ అయిపోయాడు.

మిస్సింగ్ కేసు

తన భర్త జాడ తిరుపతికి దగ్గర్లో ఉందని, అతని కోసం వెళ్తున్నాని జయమ్మ ఇంట్లో చెప్పి బయలుదేరింది. అయితే ఆమె సమాచారం తెలియకపోవడం, ఇంటికి సైతం రాకపోవడంతో ఆమె సోదరుడు దేవేంద్ర అక్కడ అనంతపురం నాలుగో స్టేషన్లో కేసు పెట్టాడు. గత ఏడాది జూన్ 3న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే అక్కడి పోలీసులు కేసును సీరియస్ గా తీసుకోలేదు.



మలుపుతిప్పిన కారు చోరీ కేసు

చంద్రగిరి మండలం తొండవాడ విల్లాస్‌లో 10 రోజుల క్రితం తన కారు చోరీ అయిందని రవీంద్రా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కారు దొంగతనం చేసిన వారిని చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో నిందితులు చెప్పినవి విని పోలీసులు విస్తుబోయారు. తాము కారు దొంగతనం చేయలేదని, రవీంద్ర రెడ్డి చేసిన మర్డర్‌ కు సాయం చేస్తే ఇస్తానన్న అమౌంట్ ఇవ్వకపోవడంతో కారు ను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. దీంతో కారు దొంగతనం కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది.

‘తెలీదు..గుర్తులేదు.. మర్చిపోయా’ పోలీసులకు చుక్కలు చూపెట్టిన నిందితుడు

చంద్రగిరి పోలీసులు రవీంద్రా రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తనను జయమ్మ డబ్బుల కోసం వేధించేదని, ఆవేశంలో కొడితే చనిపోయిందని హత్యను ఒప్పుకున్నాడు. కానీ, మృతదేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టావంటే మాత్రం ‘తెలీదు.. గుర్తులేదూ.. మరిచిపోయా.!’అని పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు.



పోలీసులు అతనిని పలుమార్లు రాజంపేట ప్రాంతానికి తీసుకెళ్ళారు. అయినా సరే జయమ్మ మృతదేహం పాతిపెట్టిన ప్రాంతం మాత్రం ‘ తెలియదు.. గుర్తు లేదూ.. మరిచిపోయా.!’ అని చెప్పేవాడు. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి జయమ్మ మృతదేహం కోసం గాలించారు. మొత్తానికి నందలూరులో మృతదేహం పాతిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించారు పోలీసులు. అక్కడి తహసీల్దార్ సమక్షంలో శవపంచనామా చేయటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Read More
Next Story