దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులోనే వల్లభనేని వంశీ జైలుకెళ్లాడని మంత్రి లోకేష్ అన్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు మీద మంత్రి నారా లోకేష్ స్పందించారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసి, బలవంతంగా అతని చేత కేసు వెనక్కు తీసుకునే విధంగా చేశారని, ఆ కేసులోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రోజు జైలు కెళ్లాడని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో సారి రెడ్‌బుక్ గురించి ప్రస్తావించారు. ఖచ్చితంగా రెడ్ బుక్‌ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా పాలన జరిగిందో ప్రజలందరికీ తెలుసు. నాడు ప్రజల తరపున పోరాడిన ప్రతిపక్ష నేతను, టీడీపీ ప్రజాప్రతినిధులను, ఇతర పార్టీలకు చెందిన నాయకులను అడుగడుగున ఇబ్బందులు పెట్టారు. మమ్మలను రోడ్లపైకి రానీకుండా గత ప్రభుత్వం అడ్డుకుంది. ప్రతిపక్ష నేతను ఇంటి నుంచి బయటకు రానీకుండా అడ్డుకున్నారు. ప్రెస్ మీట్‌లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మాపై కేసులు పెట్టారు. ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడికి పాల్పడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంపైన, గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపైన దాడి చేశారు.
ఇలా మమ్మల్ని జైలుకు తీసుకెళ్లడం, మాపై దాడి చేయడం చేశారు. ఆ నాడు యువగళం పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 90 బహిరంగ సభల్లో ప్రజలందరికీ చెప్పాం. ఎర్రబుక్ చూపించి పబ్లిక్‌గానే చెప్పాం. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులను వదిలి పెట్టమని చెప్పాం. చట్టం ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బందులు పెట్టిన వారిని వదిలి పెట్టమని చెప్పాం. వారందరిపైన చర్యలు తీసుకుంటామని నాడే చెప్పాం. ఆ మేరకు నాడు హామీ కూడా ఇచ్చాం. దీనిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల కావాలని ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా కేసు విత్‌డ్రా చేయించాడని, ఆ కిడ్నాప్ కేసు వల్లనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రోజు జైలుకెళ్లాడు. వాస్తవాలన్నీ త్వరలో బయటకు వస్తాయి. దానిలో ఎలాంటి సందేహం లేదు. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
Next Story