దశాబ్దాల కాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబాలను ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారు. ఆ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి.. వారెవరు?


ఈ సార్వత్రిక ఎన్నిల్లో పోటీ చేసిన కొన్ని కుటుంబాలకు గట్టి దెబ్బ తగిలింది. ఈ తిరుగులేని దెబ్బ నుంచి వీరు కోలుకోవడం కూడా భవిష్యత్‌ రాజకీయాల్లో కష్టంగానే ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల భావన. రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన కుటుంబాలు ఒక్కసారిగా ఎన్నికల్లో ఓటర్లు బొక్కబోర్లా పడేలా చేశారు. బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తి తనను అసెంబ్లీకి కూడా పోకుండా చేశారు. నేను అంత పెద్ద తప్పులు చేశానా.. అంటూ ఎన్నికల తరువాత కన్నీరు పెట్టుకున్న సందర్భం ఉంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పోటీ చేసిన అన్నాతమ్ముళ్లు, తండ్రీ కొడుకులు ఎవరికి వారు రాజకీయాల్లో దిక్కులేని వారుగా మిగిలిపోయారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌లు ఈ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఇరువురూ మంత్రులుగా పనిచేశారు. ధర్మాన ప్రసాదరావుకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. ఇవేవీ ఈ సారి ఎన్నికల్లో పనికి రాలేదు. ఒక్కసారిగా తుఫాన్‌ గాలులకు ఇళ్లు కూలినట్లు వీరి రాజకీయ జీవితాలు కూడా కూలిపోయాయి. అది ఆ పార్టీ నాయకుడి లోపమా? వీరి పాపమా? చెప్పలేము కానీ రాజకీయాల్లో పది అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి వీరికి వచ్చింది.
విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ కుటుంబం కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటూ వచ్చింది. బొత్స పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రానికి చేసిన వ్యక్తి. వైఎస్సార్‌ ఉన్నప్పుడు, చనిపోయిన తరువాత కూడా బొత్స సత్యనారాయణ ముఖ్య మంత్రి స్థానాన్ని సంపాదించేందుకు ప్రయత్నించిన వారిలో ఒకరు. ఆయన భార్య బొత్స ఝాన్సి గతంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. విశాఖపట్నం నుంచి ఎంపీగా 2024 ఎన్నికల్లో పోటీ చేసిన ఝాన్సీ ఓటమి చెందారు. బొత్స సత్యనారాయణ తమ్ముడు బొత్స అప్పలనర్సయ్య గజపతి నగరం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అంటే బొత్స కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేసి ఓడిపోయారు.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉంటున్న వై సాయిప్రసాద్‌రెడ్డి, వై బాలనాగిరెడ్డి, వై వెంకట్రామిరెడ్డి, వై శివరామిరెడ్డిలు సోదరులు. వీరు గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరుపున గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో ముగ్గురు ఓడిపోగా బాలనాగిరెడ్డి మాత్రం మంత్రాలయం నుంచి గెలిచారు. ఆదోని, గుంతకల్లు, కదిరి నుంచి పోటీకి దిగిన ముగ్గురిని ఓటర్లు ఓడించారు. వీరికి కూడా ఓటమి ఎరుగని నాయకులుగా గుర్తింపు ఉంది. బాలనాగిరెడ్డి తన కుమారుడిని ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.
కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల నుంచి పోటీ చేసిన శిల్పా రవికళాధర్‌రెడ్డిలు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు వీరిద్దరూ వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరికి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
వారసత్వ రాజకీయాలకు చెక్‌
ఈ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలను కూడా ఓటర్లు తిరస్కరించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తన కుమారుడు భూమన అభినయ్‌రెడ్డిని తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. 2019లోనూ, గతంలోనూ తిరుపతి నుంచి భూమన కరుణాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. తన వారసునిగా రాజకీయాల్లోకి అభినయ్‌ను తీసుకొచ్చారు. అయినా ఓటమి తప్పలేదు. అదే విధంగా మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)ని తన వారసునిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అయితే ఓటర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పోటీ చేసిన కృష్ణమూర్తి ఘోరంగా ఓడిపోయారు. తండ్రి రాజకీయ అనుభవం కూడా కిట్టూకు కలిసి రాలేదంటే వీరు రాజకీయంగా ఎంత దీన స్థితికి చేరారో అర్థం చేసుకోవచ్చు.
Next Story