నల్లమలలో ఏడాదికేడాది పెద్ద పులుల సంతతి పెరుగుతోంది. ప్రస్తుతం 80 పులులు ఉన్నాయి. అందులో 50 పులి పిల్లలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.


నల్లమల అడవుల్లో పులుల సంతతి పెరుగుతోంది. ఏటికేటికి పుల సంఖ్య పెరుగుతున్నట్లు నల్లమల ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ చెప్పారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు క్రిష్టా నదీ తీరం వెంబడి పులులు నివసించేందుకు అనువైన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా ఉన్నట్లు నాగార్జన సాగర్­, శ్రీశైలం పులుల అభయారణ్యం డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా చెప్పారు. రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యంగా పులులు నివసించే ప్రాంతానికి పేరు పెట్టారు. నల్లమల అడవి కొన్నేళ్లుగా స్మగ్లర్ల దాడికి గురై పెద్ద పెద్ద చెట్లు నరికి వేతకు గురయ్యాయి. ప్రధానంగా టేకు చెట్లు స్మగ్లర్ల చేతుల్లో పడి నరికి వేతకు గురికావడంతో అడవిలో నీడ చెట్ల సంఖ్య తగ్గింది.

ఇటీవల పులుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించడంతో అడవిలో చెట్ల నరికివేత తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. శేషాచలం అడవుల్లో ఎక్కువగా ఎర్రచందనం చెట్లు స్మగ్లింగ్ కు గురవుతున్నాయి. ఈ ప్రాంతంలో కూడా పులుల సంఖ్యను పెంచేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. తన పరిధిని విస్తరించుకుంటూ పలులు కూడా ముందుకు సాగుతున్నాయి. శేషాచలం అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అడుగులు వేస్తున్నాయి. గత నెలలో చెన్నై- కోల్ కత్తా జాతీయ రహదారిపై నెల్లూరు వద్ద పెద్దపులిని కారు ఢీకొట్టింది. అక్కడికి పులి ఎలా వచ్చిందో అధికారులు ఆరా తీయగా కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో సంచరించిన 106వ నంబరు పెద్దపులి నెల్లూరు జిల్లా పెనుశిల అభయారణ్యంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలు మీదుగా నెల్లూరుకు చేరింది. అటు నుంచి శేషాచలం అడవుల్లోకి పులులు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పెరిగిన పులుల సంతతి

నాగార్జున సాగర్‌- శ్రీశైలం టైగర్‌ కారిడార్‌ దేశంలోనే అతిపెద్దది. నల్లమల అభయారణ్యం పెద్ద పులుల ఖిల్లాగా పేరుగాంచింది. పులుల సంరక్షణకు అటవీ అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వాటికి కావాల్సిన సరైన ఆహారం, ఆవాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పులుల సంతతి క్రమేణా పెరుగుతోంది. 2010 లో 45 పులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2022వ సంవత్సరానికి వీటి సంఖ్య 76కు చేరింది. 2024లో ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం నల్లమలలో పులుల సంఖ్య 80కి పెరిగినట్లు గుర్తించారు. నల్లమలలో పులి కూనలు 50కి పైగా ఉన్నట్లు గుర్తించారు. అంటే పిల్లల సంఖ్య పెరుగుతోంది. పెద్ద పులులతో పాటు సాసర్ పిట్ల (పులులు నీరు తాగే గుంతలు) వద్దకు పులులు వచ్చినప్పుడు ఒక్కో ఆడపులితో పాటు మూడు పిల్లలు కూడా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

శేషాచలం అడవుల్లోకి కారిడార్ ఏర్పాటు

నల్లమల అడవి నుంచి శేషాచలం అడవుల్లోకి పులులు వెళ్లేందుకు కారిడార్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పులులు తిరుగుతున్న ప్రదేశాలను గుర్తించి అవి ప్రయాణించే ప్రాంతాల్లో ఎటువంటి మానవ సంచారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒక పులి 100 నుంచి 150 చదరపు కిలో మీటర్ల పరిధిని ఏర్పాటు చేసుకుని అందులోనే సంచరిస్తుంది. అక్కడికి మరో పులి వెళ్లేందుకు ఆసక్తి చూపదు. నల్లమలలో వీటి సంఖ్య పెరగడంతో తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలతో పాటు తెలంగాణలోనూ సంచరిస్తున్నాయి. క్రిష్టా నదికి అవతలి వైపున మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోనూ పులు సంచారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తాజాగా శేషాచలం అడవుల వైపు పులులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు గుర్తించారు. వైఎస్సార్‌ జిల్లాలోని లంక మల్లేశ్వర అభయారణ్యం, నెల్లూరు జిల్లాలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి అభయారణ్యంలో రెండు పులులు సంచరిస్తున్నట్లు ట్రాప్‌ కెమెరాల ద్వారా గుర్తించారు. పులుల సంతతి పెరుగుదలకు శేషాచలం అడవులు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పులుల ఆవాస విస్తీర్ణం పెంచేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న వైఎస్సార్, నెల్లూరు జిల్లాల అటవీ ప్రాంతం మీదుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండల్లోకి ప్రవేశించేలా కారిడార్‌ ఏర్పాటు చేశారు.

పులులకు ఛానల్ ఆధార్

పులులు ఏ ప్రాంతానికి చెందినవి. ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి. ఒకే పులు ఎన్ని ప్రాంతాల్లో సంచరిస్తోంది వంటి వివరాలు తెలుసుకునేందుకు ఛానల్ ఆధార్ ను అధికారులు కేటాయించారు. అంటే పులులకు ఒక సంఖ్యను కేటాయిస్తారు. ఆ సంఖ్య ఆధారంగా ఆ పులికి ఉన్న ప్యతేకతలు నోట్ చేస్తారు. అది ఎక్కడ తిరుగుతున్నా ఈజీగా గుర్తించేందుకు వీలు ఏర్పడుతుంది. నెల్లూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన పులిని కూడా ఈ నెంబరు ఆధారంగానే గుర్తించారు.

బేస్ క్యాంపుల ద్వారా వాచ్

నల్లమల అడవుల్లో మొత్తం 26 బేస్ క్యాంపులు (అడవిలో క్యాంపులు ఏర్పాటు చేసి పులుల సంచారాన్ని గమనిస్తుంటారు) ఉన్నాయి. ఒక్కో క్యాంపులో ఆరుగురు సిబ్బంది ఉంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేశారు. అక్కడ సిబ్బంది ఉండేందుకు వీలుగా వసతులు కల్పించారు. పులుల నుంచి రక్షణ కూడా వీరికి ఉంటుంది. రక్షణకు కావాల్సిన ఏర్పాట్లు క్యాంపు వద్ద ఉంటాయి.

ఎక్కువగా పులులు సంచరించే ప్రాంతాలు

నల్లమలలోని నంద్యాల జిల్లా పెద్ద చెరువు, ప్రకాశం జిల్లాలోని పులిచెరువు, పెద్దారుట్ల ప్రాంతాల్లో ఎక్కువగా పులులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో నీరు తాగేందుకు ఎక్కువగా సాసర్ పిట్స్ ఫారెస్ట్ వారు ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాల్లోనే కాకుండా నేరుగా సిబ్బందికి కూడా ఈ ప్రాంతాల్లో పులులు ఎక్కువగా కనిపించినట్లు ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు. దూరం నుంచి పులులు మనుషులను చూసినా మనిషి వైపుకు దూసుకు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. అడవిలో కొన్ని ప్రాంతాలకు టూరిస్టులను అనుమతిస్తున్నందున నిత్యం వాన్లలో వెళుతున్న మనుషులను పులులు చూస్తుంటాయని, అందువల్ల అవి మనుషులపైకి రావడం లేదని చెబుతున్నారు.

జింకలను వదిలిన అధికారులు

గతంలో రెండు ప్రైవేట్ సంస్థలకు దుప్పులు, జింకలు పార్కులు ఫారెస్ట్ అధికారులు అప్పగించారు. ఆ జంతువులకు సక్రమంగా ఆహారం అందించకపోవడంతో ప్రైవేట్ సంస్థ నుంచి ఆ పార్కులను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని నల్లమల అభయారణ్యంలోకి తరలించి సోలార్ సిస్టం ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసి బోర్ల నుంచి నీరు ఏర్పాటు చేశారు. వాటికి తగిన ఆహారం, తడిసేందుకు చెల్లెడల ద్వారా నీరు ఏర్పాటు చేశారు. జింకలు, దుప్పులు బాగా ఫిట్ గా ఉన్నాయని భావించిన తరువాత అడవిలోకి వదిలారు. మొత్తం 260 జింకలను ఇటీవల అభయారణ్యంలోకి వదిలినట్లు అధికారులు తెలిపారు. పులులకు ఆహారం కోసం ఇతర జంతువులు కూడా పెరగాల్సి ఉంటుంది.

స్మగ్లర్లలో పెరుగుతున్న భయం

ఇప్పటికే నల్లమల అడవి స్మగ్లర్ల చేతిలో విలవిల్లాడుతోంది. పులుల పెరుగుదల వల్ల అడవుల్లోకి నేరుగా స్మగ్లర్లు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. అడవుల్లో ఎక్కువగా ఉన్న టేకు, శ్రీగంధం, గంధం చెట్లను స్మగ్లర్లు ఇప్పటికే నాశనం చేశారు. వందల సంవత్సరాల నాటి చెట్లను కూడా నరికి సొమ్ము చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో అడవుల్లో స్మగ్లింగ్ తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Next Story