చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ను ప్రశంశించలేదు. వైఎస్‌ జగన్‌ను దూషించలేదు.టిడిపి, జనసేన ప్రస్తావన లేదు. జగన్‌ మంత్రులు మాత్రం అవినీతి పరులన్నారు. మోదీ ప్రసంగం తీరు.


ఏపీలో చిలకలూరి పేట వద్ద జరిగిన ప్రధానమంత్రి సభలో ఘాటైన విమర్శలు లేవు. పార్టీల పేర్లు ప్రస్తావించలేదు. ఎన్‌డిఏకు ఓటేయండి అని మాత్రమే ఓటర్లను అడిగారు. నిస్తేజంగా సభ జర గటం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదు, అవినీతి ప్రభుత్వం అందుకే మీరు రెండు సంకల్పాలతో వచ్చి ఉంటారు. అవినీతికి పాల్పడుతూ అభివృద్ధి చేయలేని జగన్‌ ప్రభుత్వాన్ని విసిరేయాలని ఆంధ్ర ప్రజలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ప్రత్యేకత ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కడా ఘాటైన విమర్శలు చేసిన దాఖలాలు లేవు.

ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట నియోజకవర్గంలో గల బొప్పూడి వద్ద భారీ బహిరంగ సభలో మాట్లాడారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ కూటమి సభలో మొదటి సారి మాట్లాడారు.
ప్రధాన మంత్రి ఎక్కడా రాష్ట్రంలోని ఎన్‌డీఏ కూటమిలో ఉన్న పార్టీల పేర్లను ప్రస్తావించలేదు. ప్రసంగం పూర్తిగా ఎన్‌డీఏ కూటమి అని మాత్రమే సాగింది. రాష్ట్రంలోని జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ రెండూ ఒక వరలో కత్తులు, ఒకే పార్టీకి చెందిన వారు నాయకత్వం వహిస్తున్నారు. అవి రెండు ఒకే తానులో ముక్కులు అన్నారు. అన్నది వైసిపికి నాయకత్వం. చెల్లి కాంగ్రెస్. అంటూ కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీపై కత్తులు దూశారు.


చేసిన అభివృద్ధి గురించి చెప్పుకున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యా, వైద్య సంస్థలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయనే విషయాన్ని చెబుతూ అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో వివరించారు.
కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ఆ ప్రభుత్వాలకు కమ్యూనిస్టులకు పడదు. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు అప్‌కు పడదు. ఇలా వుంది వారి పాలన తీరు అంటూ ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు అసమర్థ పార్టీలని చెప్పే ప్రయత్నం చేశారు. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటుంటే ఇలాంటి వాళ్లకు పాలన ఎలా ఇస్తారని చెప్పటం విశేషం.

ప్రధాని ఆవాజ్‌ యోజన పథకం కింద రాష్ట్రానికి పది లక్షల ఇళ్లు ఇస్తే అందులో ఐదువేలు పల్నాడు జిల్లాలో ఇచ్చారు అంటూ... స్థానిక సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడారు. దేశంలో 30 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు చెప్పటం విశేషం.
సభ ఆద్యాంతం ఎన్‌డీఏ పేరు ప్రస్తావనతోనే సాగింది. తెలుగుదేశం, జనసేన ల పేర్ల ప్రస్తావన లేదు. వాటికి వోటేయండనే పిలుపులేదు. ఆంధ్రరాష్ట్ర హక్కుల కోసం పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని చెప్పినప్పుడు మాత్రమే వారిద్దరి పేర్లను పీఎం ప్రస్తావించారు.
ఎన్‌టీ రామారావు, పీవీ నరసింహారావులను గుర్తించింది ఎన్‌డీఏ ప్రభుత్వమేనని చెప్పారు. పీవీ నరసింహారావుకు భారత రత్న వచ్చిన కాంగ్రెస్‌ చేయని పనిని తాము చేశామని చెప్పుకున్నారు.
రామమందిర నిర్మాణం జరిగింది. ఎన్‌టీ రామారావు శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా ఎప్పుడూ గుర్తుంటారని చెప్పడం విశేషం. ఎన్‌టీ రామారావు, పీవీ నరసింహారావుల పేర్లు చెప్పి ఆంధ్ర ఓటర్ల సానుభూతిని పొందేందుకు ప్రయత్నించారు.
సభ ప్రారంభించగానే కోటప్ప కొండ వద్దకు వచ్చాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదాలు తీసుకున్నాం అంటూ దేవుడి సెంటిమెంట్‌ను సభికుల్లో నింపారు. అభివృద్ధి చెందిన రాష్ట్రం, దేశం కావాలంటే ఎన్‌డీఏకు ఓటువేసి 400 సీట్లతో ఆశీర్వదించాలని కోరారు.
సభ ప్రారంభంలో నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు.. అంటూ ప్రసంగం మొదలు పెట్టడంతో ఒక్కసారిగా సభకు వచ్చిన ప్రజల్లో జోష్‌ నిండింది.
రాజధాని అమరావతి ఉంటుందని కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు వెంటనే ఇస్తామని కానీ, ప్రత్యేక హోదా ఇస్తామని కానీ సభలో ప్రస్తావించలేదు. దీంతో సభకు వచ్చిన వారిలో కొంత నిరాశ చోటు చేసుకుంది. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లను సంతోష పెట్టేందుకు కూడా వారి గురించి మంచిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన హిందీ ప్రసంగాన్ని తెలుగులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తర్జుమా చేసి వినిపించారు. అయితే అక్కడక్కడా ఆమె తడబడటం విశేషం.
సభ ప్రారంభమైన తరువాత మూడు సార్లు మైకులు సరిగా పనిచేయలేదు. 6.14 గంటల నుంచి 6.19 గంటల వరకు అంటే ఐదు నిమిషాలు పూర్తిగా మైకులు ఆగిపోయాయి. దీంతో సభలో ప్రధానమంత్రి అలాగే మైకు ముందు నిలబడి ప్రజలను చూస్తూ ఉండిపోయారు. ఓటర్లలో జోష్‌ నింపేందుకు చెయ్యి ఊపుతూ స్టేజిపై అటూ ఇటూ తిరుగుతారేమోని అందరూ భావించారు. అలాంటిదేమీ జరగలేదు. వేదికపై నుంచి కిందకు దిగుతూ అందరికీ నమస్కారం చేశారు. ప్రధాని వేదికపై నుంచి కిందకు దిగుతున్నప్పుడు హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ చేతులు ఊపుకుంటూ వేదికపై రెండు సార్లు అటూ ఇటూ తిరిగి ఓటర్లను ఉత్తేజ పరిచే ప్రయత్నం చేశారు.
Next Story