భస్మాసుర హస్తం అంటే అందరికీ తెలుసు. అటువంటి రాజకీయాలు చేసి ఫెయిల్ అయ్యారో అభ్యర్థి. ఏ నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది. ెలా జరిగింది?


ఎవరినెత్తిన తాను చేయి పెట్టినా భస్మం అయిపోయేలా వరం ఇవ్వాల్సిందిగా భస్మాసురుడు ఈశ్వరుడిని వరం కోరాడు. దీంతో ఆయన వరం ఇచ్చాడు. చివరికి తన నెత్తిపై తానే చేయిపెట్టుకుని భస్మం అయ్యాడు. ఇది కథ. కానీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి పన్నిన వ్యూహం బెడిసి తన నెత్తిన తానే చేయి పెట్టుకుని భగవంతుడా అని తలపట్టుకున్నాడు. ఈ సంఘటన తెలిసిన తెలుగుదేశం పార్టీ వారు కూడా విస్తుపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ వ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఒక అభ్యర్థి ప్రత్యర్థి ఓట్లను చీల్చాలని వేసిన వ్యూహం కాస్త బెడిసింది. ఇప్పడు తలపట్టకున్నాడు. తనను ఓడించేందుకు వ్యూహం పన్నిన అభ్యర్థి వ్యూహాన్ని ఎలాగైనా తిప్పి కొట్టాలని భావించాడు ప్రత్యర్థి. కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయ వ్యూహాలకు పెట్టింది పేరు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ పోటీలో ఉన్నారు. ఎన్‌డీఎ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీచేశారు.
సోమవారం నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ముగిసింది. అనుకున్నట్లు ముందుగా యార్లగడ్డ వెంకట్రావు వంశీ పేరుతో ఉన్న వల్లభనేని మోహన్‌ వంశీకృష్ణ అనే ఒక వ్యక్తిని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దించాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న బీజెపీ రెబల్‌ అభ్యర్థిగా మరో వ్యక్తి కొర్రప్రోలు శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. తనకు గ్లాసు గుర్తును కేటాయించాలని శ్రీనివాసరావు ఎన్నికల సంఘాన్ని రాతపూర్వకంగా అడిగారు. ఒకరికి మించి స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నందున అడిగిన వెంటనే గ్లాసు గుర్తు ఇవ్వడం కుదరదని చెప్పిన ఎన్నికల సంఘం ఇరువురి పేర్లతో లాటరీ తీసింది. దీంతో గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని మోహన్‌ వంశీ కృష్ణకు వచ్చింది. గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీది కావడం, జనసేన తెలుగుదేశం కూటమిలో భాగం వకావడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేందుకు ఇష్టంలేని వారు జనసేన గుర్తయిన గాజు గ్లాసుకు ఓటు వేసే అవకాశం ఉందని భావించిన టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గ్లాసు గుర్తును అడిగిన అభ్యర్థికి ఇచ్చి మోహన్‌ వంశీ కృష్ణకు వేరే గుర్తు కేటాయించాల్సిందిగా కోరారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం చేశామని, ఇప్పుడేమీ తాము చేయలేమని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చేతులెత్తేశారు. దీంతో ఇప్పుడు టీడీపీ అభ్యర్థి తలపట్టుకున్నారు.
వంశీ చక్రం తిప్పారా?
లాటరీ తీసి గుర్తును కేటాయించామని ఎన్నికల అధికారులు చెబుతున్నా ముందుగా విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంశీ తనను దెబ్బతీసేందుకు తన పేరుతో ఉన్న మరో వ్యక్తిని తెలుగుదేశం వారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయించినందున ఎలాగైనా టీడీపీని దెబ్బకొట్టాలని గాజు గ్లాసు గుర్తును మోహన్‌ వంశీ కృష్ణకు వచ్చేలా చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. చెరపకురా చెడేవు అంటారు పెద్దలు. నువ్వొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందంటారు. అలాగే ఈ ఎన్నికల్లో ఇలా జరిగిందేంటబ్బా అంటూ తెలుగుదేశం వారు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నేను యార్లగడ్డకు మద్దతు ఇస్తున్నానని, తనకు కాకుండా యార్లగడ్డకు ఓటు వేయాలని ప్రచారం చేసేందుకు స్వతంత్ర అభ్యర్థి మోహన్‌ వంశీ కృష్ణ రెడీ అయ్యాడని సమాచారం.
బిజెపి అభ్యర్థి నుంచి కూడా తలనొప్పే..
బిజెపికి చెందిన ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి కూటమి ద్వారా వెయ్యాల్సి ఉంటుంది. కూటమిని వ్యతిరేకించిన రెబల్‌ బీజేపీ నుంచి పోటీలో ఉండటం వల్ల తాను బీజేపీ వాడినని, తనకు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నాడు శ్రీనివాసరావు. టీడీపీ ఎమ్మెల్యే వంశీని ఇబ్బంది పెడదామని చేసిన వ్యూహం ఫలించకపోగా బీజేపీ నుంచి, తాము పోటీలోకి దింపిన అభ్యర్థి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇదీ విషయం.
Next Story