అక్కో.. ఇదే నా చివరెన్నిక! ఆదాల సెంటిమెంట్ అస్త్రం
x
ఆదాల ప్రభాకర్ రెడ్డి

అక్కో.. ఇదే నా చివరెన్నిక! ఆదాల సెంటిమెంట్ అస్త్రం

సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ రానున్నది. ఈ నేపథ్యంలో నెల్లూరులోని రెండు పార్టీల అభ్యర్థులు సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.


ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్- తిరుపతి




రాజకీయాలు, సినిమా రంగంలో కూడా చెరగని ముద్ర వేసుకున్న ప్రాంతాల్లో నెల్లూరు కూడా ఒకటి. ఇక్కడ రాజకీయ పార్టీల నాయకులు మాటల్లో విరుపులు, మెరుపులు, చలోక్తులు, లౌక్యం, చతురత ప్రదర్శించడంలో ఎవరికి ఎవరు తీసిపోరు. చివరకు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు... "ఇదే నాకు చివరి ఎన్నిక అని ఒకరు, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఇంకో అభ్యర్థి, కార్యకర్తలకు ఏదైనా జరిగితే అడ్డుగా నేనుంటా" అని ధీమా కల్పించే రీతిలో వైఎస్ఆర్ సిపి, టిడిపి నాయకులు సాగిస్తున్న ప్రచారం ఆసక్తి రేపిస్తోంది. ఆ కోవలో ఎవరేమంటున్నారు మీరే చూడండి.

నాకు ఇదే నా చివరి ఎన్నిక..
" అక్కో.. ఇంక మళ్ళా పోటీ చేయను. ఇదే నాకు చివరి ఎన్నిక" అని వైఎస్ఆర్సిపి నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఓటర్లపై సెంటిమెంట్ అస్త్రంతో ప్రచారంలోకి దిగారు. నన్ను గెలిపిస్తే, మళ్లీ పార్టీ అధికారంలోకి రాగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 1000 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ఆయన ప్రకటించారు. వైయస్ఆర్సీపీ పై తిరుగుబాటు చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు.

చమక్కు:
"బ్రిడ్జిల నిర్మాణం అభివృద్ధి పనుల పనులకు సంబంధించి జీవోలైతే ఇచ్చారు. నిధులు ఇవ్వడం లేదనే అంశంపైనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ పై తిరుగుబాటు చేశారు. తన పార్లమెంటు స్థానం పరిధిలోనే ఉండే రూరల్ నియోజకవర్గంలో ఏమి చేశారనేది ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పలేకపోతున్నారు అనే మాటమాట కూడా వినిపిస్తోంది. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే.. వైఎస్ఆర్సిపి సెట్టింగ్ ఎమ్మెల్యే మాటలు అహంకారపూరితంగా ఉన్నాయని విషయం చెప్పగానే చెబుతోంది. సినిమా డైలాగులు స్మరణకు తెచ్చేలా.. ఆయన ఏమంటున్నారంటే..




బలమైన అభ్యర్థి కోసం చూస్తున్న..
" షేర్ ఖాన్ ఒక్కొక్కరిని కాదు. వందమందిని ఒకేసారి పంపించు. లెక్క తక్కువ కాకుండా చూసుకో..! అని వైఎస్ఆర్ సీపీ ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సినిమా డైలాగును తలపిస్తున్నారు. " నాకు ప్రత్యర్థిగా ఎవరైన బలమైన అభ్యర్థిగా రావాలని చూస్తున్నా.. సంవత్సరం రోజుల నుంచి చెబుతున్నారే.. కానీ ఎవరూ అభ్యర్థిగా కనిపించడం లేదు" అని మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రతిపక్ష టిడిపిని ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. " ఎవరు వచ్చినా భయపడేది లేదని సవాల్ విసిరినట్లు మాట్లాడారు. అంతేకాదు... వైఎస్ఆర్సిపి పై తిరుగుబాటు చేసి, టిడిపి నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాటతీరు, స్టైలే వేరుగా ఉంటుంది. ఆయన స్పందించిన తీరు ఎలా ఉందంటే..

నేను అడ్డంగా ఉంటా...

భగవంతుడికి .. భక్తునికి... అనుసంధానమైనది అగర్బత్తి. అనే డైలాగును అనుసరించారు నెల్లూరు టిడిపి అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసిన తన మద్దతుదారు 23వ డివిజన్ కార్పొరేటర్ భర్త హజరత్ నాయుడు ఇంటికి పోలీసులు రావడంతో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. పోలీసుల మధ్య నిలబడి ప్రశ్నించారు. "నేను కూడా అదే పోస్ట్ షేర్ చేస్తా. నా పైన కేసు పెట్టుకోండి" అని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
ముక్తాయింపు: 2014లో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ సీపీ నుంచి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మోకాటి లోతు మురుగునీటిలో గంటల తరబడి నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అప్పటి సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు స్పందించి పనులు మంజూరు చేశారు. అధికారపక్షంలో ఉండి కూడా తాను పనులు చేయించుకోలేకపోయానని గట్టిగా గళం విప్పారు. ఇదే ఆయనను ఆ పార్టీ నుంచి తిరుగుబాటుకు గురిచేసింది. అన్నా.. అక్క.. తమ్ముడు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అని గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పండించిన సెంటిమెంటును.. నెల్లూరు జిల్లా ఉదయగిరి టిడిపి అభ్యర్థి వల్లే వేస్తున్నట్లు కనిపిస్తోంది..

ప్లీజ్.. ! ఒక్క ఛాన్స్

"నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్..! నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తా" అని ఉదయగిరి టిడిపి అభ్యర్థి కాకర్ల సురేష్ వైఎస్ఆర్సిపి నినాదాన్ని అందుకున్నారు. సామాజిక సేవ కార్యక్రమాలతో గత రెండేళ్లుగా ప్రజలతో మమేకమైన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ అనూహ్యంగా ఇక్కడి నుంచి టికెట్ దక్కించుకున్నారు. తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని జనంతో మమేకమవుతున్నారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడిన వైఎస్ఆర్ సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, బొల్లినే రామారావు టిడిపి విజయానికి ఎలా సహకరిస్తారు అనేది వేచి చూడాలి.
ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు జనంలోకి వెళ్తున్నారు. రెండు పార్టీలు కూడా ఇన్చార్జిగా ప్రకటించడం మినహా జాబితాలో కొందరి పేర్లు ప్రకటించలేదు. ఆ పార్టీలు వారికి బి. ఫాం ఇచ్చేవరకు స్పష్టత రాదు. అందుకోసం కాలం చెప్పే సమాధానం కోసం వారు నిరీక్షించక తప్పదు.


Read More
Next Story