చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో నెల రోజులైంది. గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకే అధిక సమయం వెచ్చిస్తున్న సీఎం డయేరియా నివారణలో వైఫల్యం చెందారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు దీరి నేటితో నెల రోజులైంది. జూన్‌ 12న గన్నవరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనుల కంటే ప్రతీకార చర్యలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి రావడంతోనే ప్రతీకార చర్యలకు పదును పెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణ దశలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేతతో పాలన ప్రస్థానాన్ని ప్రారంభించారు. జగన్‌ ప్రభుత్వంలో చోటు చేసుకున్న టీడీపీ కార్యాలయాలపై దాడుల కేసులను తెరపైకి తేవడం, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపై కేసులు పెట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది.
ఇక అధికారుల బదిలీలపై దృష్టి సారించింది. ఐఏఎస్‌ల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లుతో పాటుగా జిల్లా కలెక్టర్ల వరకు నాలుగు సార్లు బదిలీలు చేపట్టింది. పది మంది వరకు అధికారులను జీఏడీకి అటాచ్‌ చేసింది. అదేవిధంగా ఐపీఎస్‌ అధికారుల ట్రాన్స్‌ఫర్లు చేపటిది. డీజీపీ ర్యాంకు నుంచి ఏడీజీ, ఐజీ, డిఐజీలతో పాటు జిల్లా ఎస్పీల వరకు బదిలీలు చేపట్టింది. ఐపీఎస్‌ల బదిలీలు కూడా నాలుగు పర్యాయాలు చేపట్టింది. ఇంకా ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.
ఈ నెల రోజుల పరిపాలనలో ఒక పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పాఠశాలలు ప్రారంభమైనా అమ్మ ఒడి ప్రస్తావనే లేదు. పెన్షన్‌ల పథకాన్ని జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ. 4వేలకు పెన్షన్‌ పెంచుతూ పంపిణీ చేశారు. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం పెనుమాకలో స్వయంగా
ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లి బానవత్‌ పాములు నాయక్‌కు పెన్షన్‌ను అందజేసి పంపిణీని ప్రారంభించారు. గత మూడు నెలల బకాయిలు రూ. 3వేలతో కొత్త పెన్షన్‌ రూ. 4వేలతో కలిపి జూలై 1న మొత్తం రూ. 7వేలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 4,399 కోట్లతో పెన్షన్లు పంపిణీ చేశారు. నూతన ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చింది. సీనరేజ్‌ చార్జి, నిర్వహణ ఖర్చులు చెల్లించి వినియోగదారులకు ఇసుకను అందించే విధంగా పాలసీని అమల్లోకి తెచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు పర్యాయాలు పర్యటనలు చేపట్టారు. పోలవరంకు తొలి పర్యటన చేయగా, భోగాపురం ఎయిర్‌ పోర్టు పనుల పరిశీలనకు రెండో పర్యటన చేశారు.మధ్యలో ఒక సారి ఢిల్లీ పర్యటన కూడా సీఎం చంద్రబాబు వెళ్లారు. ఉమ్మడి ఆస్తుల పంపకాలపై హైదరాబాద్‌లో తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు. ఈ నెల రోజుల్లో మూడు రంగాలకు సంబంధించిన శ్వేత పత్రాలను విడుదల చేశారు. పోలవరంపై తొలి శ్వేత పత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు అమరావతిపైన రెండో శ్వేత పత్రం, విద్యుత్‌ రంగంపై మూడో శ్వేపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకే ఎక్కువ సమయం వెచ్చించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నెల రోజుల్లో డయేరియా విజృంభణ పెరిగి పోయింది. దీనిని కంట్రోల్‌ చేయడంలోను, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోను ప్రభుత్వం వైఫల్యం చెందిందనే విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంపై ప్రతీకార చర్యలు తీసుకొనేందుకు వెచ్చించినంత సమయం డయేరియాను కట్టడి చేయడంలో చూప లేదన అపవాదులు ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాతో ఉమ్మడి ఉభయ గోదావరి, పల్నాడు, తిరుపతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా పెద్ద ఎత్తున ప్రబలింది. పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా, వందలాంది మంది దీని బారిన పడ్డారు. విజయవాడలోనే 10మందికిపైగా మరణించారు. తిరుపతిలో ఇద్దరు మృత్తి చెందారు. పరిస్థితిని అదుపులోకి తేవడంలో కూడా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చోటు చేసుకున్న అత్యాచారాల ఘటనలు ఆందోళన కరంగా మారాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి గ్రామంలో 8ఏళ్ల బాలికను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారు. ఇలాంటి దుర్మార్గాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంలోను వైఫల్యం చెందిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Next Story