ముఖ్యమంత్రి జగన్‌ పక్కన కందుకూరు కొత్త అభ్యర్థితో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

ఈ ఎమ్మెల్యే అధికార పక్షంలో ఉంటూనే ప్రజల పక్షాన పోరాటాలు చేశారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఉండాలని ప్రజల చేత అనిపించుకున్నారు. ఎవరా ఎమ్మెల్యే తెలుసుకుందాం.


ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్‌సీపీలో ఎమ్మెల్యేగా ఉంటూ సమస్యలపై గళమెత్తిన నాయకుడు

ధర్నాలు, ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఎమ్మెల్యే
ఎప్పుడూ ప్రజల పక్షమే..
మంత్రిగా చేసినప్పుడు విలక్షణ శైలి
చట్టాలపై సంపూర్ణమైన అవగాహన
అధికారులకు చెమటలు పట్టించిన నాయకుడు
ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరు నియోకవర్గం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డిది విలక్షణ శైలి. ఎప్పుడు ఎలా రియాక్ట్‌ అవుతారో ఎవ్వరూ ఊహించలేరు. రివ్యూ మీటింగ్‌లకు ఆయన హాజరవుతున్నారంటే కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ప్రిపేర్‌ అయి రావాల్సిందే. అలా రాకుంటే ఆ అధికారికి చెమటలు పట్టడం ఖాయం. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో మునిసిపల్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా పనిచేసి శభాష్‌ అనిపించుకున్నారు మహీధర్‌.
ఇప్పుడెందుకు ఈయన గురించి చెప్తున్నారనుకుంటున్నారా. చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీరందరూ ఈయన రాజకీయ పోరాటం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇటువంటి ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సీటు ఇవ్వడం లేదు.
మొదటి నుంచీ ప్రజాపక్షమే..
మానుగుంట మహీధర్‌రెడ్డి కుటుంబం రాజకీయ కుటుంబం ఆయన తండ్రి మానుగుంట ఆదినారాయణరెడ్డి నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి మూడు సార్లు గెలుపొందారు. ఒక సారి స్వతంత్ర అభ్యర్థిగా గెలవగా రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచారు. 1978లో మొదటి సారి పోటీ చేసిన జనతాపార్టీ అభ్యర్థిగా కందుకూరు నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి దివి కొండయ్య చౌదరి చేతిలో ఓడిపోయారు. మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా తండ్రిబాటలోనే రాజకీయాలు నడిపారు. తండ్రికి అప్పట్లో ఎంతో మంచి పేరు ఉండేది. అలాగే మహీధర్‌రెడ్డి కూడా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహీధర్‌
ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీని గెలిపించారు. అందులో మూడు సార్లు మానుగుంట మహీధర్‌రెడ్డిని ఎమ్మెల్యే కాగా ఒకసారి పోతుల రామారావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మహీధర్‌రెడ్డి మునిసిపల్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ ప్రభుత్వంలో చివరి వరకూ కొనసాగటంలో వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇవ్వలేదు. 2014లో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇచ్చింది. గెలిచిన తరువాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన పోతుల రామారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. తిరిగి 2019లో మహీధర్‌రెడ్డి కందుకూరు అసెంబ్లీకి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రజల పక్షాన పోరాట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికార పక్షంలో ఉంటూ పోరాటాలు ఏమిటనుకుంటున్నారా? అవును ఆ సందేహం ఎవరికైనా వస్తుంది. ప్రభుత్వంలో నిధుల లేమి, ఎమ్మెల్యే అడిగినా డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వాన్ని జనం నిలదీస్తుంటే వారి పక్షాన నిలబడ్డారు.
ఈ ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వటం లేదు..
మహీధర్‌రెడ్డి ఈ సారి గెలిచే అవకాశాలు లేవని సర్వేలు చెప్పినట్లు సీఎంవో నుంచి సమాచారం అందింది. అయితే మహీధర్‌రెడ్డి నిజంగా సర్వేలల్లో నెగటివ్‌ వచ్చిందా అని విచారించి రాలేదని తెలుసుకున్నారు. అయినా టిక్కెట్‌ ఇవ్వడం లేదంటే ఏదో మతలబు ఉందని గమనించిన మహీధర్‌రెడ్డి నేనైతే టిక్కెట్‌ ఇవ్వాలని సీఎంను అడగను. టిక్కెట్‌ ఇస్తే తీసుకుని పోటీ చేస్తానని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి స్పష్టం చేశారు. అయితే కొంత డబ్బును డిపాజిట్‌ చేయాల్సిందిగా వైఎస్సార్‌సీపీ కోరిందని, అందుకు మహీధర్‌ అంగీకరించలేదని సమాచారం.
రామాయపట్నం పోర్టు నిర్మాణం వల్ల నిర్వాసితులైన పేదలకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నందున వారితో పాటు ఇటీవల రెండు రోజులు ధర్నాలో పాల్గొన్నారు. నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.
తనను నమ్ముకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యతను తీసుకున్నారు. వారికి పనులు చేసి పెట్టాడు.
నిర్మొహమాట వాది లోకవిరోది అంటారు పెద్దలు. అలా మహిధర్‌రెడ్డి పార్టీలోనే కొందరికి విరోధిగా మారాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్ల వారు విరోదులుగా మారినట్లు సమాచారం.
2019లో ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకు రాళ్లపాడు ప్రాజెక్టు మరమ్మతులు, ఇతర అవసరాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ నియోజకవర్గ ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు.
గ్రామీణ తాగునీటి పథకాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని బహిరంగంగానే పత్రికల వారితో మాట్లాడి వారి ఆందోళనకు మద్దతు ఇచ్చారు.
చట్టాలపై పూర్తి అవగాహన
మహీధర్‌రెడ్డి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. చట్టాల గురించి బాగా అవగాహన ఉంది. దీంతో అధికారులను నిలదీయడం వారి ద్వారా ప్రజలకు కావాల్సిన పనులు చేయించడంతో పాటు అవినీతికి చెక్‌ పెట్టే అంశాలపై ఎక్కువగా మాట్లాడేవారు.
ఒకసారి జిల్లా పరిషత్‌ సమావేశంలో అధికారులను నీళ్లు నమిలించారు. అధిష్టానం చెప్పేదొకటి కావడంతో మహీధర్‌రెడ్డికి సమాధానం చెప్పలేక అప్పటి కలెక్టర్‌తో పాటు జిల్లా పరిషత్‌ సీఈవో కూడా నీళ్లు నమలాల్సి వచ్చింది. పైగా ఈ ప్రభుత్వంలో మొదట ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నారు. అందువల్ల ఆయన మాటకు అధికారులు వ్యాల్యూ ఇచ్చారు తప్ప ఇంకెవరి మాటలకు వ్యాల్యూ ఇవ్వలేదు. దీనిని మహీధర్‌రెడ్డి అసలు అంగీకరించలేదు. నియోజకవర్గానికి కావాల్సిన పనుల విషయంలో రాజీలేని పోరాటం చేవౠరు.
వచ్చే ఎన్నికల్లో కందుకూరు వైసీపీ అభ్యర్థి ఎవరు?
కందుకూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొత్త అభ్యర్థిని చూశారు. ముఖ్యమంత్రే ఆ అభ్యర్థిని కందుకూరు ఎమ్మెల్యేకు పరిచయం చేశారు. మీకు ఈ సారి టిక్కెట్‌ ఇవ్వడం లేదు. వీరికి టిక్కెట్‌ ఇస్తున్నాను. రండి అంటూ వారిని పక్కన నిలబెట్టి మహీధర్‌రెడ్డిని మరో పక్క నిలబెట్టి సీఎం ఫొటో తీయించారు. దీంతో మహీధర్‌రెడ్డికి నషాళానికి అంటుకుంది. అయితే సీఎం వద్ద ఏమీ మాట్లాడలేక పక్కన నిలబడి ఫొటో తీయించుకుని వచ్చారు. ఈ సంఘటన అసెంబ్లీలోని సీఎం ఆఫీస్‌లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగింది.
నెల్లూరు జిల్లా ఇడవలూరు మండలంలోని చౌకిచెర్ల గ్రామానికి చెందిన వంకి పెంచలయ్య కుటుంబం ఈ సారి కందుకూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగనుంది. పెంచలయ్య గూడూరులో ఆదిశంకర ఇంజనీరింగ్‌ కాలేజీ నెలకొల్పి గొప్ప విద్యావేత్తగా ఎదిగారు. ఆర్థికంగా కూడా సంపన్నుడు కావడంతో ఎలాగైనీ సీటు సంపాదించాలనే పట్టుదలతో ముందుకు సాగాడు. పెంచలయ్య కుమార్తె వంకి అరవిందను ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్‌ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈమేరకు పార్టీ ఆదేశాల మేరకు కొంత డబ్బును కూడా డిపాజిట్‌ చేసినట్ల తెలిసింది. కొందరు అభ్యర్థులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డబ్బులు డిపాజిట్లు చేస్తున్నారు. ఇదంతా అనధికారిక వ్యవహారం కావడం విశేషం.
Next Story