Tadikonda constituency
గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజక వర్గం తొలుత జనరల్ స్థానం. తర్వాత అది ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారింది. దీని వెనుకాల ఒక గమ్మత్తైన కథ ఉంది.
(జి విజయ కుమార్)
విజయవాడ: తాడికొండ అసెంబ్లీ నియోజక వర్గం ఎస్ సి నియోజకవర్గం కావడం వెనక ఆసక్తి కరమయిన గురు శిష్య సంవాదం ఉంది.
1978 కి ముందు వరకు జనరల్ నియోజక వర్గం. 1967, 1972 లో జరిగిన ఎన్నికల్లో జనరల్ అభ్యర్థులే పోటీ చేస్తూ వచ్చారు. 1978 ఎన్నికల నాటికి తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం మారింది. తొలి సారి దళిత నేత తమానపల్లి అమృతరావు కాంగ్రెస్(ఐ) నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జేఆర్ పుష్పరాజు మూడు సార్లు, తిరువాయిపాటి వెంకయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్, రీసెంట్‌గా ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ అభ్యర్థులుగా రంగంలోకి దిగి గెలుపొందారు.
రాజకీయ పంతం
రాజకీయ నాయకులు పంతం పట్టారంటే దాన్ని నెగ్గించుకునేంత వరకు నిద్ర పోరు. ప్రత్యర్థులకు ఎన్ని అడ్డంకులైనా సృష్టిసారు. చివరకు తాము అనుకున్నది సాధిస్తారు. అదే పంతం ఇద్దరు గురు శిష్యులైన ఉద్దండులైన నాయకుల మధ్య చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఊహించడమే కష్టం. సరిగ్గ ఇదే తాడికొండ అసెంబ్లీ నియోజక వర్గంలో నాడు చోటు చేసుకుంది.
గురు శిష్యుల మధ్య పంతం
ఒక నాటి కాంగ్రెస్ మేటి రాజకీయ నాయకుడు కొత్త రఘురామయ్య శిష్యుడు గద్దె వెంకటరత్తయ్య. గురువు అప్పటికే రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తలపండిన రాజకీయ దురందురుడు. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. 1949లో దానిని వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఢిల్లీ స్థాయికి ఎదిగారు. రెండు దశాబ్ధాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
జవహర్‌లాల్ నెహ్రూ మంత్రి వర్గంలోను, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో వివిధ శాఖల కేంద్ర మంత్రిగా పని చేశారు. కొత్త రఘు రామయ్య 1952 నుండి 1979 వరకు వరుసగా ఆరు సార్లు లోక్ సభ సభ్యుడిగా పని చేసారు. ఆయన తన రాజకీయ జీవితంలో నెహ్రూ మంత్రివర్గంలో రక్షణ, కార్మిక, పౌర సరఫరాలు మంత్రిగాను, లాల్ బహుదూర్ శాస్త్రి మంత్రివర్గంలో పౌర సరఫరాలు, సాంకేతిక శాఖలకు కేంద్ర మంత్రిగాను, ఇందిరా గాంధీ మంత్రివర్గంలో న్యాయ, పెట్రోలియం, పార్లమెంటరి వ్యవహారాలు, నౌకా రవాణా,పర్యాటక శాఖల మంత్రిగా పనిచేసారు.
శిష్యుడు గద్దె వెంకట రత్తయ్య ఎమ్మెల్యేగా ప్రయాణం మొదలు పెట్టి గుంటూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. తొలుత 1967లో జరిగిన ఎన్నికల్లో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1972 లో కూడా తాడికొండ నుంచే మరోసారి విజయం సాధించారు. తర్వాత గురువు కొత్త రఘురామయ్య రాజకీయ పంతం వల్ల ఆయన మంగళగిరికి మారాల్సి వచ్చింది.
రగిలి పోయిన గురువు
గద్దె వెంకట రత్తయ్య 1972 వరకు కొత్త రఘు రామయ్యకు అనుచరుడిగా గురువు అడుగు జాడల్లోనే నడిచే వారు. అయితే 1972లో మొదలైన ఆంధ్ర ఉద్యమం ఆయన లైఫ్‌ను టర్న్ చేసింది. రఘురామయ్య ఢిల్లీకి పరిమితం కావడంతో రత్తయ్య ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. దీంతో గద్దె వెంకరత్తయ్యకు మంచి పేరు వచ్చింది. లీడర్‌గా గుర్తిపు పొందారు. గురువు కొత్త రఘురామయ్యను ఢీ కొట్టే స్థాయికి ఎదిగారు.
ఇది కాస్తా గురువు చెవిన పడింది. శిష్యుడిని మెచ్చుకోవడం పక్కన పెట్టి ద్వేషం పెంచుకున్నారని నాటి నాయకులు చెప్పారు. ఇరువురి మధ్య గ్యాప్ పెరిగింది. విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఇవి తీవ్ర స్థాయికి చేరడంతో గురువు రఘురామ్య శిష్యుడు గద్దె వెంకటరత్తయ్యకు గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యారు. అప్పటి నుంచి అదను కోసం ఎదురు చూడ సాగారు.
డీ లిమిటేషన్
సరిగ్గా అదే సమయంలో నియోజక వర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ తెరపైకి వచ్చింది. దాని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో ఎస్సీలు అధికంగా ఉన్న వేమూరు, తాడికొండ, పొన్నూరు నియోజక వర్గాలను కమిటీ పరిగణలోకి తీసుకుంది. అయితే ఈ మూడింటిలో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాలని కొంత మంది నేతలు భావించారు. అయితే అప్పటి వరకు శిష్యుడు వెంకటరత్తయ్యపై పంతం నెగ్గించుకోవడం కోసం రగలి పోతున్న గురువు కొత్త రఘురామయ్య రంగంలోకి దిగారు. అప్పటి వరకు వెంకటరత్తయ్య పోటీ చేస్తూ వస్తున్న తాడికొండ నియోజక వర్గాన్ని ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గంగా మార్చాల్సిందే అని పట్టుబట్టారు. అంతేకాకుండా ఆయనకు ఢిల్లీలో ఉన్న పలుకుబడిని ఉపయోగించారు. పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. దీంతో తాడికొండను జనరల్ స్థానం నుంచి ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారి పోయింది. 1975లో ఎస్సీ నియోజకవర్గంగా ఖరారు చేశారు.
మంగళగిరికి మకాం మార్చిన శిష్యుడు
దీంతో శిష్యుడు గద్దె వెంకట రత్తయ్య తాడికొండను వదులుకోవలసి వచ్చింది. అయితే శిష్యుడు గద్దె వెంకట రత్తయ్య మాత్రం తన రాజకీయ భవిష్యత్‌ను వదులుకో లేదు. తాడికొండ నుంచి మంగళిగిరి నియోజక వర్గానికి మకాం మార్చుకున్నారు. జనతా పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించడం విశేషం.
Next Story