తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో నిందితులను కస్టడీకి తీసుకున్న సిబిఐ.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్టైన నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ మేరకు తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితులను శుక్రవారం కస్టడీలోకి తీసుకున్న అధికారులు నిందితులను విచారణకు సీట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. అంతకుముందు వారిని తిరుపతి ఎస్విఆర్‌ఆర్
ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత వారిని అలిపిరికి సమీపంలో ఏర్పాటు చేసుకున్న సీట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. విచారణ సమయంలో నిందితుల వద్ద న్యాయవాదులను కూడా సిబిఐ దర్యాప్తు బృందం అనుమతించలేదు. తమిళనాడు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన న్యాయవాదులు కూడా సిట్ కార్యాలయం వెలుపలే నిరీక్షిస్తున్నారు. మీడియాతో మాట్లాడడానికి వారు ఆసక్తి చూపలేదు.
చురుగ్గా విచారణ
తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ నిర్వహిస్తోంది. సీబీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు నేతృత్వంలో సాగుతున్న దర్యాప్తు బృందం నలుగురిని గత ఆదివారం అరెస్టు చేసింది. ఉత్తరాఖండ్ చెందిన భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైయిరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా, తమిళనాడులోని ఏఆర్ డైయిరీ ఎండీ రాజశేఖరన్ అరెస్టు అయ్యారు. వీరిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్ న్యాయస్థానాన్ని సిట్ అధికారులు కోరారు. సిట్ అధికారులు వేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు నలుగురు నిందితులను 5 రోజుల కస్టడికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి న్యాయవాదుల సమక్షంలో విచారణ నిర్వహించేందుకు అనుమతిస్తూ న్యాయమూర్తి కోటేశ్వరరావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు వీరి విచారణ జరగనుంది.
మరోవైపు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో ఉన్న సిట్ కార్యాలయానికి గురువారం మార్కెటింగ్ గోడౌన్ ఈఈ ప్రసాద్‌తోపాటు ప్రొక్యూర్‌మెంట్ విభాగంలోని కొందరిని పిలిచి వేర్వేరుగా విచారించారు. నెయ్యి నాణ్యతను ఎలా పరీక్షిస్తారు, పరిమాణంలో ఎప్పుడైనా వ్యత్యాసాన్ని గుర్తించారా వంటి ప్రశ్నలను అడిగారు. ఏఆర్ డెయిరీకి టెండర్ వచ్చిన సమయంలో తాను లేనని, అప్పటి వివరాలు తెలియవని ఈఈ ప్రసాద్ చెప్పారు. భోలేబాబా డెయిరీ ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీ, ఆ సంస్థ డైరెక్టర్లుగా గతంలో ఉన్న విపిన్ జైన్, పొమిల్ జైన్ నివాసాలున్న దేహ్రాదూన్‌లోనూ రెండు టీములు విచారణ జరిపాయి. భోలేబాబా డెయిరీకి శ్రీ వైష్ణవి డెయిరీ నుంచి ఎప్పుడెప్పుడు ఎంత మొత్తంలో నెయ్యి కోసం ఆర్డర్లు వచ్చాయంటూ డెయిరీ సిబ్బందిని అడిగారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏఆర్ డెయిరీలో పనిచేసే ఓ ల్యాబ్ అధికారిణిని తిరుపతి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తున్నట్లు సమాచారం. నెయ్యి నాణ్యత విషయంలో ఎలాంటి పరీక్షలు చేసి నిర్ధారించారు, అదే వే బిల్లుతో తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ నాణ్యత లోపంతో వెనక్కి పంపిన విషయం గురించి కూడా ఆమెను ప్రశ్నించారు. మధ్యలో ఏమైనా కల్తీ జరిగిందా అనే విషయాన్ని విచారించారు. టీటీడీ మార్కెటింగ్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు.
Next Story