కేంద్ర బడ్జెట్ దేశానికి సమగ్రమైన బ్లూ ప్రింట్. దేశ భవిష్యత్ ను నిర్ణయిస్తుంది. ఈ మాటలు అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
కేంద్ర బడ్జెట్ దేశానికి దిశ నిర్దేశం చూపిస్తుంది. ఎగువ మధ్య తరగతి వారికి బాగా ఉపయోగ పడుతుంది. మధ్యతరగతి వారిలో కొనుగోలు శక్తిని పెంచుతుంది. వినిమయం పెరిగితే ప్రజల చేతుల్లోని డబ్బులు ప్రభుత్వం చేతిలోకి వస్తాయి. తద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. అనే అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు కేంద్ర బడ్జెట్ పై ట్వీట్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారెకి నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ సారధ్యంలో వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తుంది. మహిళలు, పేదలు, యువత, రైతులకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో ఆరు కీలక రంగాలపై బడ్జెట్ పనిచేస్తుంది. జాతీయ శ్రేయస్సు ధ్యేయంగా ముఖ్యమైన అడుగులు వేస్తుంది. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్ ను ఇస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖ అయిన మధ్యతరగతి వారికి పన్నుల నుంచి మినహాయింపును ఇచ్చింది. అందుకే ఈ బడ్జెట్ ను స్వాగతిస్తున్నామన్నారు.
ప్రధాన మంత్రిని, ఆర్థిక మంత్రిని అందలానికి ఎత్తడం మంచిదే. ఎందుకంటే వారు దేశ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేసినట్లు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించారు కాబట్టి. కాల మాన పరిస్థితులను బట్టి బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ అనేది అన్ని వర్గాలను ప్రభావితం చేసేదిగా ఉండాలి. ఒక వర్గాన్ని కానీ, ఒక రాష్ట్రాన్ని కానీ ప్రభావితం చేసి మిగిలిన రాష్ట్రాలు, వర్గాలను మరిచిపోతే మరుగున పడిన వాటి ప్రభావం ప్రజలందరిపై మరింతగా ఉంటుందనేది పాలకులకు తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వనరుల్లో మేటిగా అందరూ చెబుతుంటారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తయారైంది. కోస్తా తీరంలో కోట్లు సంపాదించ వచ్చని, రాష్ట్రానికి జీవ వనరుగా కోస్తా ఉందని పాలకులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
కోస్తా తీరం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేత్లో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిందని చెప్పొచ్చు. తీరంలో ఏర్పాటు చేస్తున్న ఓడ రేవులు, పారిశ్రామిక వాడలు ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న బడా బాబుల చేతుల్లోకి వెళుతున్నాయి. తీరంలో ఉన్న గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు పెట్టుబడి దారుల చేతుల్లో ఉన్నాయి. రాష్ట్రంలో గ్యాస్ ఉత్పత్తి జరుగుతున్నా ఆ గ్యాస్ ను రాష్ట్రం వాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది. ఇలా ఏ వనరు తీసుకున్నా అందనంత దూరంలో ఉంది. ఈ వనరులను ఉపయోగించుకుని వేల కోట్లు ప్రైవేట్ వారు సంపాదిస్తుంటే వాటిపై వచ్చే శిస్తుతో ప్రభుత్వం సరిపెట్టుకుంటోంది.
ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికోసం ఎదురు చూస్తోందని ఒకసారి పరిశీలిస్తే.. పెట్టు బడి దారుల కోసం అని స్పష్టంగా ఎవరికైనా అర్థం అవుతుంది. నూతనంగా ఏపీలో బాధ్యతలు చేపట్టిన కూటమి ఏడు నెలల కాలంలో పెట్టుబడి దారుల కోసం అర్రులు చాస్తోంది. ఎవరొచ్చి పెట్టుబడులు పెడతారా? అని ఎదురు చూస్తోంది. ప్రజలకు ఆర్థికంగా ఉపాధి కల్పించే ఒక మంచి పథకాన్ని ప్రభుత్వ రంగంలో ప్రారంభించేందుకు కేంద్రం సాయం చేయాలనే మాట ఒక్కసారైనా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కేంద్రానికి విన్నవించారా? అంటే లేదనే సమాధానం వస్తుంది.
కేంద్ర బడ్జెట్ బాగుందని చెప్పిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీస సాయం చేసి అప్పుల నుంచి ఆదుకుని ఉంటే బాగుండేదనే మాట కూడా అనలేక పోయారు. బాధల్లో ఉన్న ఆంధ్రులను ఆదుకోవాలనే మాట ప్రజల మాటగా చెబితే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? కేంద్ర ప్రభుత్వం కొనసాగేందుకు కావాల్సిన ఆయుధాన్ని చేతుల్లో పెట్టుకుని కూడా ప్రజల వేదనను వెల్లడించలేక పోవడం బాధపడాల్సిన అంశంగానే భావించాల్సి ఉంటుంది. బడ్జెట్ బాగుందనే మాటతో పాటే ఆంధ్ర ప్రదేశ్ ను ప్రత్యేకంగా ఆదుకోవాలనే ఆవేదన వ్యక్తం చేసినా ప్రజలకు పాలకులపై మరింత గౌరవం, సానుభూతి పెరిగేది. కానీ ఆ సానుభూతిని ఆంధ్ర ప్రజల నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సంపాదించలేక పోయారు.