ఏపీలో భారీ స్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. కొందరిని జీఏడీకి అటాచ్‌ చేశారు. 20 శాఖల్లో ట్రాన్స్‌ఫర్‌లు జరగ్గా.. ముగ్గురికి మూడు శాఖలను అదనపు చార్జీగా ఇచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. భారీ ఎత్తున ఐఏఎస్‌ అధికారుల బదిలీలు ఉంటాయని భావించినట్లుగానే అధికారుల బదిలీలు జరగడం విశేషం. అయిన వారికి ఆకుల్లోను.. కాని వారికి కంచాల్లో అన్నట్లుగా ప్రభుత్వం ఐఏఎస్‌లను బదిలీలు చేసిందనే టాక్‌ అధికార వర్గాల్లో జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మిగిలిన కొందరు మంత్రులు ఎవరినైతే తిరిస్కరిస్తూ వస్తున్నారో ఆ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు దక్క లేదు. వారిని జీఏడీకి అటాచ్‌ చేస్తున్నట్లు బదిలీల ఉత్తర్వులో పేర్కొన్నారు.

వేటు పడింది ఎవరిమీదంటే ?
పురపాలక శాఖ ప్రత్యేక పధాన కార్యదర్శిగా పని చేస్తున్న వై శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్‌ భార్గవ, పాఠశాల,విద్యా శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్, ఏపీఎండీసీ ఎండీ, వీసీగా ఉన్న మురళీధర్‌రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. వీరందరికీ పోస్టింగ్‌లు దక్కే అవకాశం లేదని టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే అధికారులందరికీ అర్థమైంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నమ్మిన బంట్లుగా పని చేసినందు వల్ల వీరిని పక్కన పెట్టడం మంచిదనే ఆలోచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో జీఏడీకి అటాచ్‌ చేసిన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండాఎంత కాలం వెయిటింగ్‌లో పెడుతారనే ప్రచారం కూడా అధికార వర్గాల్లో చర్చగా మారింది.
ఈ ఐఏఎస్‌లకు కేటాయించిన శాఖలివే
జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌కుమార్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బి రాజశేఖర్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాల్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సిద్ధార్థ జైన్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌ నియమితులయ్యారు. ఈయనకు నైపుణ్యాభివృద్ధి శాక ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. పాఠశాల విద్యా శాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌ను నియమించగా, ఐటీ, ఆర్టీజిఎస్‌ శాఖల కార్యదర్శిగా ఆయనకు పూర్తి స్థాయి అధనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యాన, మత్స్య శాఖ, సహకార విభాగాల కార్యదర్శిగా ఏ బాబును నియమించారు. ఏపీసీఆర్‌డిఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్, ముఖ్య కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించారు. ఆర్థిక, వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం జానకి, పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్, గనుల శాఖ కమిషన్‌గా ప్రవీణ్‌కుమార్‌ను నియమించారు. ఈయనకే ఏపీఎండీ ఎండీగా అధనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా వాడ్రరేవు వినయ్‌ చంద్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story