డ్రోన్ టెక్నాలజీ పెరుగుతోంది. ఈ టెక్నాలజీపై ఈనెల 22, 23ల్లో విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డ్రోన్ షో కూడా నిర్వహిస్తున్నారు.


అన్ని రంగాల్లో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగంలోకి వస్తోంది. పది మంది చేసే పనిని సునాయాసంగా డ్రోన్స్ చేయగలుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో కూలీల కొరతను తీర్చ గలుగుతోంది. కొన్ని చోట్ల కొందరు యువకులు వ్యవసాయ రంగంలో డ్రోన్స్ ఉపయోగించి మంచి దిగుబడులు సాధించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దీనిపై పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. పంట చేలల్లో డ్రోన్ల వినియోగం భవిష్యత్తులో ఉపాధి అవకాశాల్ని పెంచనుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ డ్రోన్లతో ఉపయోగాలు ఏమిటి? ఎన్ని రకాలుగా వీటిని వినియోగించవచ్చు? ఏ తరహా పంటలకు ఇవి అనుకూలం? డ్రోన్ల విస్తృతికి ఉన్న అడ్డంకులేంటి? ప్రభుత్వాలు ఏంచేస్తే బాగుంటుందో తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం తీరు మారుతోంది. కొన్నేళ్ల నుంచి యంత్రాల వాడకం బాగా పెరిగింది. వాటితో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం తప్పనిసరిగా మారింది. కూలీల కొరత రైతులకు ప్రధాన సమస్యగా మారింది. దీనిని అధిగమించేందుకు ఉన్న అవకాశాలపై అందరూ దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో దూసుకు వచ్చిందే డ్రోన్ల వినియోగం. మొదట్లో రక్షణ రంగంలో ఉన్న డ్రోన్ల వినియోగం ఆ తర్వాత ఇతర రంగాలకు విస్తరించింది. వ్యవసాయంలో డ్రోన్‌ల వాడకం జపాన్, చైనా, ముందుండగా ఇటీవల కాలంలో ఇతర దేశాల్లోనూ ఈ సాంకేతిక మాంత్రిక యంత్రాలను విరివిగా వాడడం మొదలు పెట్టారు. భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ టెక్నాలజీని బాగా ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 22,23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తోంది. 22న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి సమీపంలో ఉన్న కన్వెన్షన్ హాలులో ఒక రోజు శిక్షణ, డ్రోన్స్ కు సంబంధించి పూర్తి సమాచారం నిర్వాహకులు వచ్చిన వారికి ఇస్తారు.

భారత్‌లోనూ డ్రోన్ల వాడకంపై ప్రయోగాలు జరిగాయి. ప్రధానంగా పంటలకు పురుగు మందుల పిచికారి, ఎరువులు, విత్తనాలు వెదజల్లేందుకు వీటిని వినియోగిస్తున్నారు. పురుగు మందుల పిచికారీలో డ్రోన్ల వినియోగం మంచి ఫలితాలను ఇస్తోంది. వరి సాగు చేసే రైతులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బురదలో దిగి సాధారణ స్ప్రేయర్లతో మందుల పిచికారీ పెద్ద ప్రయాసే. చాలామంది తేళ్లు, పాము కాట్ల బారిన పడుతున్నారు. అలాగే ఎత్తులో పెరిగే పంటలకు సంబంధించి పిచికారి కష్టమైన పని. మొక్కజొన్నతో పాటు పండ్ల తోటల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటికి డ్రోన్లు పరిష్కారం చూపిస్తున్నాయి. డ్రోన్ సాయంతో పైనుంచి పిచికారీ చేయటం సులువుగా ఉంటోంది.

దేశంలో డ్రోన్ టెక్నాలజీ కంపెనీ అయిన ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్, రైతుల కో ఆపరేటివ్ సొసైటీ ‘ఇప్కో’ లు సాగు ఉత్పాదకత పెంపులో భాగస్వామ్యం అయ్యాయి. 11 రాష్ట్రాల్లో వీరు ఇప్పటి వరకు 500 డ్రోన్స్ రైతులకు అందజేసారు. అగ్రీబోట్ డ్రోన్ అనేది ఆరు ఎకరాలకు గంటలో పురుగు మందును స్ర్పే చేయగలుగుతుంది. రెండో బ్యాటరీ ఉంటే రోజుకు 25 ఎకరాల వరకు స్ర్పే చేస్తుంది.

డ్రోన్ల వాడకంతో సమయం బాగా కలిసొచ్చింది. ఎకరా పొలానికి 5నుంచి 6 నిమిషాల్లో స్ప్రేయింగ్ పూర్తవుతుంది. మామూలు స్ప్రేయర్లతో గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. పంటకు తెగులు వచ్చినప్పుడు ప్రాథమిక దశలోనే పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కూలీలు దొరక్క పిచికారీ అలశ్యమైతే పంట పాడైపోయేది. డ్రోన్లు వచ్చాక ఆ ఇబ్బంది తప్పింది. పురుగు మందులూ ఆదా చేయవచ్చు. గతంలో కంటే 30 నుంచి 40% మేర తగ్గించి స్ప్రే చేసినా మంచి ఫలితాలు వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. పురుగు మందులు పిచికారీతో రైతులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు కూడా తప్పిపోయాయి. విపత్తులు, అత్యవసర సమయాల్లోనూ వీటిని ఉపయోగించుకోవచ్చు. యుద్ధాల్లోనూ ఉపయోగిస్తారు.

గుంటూరు జిల్లా పెద్దకాకానికి చెందిన రైతు గూడూరు హనుమయ్య మాట్లాడుతూ ‘మాగాణుల్లో, నల్లరేగడి నేలల్లో పురుగుల మందులు చల్లాలంటే దిగబడేవి. ఒక్కోసారి రైతుల ప్రాణాల మీదకు కూడా వచ్చేది. జొన్న, మొక్కజొన్న పైరు పెరిగిన తర్వాత మందులు చల్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేంది. డ్రోన్ ద్వారా ఈ పనులు చాలా సులువుగా అయిపోతున్నాయి.’ అన్నారు.

‘జామ తోటకు పురుగు మందులు పిచికారి చేసినపుడు కొమ్మల పై వరకు తోటకు పూర్తిగా చేయలేకపోయాం. డ్రోన్లతో కొమ్మ చివరి పూత వరకూ పురుగుల మందు పిచికారి చేయగలుగుతున్నాం.’ అని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దోదాటి వెంకట భాస్కర్ రావు తెలిపారు.

డ్రోన్లు వినియోగంలోకి తెచ్చేందుకు కొందరు ఔత్సాహికులు కొన్ని సంస్థలు ఏర్పాటు చేశారు. వీరిలో ఎక్కువగా ఇంజినీరింగ్​ చదివిన యువత ఉన్నారు. సాఫ్ట్​వేర్ రంగంలో ఉన్న ఒడిదుడుకులను చూసి ప్రత్యామ్నాయాలు ఆలోచించేవారు డ్రోన్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. మొదట్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. మరికొందరు విడిభాగాలు తెచ్చి ఇక్కడ డ్రోన్ల తయారీ మొదలు పెట్టారు. స్థానిక అవసరాలు గుర్తించి అందుకు తగ్గట్లుగా మార్పులు చేశారు. అలాగే కొన్ని పరికరాల్ని స్థానికంగా సమకూర్చుకున్నారు. బ్యాటరీలతో పాటు ఇంజిన్​తో పనిచేసే డ్రోన్లను అందుబాటులోకి తెచ్చారు. వాటిని రైతుల పొలాల్లో పురుగు మందులు చల్లటానికి వినియోగిస్తున్నారు. దీనికిగాను ఎకరాకు కొద్ది మొత్తం వసూలు చేస్తున్నారు.

ఏర్పాటైన కొత్త సంస్థలు యువతకు ఇదో ఆదాయ వనరుగా మారింది. కొందరు ఎక్కువ డ్రోన్లు కొని భారీ స్థాయిలో వినియోగిస్తున్నారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ చదివిన వారికి డ్రోన్ పైలెట్లు, హెల్పర్లుగా శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త ఉపాధి అవకాశాలు వచ్చినట్లయింది. పెద్ద రైతులు సొంతగా డ్రోన్లు కొనుగోలు చేసి పొలాల్లో వినియోగిస్తున్నారు. ఏపీలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రోన్ల వాడకం ఎక్కువగా ఉంది. రాయలసీమ ప్రాంతంలోనూ ఇప్పుడిప్పుడే ఆ ఒరవడి మొదలైంది. కర్నూలు, కడప జిల్లాల్లో కొందరు డ్రోన్లు అద్దెకు ఇవ్వటం ద్వారా ఆదాయం పొందుతున్నారు.

‘నిరుద్యోగిగా చాలా బాధపడ్డాను. కాస్త పెట్టుబడి పెట్టి స్వతంగా డ్రోన్లను అద్దెకు ఇచ్చేందుకు ముందుకు వచ్చాను. నేను ఉపాధి పొందటమే కాకుండా మరో ఇద్దరికి ఉపాధి కల్పించాను. ఇప్పుడిప్పుడే వ్యవసాయంలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇది మంచి పరిణామం.’ అని కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన పుష్పాకర్ రెడ్డి చెప్పారు. ఈయన డ్రోన్లు అద్దెలకు ఇస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్-2024 కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేశారు. పున్నమి ఘాట్ వ‌ద్ద 23వ తేదీ సాయంత్రం 5 వేల‌కు పైగా డ్రోన్ల‌తో మెగా షో నిర్వ‌హిస్తున్నారు. ఈ డ్రోన్ షోని ప్ర‌జ‌లంద‌రూ విస్తృతంగా తిల‌కించ‌డానికి వీలుగా విజ‌య‌వాడ న‌గ‌రంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. న‌గ‌రంలో ఐదు ప్రాంతాల్లో భారీ డిజిట‌ల్ తెర‌లు ఏర్పాటు చేసి ప్ర‌జ‌లు ఈ షోని తిల‌కించి ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశామ‌ని డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె దినేష్ కుమార్ చెప్పారు. న‌గ‌రంలో బెంజిసర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు రింగు, వార‌ధి, బ‌స్టాండు, ప్ర‌కాశం బ్యారేజీల వ‌ద్ద ఈ డిజిట‌ల్ తెర‌లు ఏర్పాటు చేసి ఈ డ్రోన్ షోని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లంద‌రూ ఈ షోని తిల‌కించాల‌ని, పున్న‌మీ ఘాట్‌లో కూడా ప్ర‌జ‌లు ఈ షోని ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చని తెలిపారు. మొత్తం 5వేల డ్రోన్స్ ను ఉపయోగిస్తున్నారు.

పది మంది డిప్యూటీ కలెక్టర్లు, 300 మందిపైన ప్రభుత్వ ఉద్యోగులు అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహణలో పాల్గొంటున్నారు. స‌మ్మిట్ ను ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్రారంభిస్తారు. ఈ స‌ద‌స్సుకు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె రామ్మోహ‌న్ నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌, పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న‌రెడ్డిలు కూడా పాల్గొంటారు.


Next Story