ఆ మూడు పార్టీలు ఒకటే, ఎవరు గెలిచినా బీజేపీదే హవా!
x

'ఆ మూడు పార్టీలు ఒకటే, ఎవరు గెలిచినా బీజేపీదే హవా!'

టీడీపీ + జనసేన + వైసీపీ = బీజేపీ


భారతదేశ ఉపాధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు రాజకీయ పార్టీలు బీజేపీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేశాయి. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలిచారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శనరెడ్డి ఓడారు.

రాష్ట్రంలో పొద్దున లేచింది మొదలు నిద్రపోయేంత వరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కేంద్రంలోని బీజేపీకి మద్దతివ్వడం ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న చర్చ. ఈ విచిత్ర పోకడపై నెటిజన్లు తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు.
ఈడీ కేసులు ప్రయోగిస్తూ బీజేపీ ట్రిక్ ప్లే చేస్తుంది. ఇక్కడున్న బొమ్మలు నర్తిస్తుంటాయని ఓకరు, ఓటు వేసే ధైర్యం లేని వారికి మనం ధైర్యం చేసి ఓట్లేసి లెక్కకు మిక్కిలి సీట్లు ఇవ్వడమే తప్పని మరొకరు
తెలుగువాళ్లయుండి తెలుగోడికే ఓట్లేయరా అని ఇంకొంకరు
కేసులకు భయపడ్డారా లేక కాసులకు భయపడ్డారా అంటూ మరికొందరు.. ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి.
కేసులకు భయపడి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ నేత నేత జగన్‌ ప్రధాని మోదీకి దాసోహమయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. తనను తాను రక్షించుకునేందుకు దత్తపుత్రుడి అవతారమెత్తి తెలుగు జాతికి తీరని ద్రోహం చేశారన్నారు. ఐదేళ్లలో దోచుకున్నది దాచుకోవడానికే జగన్‌ కేంద్రానికి బానిసయ్యారని మంగళవారం షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కూటమి పార్టీలకు తోడుగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకు ఓటేసినందుకు వైసీపీ సిగ్గుండాలి. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షానికి మద్దతు ఇవ్వడం ఓ వింత. రాష్ట్రంలో ప్రతిపక్షం, ప్రజల పక్షం అని చెప్పడానికి ఇక వైసీపీకి అర్హత లేదు. ప్రతిపక్షం ముసుగులో జగన్‌ కూడా బీజేపీ పక్షమే’ అని విమర్శించారు.
‘తెలుగు ప్రజల ఆత్మగౌరవం కంటే ప్రధాని మోదీతో స్వప్రయోజనమే తెలుగు పార్టీలకు ముఖ్యమా? పోటీలు పడి మోదీ దగ్గర మోకరిల్లాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది? రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం కనిపించలేదా? 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి గొంతు కోసిన విధానం గుర్తుకు రాలేదా? రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్, జగన్‌ సమాధానం చెప్పాలి’ అని షర్మిల డిమాండు చేశారు.
అసలు ఈ పార్టీలకు నైతికత ఉందా అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ. కేసులకు భయపడి ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీకి దాసోహం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి ప్రజాస్వామిక వ్యక్తి, రాజ్యాంగ పరిరక్షకుడు పోటీ చేస్తే ముందుండి ఓటేయాల్సిన వాళ్లు మోదీ ముందు మోకరిల్లుతారా అని విమర్శించారు.
ఇదే స్థాయిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కూడా విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఇదో వింత పరిస్థితి కొనసాగుతోందన్నారు. తాము చేస్తున్నది సైద్ధాంతిక, నైతిక పోరాటమని, గెలుపోటములు పక్కన బెడితే అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ బీజేపీకి ఓటేయడమేమిటని విస్మయం వ్యక్తం చేశారు.

ఉప రాష్త్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్‌ తమిళనాడుకు చెందిన వారు. ఆయనపై తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తరఫున పోటీ చేశారు. 152 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
సుదర్శన్ రెడ్డి ఓటమిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చిటపటలు రేగుతున్నాయి.
Read More
Next Story