TIRUMALA | బంగారు డాలర్ల కేసులో అందరికీ క్లీన్ చిట్
x

TIRUMALA | బంగారు డాలర్ల కేసులో అందరికీ క్లీన్ చిట్

300 డాలర్లు ఎలా మాయం అయ్యాయి?


20 ఏళ్ల తర్వాత తిరుమల గోల్డ్ డాలర్ల కేసు ఎందుకు తెరపైకి వచ్చిందీ? ముగిసిపోయిందంటున్న కేసును మళ్లీ ఎవరు తెరపైకి తెచ్చారు? ఈసారి ఈ కేసులో ఎవర్ని ఇరికించబోతున్నారు? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. ఈ నేపథ్యంలో అసలు ఈకేసు ఏమిటీ, ఎందుకు అనేది పరిశీలిద్దాం.

తిరుమల ఆలయం నుంచి 2006లో గల్లంతైన 300 శ్రీవారి బంగారు డాలర్ల (ఒక్కొక్కటి 5 గ్రాములు) కేసు 19 సంవత్సరాల తరువాత చర్చకు తెరతీసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న 15 మంది అధికారులపై చర్యలు నిలిపివేస్తూ, దేవాదాయ శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
డాలర్ల గల్లంతులో ఉద్యోగుల ప్రమేయం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. ఎవరూ బాధ్యులు కానప్పుడు బంగారు డాలర్లు ఎలా మాయమయ్యాయి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ప్రముఖులకు బహూకరించడంలో జారీ అయిన మౌఖిక ఆదేశాల వల్లే ఈ తప్పదం జరిగినట్లు కూడా తెలుస్తోంది.
కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులకు మానసిక వేదన నుంచి విముక్తి కల్పించింది.
డాలర్ల గల్లంతుపై టీటీడీ అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదు. అసలు బంగారు డాలర్లు ఎలా గల్లంతయ్యాయనే విషయంపై ఎలాంటి స్పందన లేదు. సాధారణంగా యాత్రికులు అసౌకర్యానికి గురై, నినదించినా, ప్రశ్నించినా టీటీడీ సీరియస్ గా స్పందిస్తుంది. గంటల వ్యవధిలో ఆ యాత్రికుల పుట్టుపూర్వోత్తరాలు సేకరించి, కేసులు నమోదు చేస్తుంది. అయితే,
ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ,
"ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీనిపై కామెంట్ చేయలేం. 2006లో ఏమి జరిగిందనేది కూడా సరిగా గుర్తు లేదు" అని వ్యాఖ్యానించారు.
మార్కెట్ ధర కంటే తక్కువే..
తిరుమలకు వచ్చే యాత్రికులు శ్రీవారి బంగారు డాలర్లు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఐదు, పది గ్రాముల బంగారు, వెండి డాలర్ల విక్రయానికి ఇక్కడ టీటీడీ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. మార్కెట్ ధరకు ఇక్కడ తక్కువగా ఉంటుంది. ప్రతి బుధవారం గ్రాము బంగారు ధర నిర్ణయించడం ద్వారా విక్రయిస్తుంటారు. దీనివల్ల బహిరంగ మార్కెట్ కు టీటీడీ విక్రయించే బంగారు డాలర్ ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకు కారణం తరుగు, జీఎస్టీ నుంచి ఈ డాలర్ ధరకు మినహాయింపు ఉండడమే.
బయటపడింది ఇలా..?
తిరుమల శ్రీవారి ఆలయంలో బొక్కసం (ట్రెజరీ) ఇన్చార్జిగా ఉన్న డాలర్ శేషాద్రి ఉద్యోగ విరమణ చేసిన సంవత్సరం అది. దీంతో ఆభరణాలు, రికార్డులు స్వాధీనం చేసే సమయంలో ట్రెజరీ నుంచి విక్రయ కేంద్రానికి పంపింన బంగారు డాలర్ల లెక్క తేలకపోవడం వల్ల డాలర్ శేషాద్రి ఈ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారు. చివరికి ఆయనకే ఈ కేసు చుట్టాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ వివరాల్లోకి వెళితే..
తిరుమల ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన కౌంటర్ లో శ్రీవారి బంగారు డాలర్లు విక్రయిస్తుంటారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి చిత్రాలు ఉండే ఐదు, పది గ్రాముల బంగారు, వెండి, డాలర్లు ఇక్కడ విక్రయిస్తుంటారు.
2006: తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న కౌంటర్ లో అసిస్టెంట్ షరాబు కే. వెంకటా చలపతి బాధ్యతలు నిర్వహించే వారు. రికార్డులు పరిశీలిస్తే, ఐదు గ్రాముల బరువు ఉన్న 300 బంగారు డాలర్లు గల్లంతైనట్లు గుర్తించడంతో తీవ్ర కలకలం చెలరేగింది. అప్రమత్తమైన టీటీడీ పాలక మండలి తోపాటు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణ కమిటీని నియమించింది.
డాలర్ల విక్రయంలో జరిగిన అవకతవకలకు బాధ్యుడిగా కౌంటర్ ఇన్చార్జి వెంకటా చలపతిని టీటీడీ 2006లో సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో ఆలయ డిప్యూటీ ఈఓగా పనిచేసిన రెడ్డివారి ప్రభాకరరెడ్డి, వాసుదేవన్, ఓఎస్డీ డాలర్ శేషాద్రి కూడా విచారణను ఎదుర్కొన్నారు. 2018లోనే ఆలయ డిప్యూటీ ఈఓ రెడ్డివారి ప్రభాకరరెడ్డి, మరో అధికారికి ఈ కేసు నుంచి విముక్తి లభించింది. వారి ప్రమేయం ఇందులో లేదనేది విచారణ కమిటీ నివేదిక. కాగా,
2008లో డాలర్లు గల్లంతుపై చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అప్పటి సీవీఎస్ఓ (సీవీఎస్ఓ) రమణమూర్తి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేశారు.
"ఐదు గ్రాములు బరువు ఉన్న శ్రీవారి డాలర్లు 300 గల్లంతయ్యాయి. వాటి విలువ రూ.15.40 లక్షలు. డాలర్లు గల్లంతు కావడానికి 15 మంది అధికారులు, ఉద్యోగులే కారణం. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి" అని అప్పటి సీవీఎస్ఓ రమణమూర్తి తన నివేదికలో ప్రస్తావించారు. ఆ తరువాత దర్యాప్తు చేసిన సీబీసీఐడీ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
2009లో షరాబు (బంగారు డాలర్ల విక్రయించే కేంద్రం ఇన్చార్జి) వెంకటాచలపతి తోపాటు 16 మందిపై విజిలెన్స్ విచారణ తోపాటు కేసు కూడా నమోదు చేశారు.
బంగారు డాలర్లు అదృశ్యమైన ఘటనలో తాజా ఉత్వర్వుల మేరకు ఉద్యోగ విరమణ చేసిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓలు ఆర్. ఉమాపతి, ఆర్ రఘునాథాచారి, ఎన్. చెంచులక్ష్మి (ఈమె మరణించారు), ఆర్ . ప్రభాకరరెడ్డి, ఏఈఓలు కే. చిత్తరంజన్, ఎస్. గజపతిరాజు (పేష్కార్ విభాగం), బొక్కసం (ట్రెజరీ) ఇన్స్పెక్షన్ విభాగాల సూపరింటెండెంట్లు కే.గోవర్థన్, ఈ. రామచంద్రారెడ్డి, ఏ. రఘురామిరెడ్డి, ఎం. చంద్రశేఖరరెడ్డి, ఏవీ. రమణమూర్తి, ఎం. వెంకన్న, సీనియర్ అసిస్టెంట్లు పీ. ఆంజనేయులు, బి. మల్లికార్జునమూర్తి ఉన్నారు. వారిలో చాలా మంది ఉద్యోగ విరమణ కూడా చేశారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారిలో బీఆర్. గురురాజారావు, ఆర్. శ్రీరాం కూడా ఉన్నారు. అభియోగాలు ఎదుర్కొన్న వారిలో బొక్కసం ఓఎస్డీ డాలర్ శేషాద్రి, ఎన్. చెంచులక్ష్మి, రమణమూర్తి, వెంకన్న, మల్లికార్జునమూర్తి కూడా మరణించారు.
2018 ఆగస్టు
శ్రీవారి డాలర్ల కేసును చిత్తూరు కోర్టు ముగింపు పలికింది. సీఐడీ నివేదిక ఆధారంగా చిత్తూరు నాల్గవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు 2014 నవంబర్ లో తీర్పు ఇచ్చింది.
డాలర్ల గల్లంతులో టీటీడీ ఉద్యోగి వెంకటాచలంను నిందితుడిగా పరిగణించి, మూడేళ్ల జైలు, రూ. పది వేలు జరిమానా విధించింది. ఇదే కేసులో డాలర్ శేషాద్రి, ఇంకొందరు అధికారులను నిర్దోషులుగా ప్రకటించింది.
సీవీఎస్ ఓ రమణకుమార్ నివేదిక ఆధారంగా ఆలయ డిప్యూటీ ఈఓ రెడ్డివారి ప్రభాకరరెడ్డి, షేష్కార్ వాసుదేవన్, ఆలయ బొక్కసం ఇన్చార్జిగా ఉంటూ ఉద్యోగ విరమణ అనంతరం కాంట్రాక్టు పద్ధతిలో ఓఎస్డీగా కొనసాగిన డాలర్ శేషాద్రి పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ ముగ్గురిపై అప్పటి ఈఓ కేవీ. రమణాచారి సస్పెన్సన్ వేటు వేశారు. టీటీడీ అధికారులు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీటీడీ ధర్మకర్తల మండలి తన విచక్షణాధికారాలతో ఆ ఉత్తర్వులు రద్దు చేశారు. ఆ తరువాత ప్రభాకరరెడ్డి, పేష్కార్ వాసుదేవన్ ఉద్యోగ విరమణ చేశారు. డాలర్ శేషాద్రి మాత్రం కొనసాగారు.
మూకుమ్మడి నిరసనలు
డాలర్ల గల్లంతు వ్యవహారంలో ఆలయ మాజీ డిప్యూటీ ఈఓ రెడ్డివారి ప్రభాకరరెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మిగతా వారితో పాటు ఆయనను సస్పెండ్ చేసిన సందర్భంలో టీటీడీ ఉద్యోగులు తిరగబడ్డారు. తిరుపతిలోని పరిపాలన భవనం వద్ద మూకుమ్మడిగా ధర్నాలకు దిగారు. ఆ తరువాత అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సారధ్యంలోని కమిటీ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి, సస్పెన్షన్ రద్దు చేయడంతో ఉద్యోగులు శాంతించారు.
అది ఓ పరీక్ష
"రెడ్డివారి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ, ఇన్నాళ్లన్నా, ఉద్యోగులకు మానసిక ప్రశాంతత దక్కడం సంతోషం" అన్నారు.
"శ్రీవారి చెంత పనిచేయడం ఓ వరం. చిత్తశుద్ధితో పనిచేసి, అందరి అభినందనలు అందుకున్నా" అని రిటైర్డ్ డిప్యూటీ ఈఓ రెడ్డివారి ప్రభాకరరెడ్డి అన్నారు.
"దేవుడు పరీక్ష పెట్టాడు. ఆయన తుడిచి వేశారు" అని ప్రభాకరరెడ్డి వ్యాఖ్యానించారు.
2018లోనే నాపై ఉన్న ఆరోపణలు సరైనవి కావని, విచారణ కమిటీలు, కోర్టు కూడా తీర్పు చెప్పిన విషయాన్ని ప్రభాకరరెడ్డి గుర్తు చేశారు. ఇదిలావుంటే..
ఉద్యోగ విరమణ అనంతరం డాలర్ శేషాద్రి విధుల్లోకి రావడంపై తిరుపతికి చెందిన మాంగాటి గోపాలరెడ్డి హైకోర్టులో కేసు వేశారు. దీంతో శేషాద్రిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. 14 నెలల తరువాత కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పుతో 2012లో ఆయన ఆలయ ఓఎస్డీగా చేరారు. ఎనిమిదేళ్ల తరువాత డాలర్ల కుంభకోణంపై చిత్తూరు కోర్టు తుది తీర్పు వెలువరించింది. వెంకటాచలం ను నిందితుడి తేల్చి, శిక్ష విధించింది.
కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ..
బంగారు డాలర్ల గల్లంతుపై టీటీడీ విజిలెన్స్, సీబీసీఐడీ నివేదికలను పరిగణలోకి తీసుకున్న రాష్ర్ట ప్రభుత్వం బాధ్యలైన టీటీడీ ఉద్యోగులు, అధికారులపై శాఖాపరంగా విచారణ జరిపించాలని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు అప్పగించారు. ఈ కేసును మొదట సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సుఖేంద్ర భట్టాచార్య, తరువాత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జే. సత్యనారాయణ విచారణ చేశారు.
" డాలర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ అధికారులు (వారంతా ఉద్యోగ విరమణ చేశారు), ఉద్యోగులపై అభియోగాలు రుజువు కాలేదు" అని స్పష్టం చేశారు. దీంతో తదుపరి చర్యలు నిలిపివేస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
డాలర్ల తయారీ ఎలా..
తిరుమల శ్రీవారిని రోజుకు కనీసంగా 65 వేల నుంచి 80 మంది యాత్రికులు దర్శించుకుంటూ ఉంటారు. వారిలో చాలా మంది నిలువుదోపిడీ ఇస్తుంటారు. అంటే తాము ధరించిన ఆభరణాలు శ్రీవారి హుండీకి సమర్పిస్తారు. కొందరు ఆభరణాలు కూడా హుండీలో వేస్తుంటారు. ఆ బంగారు ఆభరణాలు కరిగించి, శ్రీవారి డాలర్ల తయారీ ప్రభుత్వ మెంట్ (MINT) లో తయారు చేయించడానికి టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. తిరుమల ఆలయం ఎదుట కౌంటర్ లో మూడు గ్రాములు, ఐదు గ్రాముల బంగారు డాలర్లు ఆ రోజు మార్కెట్ లోని ధరకు అనుగుణంగా విక్రయిస్తుంటారు.
తిరుమలలో దశాబ్దాల కాలంగా కల్యాణోత్సవం జరుపుకునే దంపతులకు మాత్రమే విక్రయించే వారు. దీంతో డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితుల్లో
2009 నుంచి ప్రభుత్వ మింట్ కు టీటీడీ బంగారు ఆభరణాలు ఇవ్వడం ఆపివేసింది. వారి బంగారుతోనే అక్కడ ప్రత్యేకంగా తయారు చేయించిన డాలర్లను కొనుగోలు చేయడం ద్వారా యాత్రికులకు అందుబాటులో ఉంచుతోంది. అదే విధంగా వెండి డాలర్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు.
నిర్వహణ..
శ్రీవారి ఆభరణాలను తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ట్రెజరీలో భద్రపరుస్తారు. తిరుమలలోని ట్రెజరీకి ఒకో దఫా 200 డాలర్ల వరకు అప్పగిస్తారు. విక్రయించిన డాలర్ డబ్బు టీటీడీ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. వాటిని విక్రయించే సిబ్బంది ప్రత్యేకంగా రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలి. వాటిన్నింటి పర్యవేక్షణకు డిప్యూటీ ఈఓతో పాటు తిరుపతి, తిరుమలలోని టీటీడీ ట్రెజరీ , అధికారులు కూడా రిజిస్టర్లు నిర్వహిస్తారు. అంటే ఇంత పకడ్బందీగా డాలర్ల విక్రయానికి ప్రత్యేకంగా ఓ వ్యవస్థను టీటీడీ ఏర్పాటు చేసింది.
నోటి ఆదేశమే కష్టాలు తెచ్చిందా?
రాతకోతలకు ఆస్కారం లేకుండా బంగారు డాలర్లు తెప్పించిన వ్యవహారం అధికారులు, సిబ్బందికి చుట్టకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే..
తిరుమల శ్రీవారి దర్శనానికి కేంద్రం, రాష్ట్రంలోని కీలక పదవుల్లో ఉండే వీవీఐపీలతో పాటు విదేశీ ప్రముఖులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. వారికి ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు దర్శనాలు ఏర్పాటు చేస్తుంటారు. అత్యంత ప్రముఖులకు మరింత గౌరవ మర్యాదలు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే,
2006 వరకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రముఖులకు శ్రీవారి డాలర్ బహుమానంగా ఇచ్చేవారు. కౌంటర్ నుంచి బంగారు డాలరే కాదు. ఏ వ్యవహారమైనా రాతమూలకంగా ఉండాలి. అంటే,
టీటీడీ ఈఓ కార్యాలయం నుంచి ట్రెజరీకి రాతమూలకంగా ఆదేశం వెళ్లాలి. అంటే ప్రొసీడింగ్ పంపించాలి. దాని ఆధారంగా తిరుమలకు ఆ సిఫారసు వెళితే, దాని ఆధారంగా బంగారు డాలర్ జారీ చేయాలి. ఇవన్నీ తిరుపతి, తిరుమలలోని పరిపాలన వ్యవహారాలు, టీటీడీ ట్రెజరీల నుంచి క్రమపద్ధతిలో ప్రాసెసింగ్ జరగాలి. దీనికి విరుద్ధంగా...
"తిరుమల ఆలయం వద్ద ఉన్న కౌంటర్ నుంచి నోటి ఆదేశాలతో తెప్పించే డాలర్ ప్రముఖులకు ఇచ్చే వారు" అని ఆలయ సీనియర్ అధికారులు చెప్పారు.
శ్రీవారి బంగారు డాలర్లు గల్లంతైన వ్యవహారం వెలుగు చూడడంతో టీటీడీలో ప్రకంపనలు వచ్చాయి. ఆ తరువాత అధికారుల్లోనే కాదు. సిబ్బందిలో కూడా కలవరం చెలరేగింది.
ప్రస్తుతం ఆ పరిస్థితికి భిన్నంగా ఎవరి పరిధిలో వారు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారుల నుంచి వినిపిస్తోంది. కానీ, అధికారికంగా మాట్లాడడానికి ఎవరూ సాహసించడం లేదు.
"ఇప్పటికైనా రిటైర్డ్ అయిన వారికి, సర్వీసులో ఉన్న వారికి విముక్తి లభించింది. ఇది చాలు" అని మాత్రమే టీటీడీ ఉద్యోగ సంఘ మాజీ నేతలు కూడా వ్యాఖ్యానించారు.
శ్రీవారి బంగారు డాలర్లు అధికారులు చెప్పినట్లు ఇవ్వడం వల్ల సరైన పద్ధతిలో ఉత్తర ప్రత్తుత్తరాలకు ఆస్కారం లేకపోవడం వల్లే పొరబాటు జరిగినట్లు అధికారులు సమర్థించుకుంటున్నారు. అంతేకాకుండా, ఆరోపణలు వచ్చినప్పుడు కింది స్థాయిలోని అధికారులు, సిబ్బందిని బాధ్యులను చేశారు. మినహా వారి నిందితులు కాదనేది టీటీడీలో వినిపిస్తోంది. విచారణ కమిటీలు కూడా తేల్చివేయడం వల్లే, వారందరికీ ఆరోపణల నుంచి విముక్తి కల్పించారని చెబుతున్నారు. డాలర్ల కేసుకు మొత్తానికి ముగింపు పలికారనే భావన వ్యక్తం అవుతోంది.
Read More
Next Story