ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు వచ్చేనెల 8న ఎన్నికలు గుంటూరు కేంద్రంగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ప్యానల్ రాజీనామా చేశారు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాజకీయాలకు అతీతంగా ఐదేళ్ల క్రితం వరకు ఉన్న ఏసీఏ గత ప్రభుత్వ హయాంలో ఆ నాయకుల కనుసన్నల్లో నడిచింది. తిరిగి టీడీపీ ప్రభుత్వం రావడంతో గత కమిటీ రాజీనామా చేసింది. దీంతో కొత్తవారు ఎన్నిక కావాల్సి ఉంది. క్రికెట్ అసోసియేషన్‌లో ఎవరు ఉండాలనేది లోకేష్ నిర్ణయించినట్లు సమాచారం. అధ్యక్షునిగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఉపాధ్యక్షునిగా విశాఖపట్నం నార్త్ బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును పోటీకి దింపుతున్నారు. కార్యదర్శిగా కాకినాడ నుంచి లోకేష్ అనుచరుడు సానా సంతోష్ పోటీ చేస్తున్నారు. ఈయనను మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. ఈయనకు ఇప్పటి వరకు ఏ అసోసియేషన్‌లోనూ సభ్యుడు కాదు. అందు వల్ల ఓటు లేదు. కాకినాడ జిల్లా అసోసియేషన్ నుంచి సభ్యత్వం ఇచ్చేందుకు అక్కడి వారు నిరాకరించారు. దీంతో విశాఖపట్నం క్రికెట్ క్లబ్ నుంచి సభ్యత్వం తీసుకుని ఓటు హక్కును సంపాదించారు. ఇందుకు మాజీ కార్యదర్శి ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డి సహకారం ఉన్నట్లు సమాచారం. సహాయ కార్యదర్శిగా చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నుంచి విజయకుమార్‌ను పోటీ పెడుతున్నారు. కోశాధికారి పోస్టుకు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మునుమడు ఆదిత్మవర్మను నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ నుంచి వర్మకు ఓటు హక్కు ఉంది. కౌన్సిలర్ పోస్టును మాజీ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డికి వదిలేసినట్లు సమాచారం. ఆయన ఎవరిని పెట్టినా వారికి మద్దతు ఇచ్చేందుకు ప్రస్తుత ప్యానల్ నిర్ణయించింది.
ఏసీఏలో పూర్తిగా రాజకీయాలు
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఎలా గెలవాలో అదే విధంగా ఏసీఏలోనూ పూర్తిగా రాజకీయ పార్టీలు ఇన్‌వాల్వ్ అయ్యాయి. దీంతో క్రికెటర్లలో ఉత్కంఠగా ఉంది. గతంలో ఎవరు ఏసీఏలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి. క్రీడాకారుల ఎంపికపై ఇకపై రాజకీయ ప్రభావం ఉండే అవకావం ఉంది. క్రికెట్ క్రీడలో అనుభవం ఉన్న వారిని కాకుండా పార్టీలకు అనుకూలంగా ఉండే వ్యక్తులను కూడా క్రీడాకారులుగా సెలెక్ట్ చేసే అవకాశాలు దీని వల్ల వస్తాయనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో టీమ్‌లో 15 మంది క్రీడాకారులు ఉంటారు. వీరిని సెలక్టర్లు ఎంపిక చేస్తారు. మరో ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంటుంది. వీరిని ఎవరిని తీసుకోవాలనే విషయంలో కమిటీ జోక్యం చేసుకుని వారికి కావాల్సిన వారిని జట్టులో పెట్టే అవకాశాలు ఉన్నాయని క్రీడాకారులు అంటున్నారు.
పోటీ ఉండే అవకాశం
అసోసియేషన్ ఎన్నికల్లో మరో ప్యానల్ కూడా పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎంత మంది పోటీ చేసినా చివరకు వారితో మాట్లాడి లోకేష్ కావాలనుకున్న వారిని మాత్రమే ఉంచి మిగిలిన వారిని విరమించుకునేలా చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. కార్యదర్శి పదవికి వైఎస్సార్‌సీపీ నుంచి కూడా అభ్యర్థిని పెట్టాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. టీడీపీలోనూ మరికొందరు పోటీ పడుతున్నా.. లోకేష్ చెప్పిన వారికే ఫైనల్ అవుతుంది.
స్పోర్ట్స్ మెకానిక్ సాఫ్ట్‌వేర్
క్రికెట్ క్రీడను పూర్తి స్థాయిలో పట్టుకునేందుకు ఏసీఏ ఒక సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసింది. క్రీడాకారుల ప్రతిభను ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తిస్తారు. ఆట ఆడుతున్నప్పుడు స్కోర్స్ వేసే వాళ్లకు ఈ సాఫ్ట్‌వేర్ చాలా వరకు ఉపయోగపడుతుంది. తమిళనాడు, కర్నాటక, ఇటీవల ఏపీలో ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉపయోగించుకుంటున్నందుకు ఏడాదికి రూ. 25 లక్షలు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కు ఏసీఏ చెల్లిస్తుంది. క్రీడాకారునికి సంబంధించిన ప్రతి అంశం ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు క్రీడాకారుడు ఎక్కడెక్కడ ఆటలు ఆడారు. ఆయన ప్రతిభ ఏమిటనేది ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా తెలుసుకునేందుకు వీలు ఉంది. అలాగే ఆట ఆడుతున్నప్పుడు స్కోర్ వేసే వారికి మాన్యువల్‌గా కాకుండా ట్యాబ్స్ ఇస్తున్నారు. ట్యాబ్స్‌లో ఎప్పటికప్పుడు స్కోర్ నమోదు చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ‘స్పోర్ట్స్ మెకానిక్’ సాఫ్ట్‌వేర్‌గా పిలుస్తారు.