వడదెబ్బ ఎట్లుంటదో తెలుసా?
x
Source: Twitter

వడదెబ్బ ఎట్లుంటదో తెలుసా?

ఎండలు పెరుగుతున్న క్రమంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అదే విధంగా ఎండాకాలం తలెత్తే తాగునీటి సమస్యలపై జవహర్ రెడ్డి.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు.


వేసవికాలం ప్రారంభమై నెల రోజులు కూడా కాలేదు. కానీ ఎండలు మాత్రం మంట మండుతున్నాయి. బయటకు వెళ్లాలంటే ఒక సాహసం చేస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. దీంతో రానున్న రోజులను తలచుకుంటేనే వణుకుపుడుతోంది. ఈ నేపథ్యంలో వైద్యులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎండలు తీవ్రంగా ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఎండాకాలం మొదట్లోనే ఉన్నాం కదా అనుకుని నిర్లక్ష్యం వహిస్తే వడదెబ్బ వంటి సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ వడదెబ్బ తగలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వడదెబ్బ తగిలిందని ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే తగిన ముందు జాగ్రత్తలు పాటించాలని జాగ్రత్తలు చెప్తున్నారు. ఎండతీవ్రత, వడగాలులకు గురికాకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు.

వడదెబ్బ లక్షణాలు
‘‘వేసవికాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అతి పెద్ద సమస్య అధిక వేడి. వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వడదెబ్బ లక్షణాలు తెలుసుకుని ఉండాలి. వడదెబ్బ బారిన పడిన వారికి తల తిరగడం, తల నొప్పి, తీవ్రమైన జ్వరం ఉండి మత్తుగా ఉంటుంది. వీటితో పాటుగా మూర్ఛ రావడంతో పాటు కొన్నిసార్లు పాక్షిక లేదా అపస్మారక స్థితిలోకి వెళతారు. వారికి ప్రాథమిక చికిత్స అందించి వెంటనే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం’’ అని వివరించారు ఆయన.
ఎండ ఎక్కువగా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1) ఎండలు పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ తప్పక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో మొదటిది ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న వాతావరణ సమాచారం తీసుకుంటుండటం.
2) బయటకు వెళ్తున్నప్పుడల్లా తలపై టోపీ లేదా కర్చీఫ్ వంటి క్లాత్‌ను ధరించాలి. తెలుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. అదే విధంగా కళ్లకు కూడా రక్షణకు కూలింగ్ గ్లాసెస్ వంటివి వాడాలి.
3) వీలైనంత వరకు ఎండలోకి వెళ్లడాన్ని తగ్గించుకోవడం మంచిది. నీళ్లు కాస్త ఎక్కువగా తాగుతుండాలి. అలా చేయడం ద్వారా శరీరం హైడ్రేడెడ్‌గా ఉంటుంది. శరీరంలో నీటి శాతం ఎంత ఎక్కువ ఉంటే ఎండ ప్రభావాన్ని అంతగా ఎదుర్కోగలుగుతాం.
4) ఉప్పు, నిమ్మరసం కలిపిన నీరు లేదా గ్లూకోజ్ వంటి ద్రవ పదార్థాలను తాగడం కూడా మంచిదే. ఇలా చేయడం ద్వారా శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్‌ను తగిన స్థాయిలో ఉండి. ఎండ వేడికి నీరసం రాకుండా ఉంటుంది.
5) బయట నుంచి నీడలోకి వచ్చిన వెంటనే నీళ్లు, జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లు వంటివి తాగడం మంచింది. శీతల పానియాలకు దూరంగా ఉండటం కూడా మనకు మేలు చేస్తుంది.
6) ఇంట్లో కూడా వాతావరణం చల్లగా ఉండేలా తగిన చర్యలు తీసుకోండి. ఇంట్లో చల్లగా ఉండటానికి మేడపైన మొక్కలు పెంచడం కూడా ఉపయోగపడుతుంది.
7) ఎండలో బయటకు వెళ్లినప్పుడు వాంతులు కావడం, తల తిరగడం వంటి సంభవిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇవి వడదెబ్బకు సంకేతాలు.
8) ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురై కొంతసేపటికి కూడా సాధారణ స్థితికి రాకపోతే వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
ఈ తప్పులు చేయకండి
1) బయట ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. వాటిలో మొదటిది గొడుగు లేకుండా ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి. దాంతో పాటుగా మందపాటి దుస్తులకు కూడా వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
2) మధ్యాహ్నం సమయంలో ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమ కలిగించే పనులు చేయకూడదు. అలా చేయడం వల్ల శరీరంలో వేడి అధికమై వడదెబ్బకు గురయ్యే అవకాశాలు అధికం అవుతాయి.
3) బాలింతలు, చిన్నారులు, వృద్ధులు ఎండా కాలమంతటా జాగ్రత్తగా ఉండాలి. ఎండలో బయటకు వెళ్లకూడదు. వీరిపై ఎండ త్వరగా ప్రభావం చూపుతుంది.
4) ఎండాకాలం శరీరాన్ని డీహైడ్రేట్‌ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్ లాంటి వాటిని మానుకోవాలి. ఉప్పు, కారం, నూనె ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి.
5) ఎండలో నుంచి నీడలోకి వచ్చిన వెంటనే తేనె వంటి తీపి పదార్థాలు తీసుకోకూడదు. వాటి వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా ఉంటుంది.
6) ఎండాకాలం మధ్యాహ్నం సమయంలో వంటగదిలో వంట చేయడం వీలైనంతగా తగ్గించండి. దాంతో పాటుగా గది తలుపులు, కిటికీలు తెరిచి గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోండి.
7) ఎవరైన వడదెబ్బకు గురైతే వారి శరీరాన్ని వేడి నీటిలో ముంచిన వస్త్రంతో తుడవకూడదు. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా సదరు వ్యక్తి పరిస్థితి పరింత క్షీణింపజేస్తుంది. వారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాలి.

కలెక్టర్లకు జవహర్ రెడ్డి ఆదేశాలు
ఇదిలా ఉంటే ఎండాకాలం అధికమవుతున్న క్రమంలో తాగునీరు లభించక ప్రజలు అల్లాడే పరిస్థితులు రాకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అనేక చర్చలు చేపడుతోంది. మారుమూల ప్రాంతాలకు కూడా తాగునీరు అందాలని, అవసరం అయితే ప్రత్యేకంగా ట్యాంకర్లు పంపిన అక్కడి ప్రజల దాహాన్ని తీర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం అనేక ప్రాజెక్ట్‌లను ప్రారంభించడమే కాకుండా వాటి కోసం భారీ మొత్తంలో నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
‘‘సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్నింటిని నీటితో నింపండి. ప్రతి 15 రోజులకు భూగర్భ జలాల మట్టాలను పరిశీలించండి. ఉపాధి హామీ పనులు, తాగునీటి సరఫరా విధులు నిర్వహించే అధికారులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించండి’’ అని విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనుల కల్పనపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి సమస్య రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వీటి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని ఆదేశించారు.
‘‘తాగునీటి సరఫరాకు సంబంధించి నిధుల కొరత ఏమాత్రం లేదు. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1000 కోట్లు విడుదల చేశాం. ఈ నిధుల సహాయంతో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించండి. వివిధ రకాల తాగునీటి పథకాలను నిర్వహించండి. జూన్ చివరి వరకు వేసవి కార్యాచరణ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి భూగర్భ జలాల మట్టాలను పరిశీలించండి. బోరుబావుల పరిస్థితిని కూడా నిరంతరం పర్యవేక్షిస్తుండండి. తాగు నీటిని వృధా చేయకుండా, ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించండి. శివారు ప్రాంతాలకు కూడా నీరు అందేలా చర్యలు చేపట్టండి’’ అని కలెక్టర్లను ఆదేశించారు జవహర్ రెడ్డి.
ఉపాధి పనులు కల్పించండి
వేసవిలో కూడా ఉపాధి హామీ పనులను అధికంగా నిర్వహించాలని ఆయన కలెక్టర్లకు తెలిపారు. ‘‘ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తును పనులు కల్పించి కుటుంబానికి 100 రోజుల పని దినాల కల్పన లక్ష్యాన్ని అధిగమించేలా కృషి చేయండి. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులను ఉదయం 5:30 గంటల నుంచి 10:30 గంటల వరకు నిర్వహించేలా చూడాలి. తాగునీటి సరఫరా పథకాలు, ఉపాధి హామీ పనుల విధులు నిర్వహించే అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించండి. జిల్లా స్థాయిలో సమ్మర్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి జలవనరులు, పీఆర్ అండ్ ఆర్డీ, మున్సిపల్ పరిపాలన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తాగు నీటి సమస్య తలెత్తకుండా చూడాలి’’అని ఆయన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.


Read More
Next Story