రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు నామినేషన్ లు దాఖలు చేశారు. ముగ్గరే నామినేషన్ లు వేయడం వల్ల వీరు గెలిచినట్లే.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ సభ్యుల స్థానాల భర్తీకి సంబంధించి టీడీపీ అభ్యర్ధులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బీజేపీ తరుపువ ఆర్ కృష్ణయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి వద్ద రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా వారు నామినేషన్లను దాఖలు చేశారు. మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్ధులే నామినేషన్లు దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ గడువు అనంతరం వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

రాజ్యసభ నామినేషన్ ల విషయంలో చాలా ట్విస్ట్ లు నెలకొన్నాయి. జనసేన పార్టీకి రాజ్యసభ ఇవ్వాలని పట్టు బట్టినా ఇవ్వకుండా సానా సతీష్ బాబుకు చంద్రబాబు రాజ్యసభ ఇచ్చారు. పార్టీకి ఆర్థికంగా ఉపయోగపడినందునే ఆయనకు ఈ స్థానం దక్కిందని పలువురు పార్టీ పెద్దలు చెబుతున్నారు. అయితే జనసేనను కూడా నిరాశ పరచకుండా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో రాజ్యసభ అభ్యర్థులు ఎన్నిక లాంఛనమైంది.

నామినేషన్ ల ముందు రోజు రాత్రి ముఖ్యమంత్రి టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. అంతకు ముందుగానే బీజేపి తన అభ్యర్థిని ప్రకటించింది. చివరి రోజు వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కూటమిగా పార్టీలు ఉండటమే కారణం. ఈ నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్ధులు తరపున ఆయా పార్టీల ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంధ్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కె అచ్చన్నాయుడు, పి నారాయణ, పలువురు ఎంఎల్ఏలు పాల్గొన్నారు.

Next Story