
CM on Mumtaz Hotel | తిరుమల:వివాదాలకు పరిష్కారం చెప్పిన సీఎం చంద్రబాబు
తిరుమల గిరులు శ్రీావారి సొంతం. ఆ పాదాల చెంత వ్యాపారాలకు ఆస్కారం లేదు. ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
సప్తగిరులు శ్రీవేంకటేశ్వరస్వామి సొంతం అని సీఎం ఎన్. చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమలకు దిగువన కొండల చుట్టూ, ఎక్కడ వ్యాపార సంస్థలకు ఆస్కారం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
ముంతాజ్ హోటల్ వివాదం ఏమిటి?
తిరుపతి అలిపిరి నుంచి ఎస్వీ జంతు ప్రదర్శనశాలకు ( SV Zoo park) వెళ్లే మార్గంలో కుడిపక్కన, అంటే తిరుమల కొండలకు దిగువన నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ (Muntaaz Hotel) వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపై సాధు పరిషత్ తోపాటు, బీజేపీ, హిందూ సంఘాటు తరచూ ఆందోళనలకు దిగడం, తిరుపతిలోనే కాకుండా తిరుమలలో కూడా అశాంతి చెలరేగడానికి దారితీస్తోంది.
తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ పరిధిలో తిరుమల కొండకు దిగువన ఫైవ్ స్టార్ హెటల్ (Five Star Hotel ) , విల్లాల నిర్మాణానికి 20 ఎకరాలు ఓబెరా గ్రూప్ ఆధీనంలోని ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్, ట్రైడెంట్ ఫైవ్ స్టార్ హెటల్ కు 2021 నవంబర్ 24వ తేదీ అప్పటి వైసీపీ ప్రభుత్వం కేటాయిస్తూ, జీఓ నంబర్ 24తో ఆదేశాలు జారీ చేసింది.
ఏడు కొండలకు దిగువన ఇలాంటి హోటల్లకు ఆస్కారం ఇవ్వవద్దు అని హిందూ సంఘాలు అనేక దఫాలు టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన దీక్షలకు దిగారు. ఇదే అంశంపై తిరుపతి పట్టణానికి చెందిన తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. రెండు నెలల కిందట వారి సారధ్యంలో
నిరసనలతో అశాంతి
తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆమరణ దీక్షకు కూడా దిగారు. సాయంత్రానికి సీఎం ఎన్ చంద్రబాబు స్పందించారు. ఈ విషయంపై సాధుపరిషత్ సభ్యులు, హిందూ సంఘాటలతో కూడా స్వయంగా మాట్లాడేందుకు అమరావతికి కూడా రావాలని ఆహ్వినించిన నేపథ్యంలో శ్రీనివాసానంద స్వామీజీ ఆమరణ దీక్ష విరమించారు. ఇదే అంశంలో స్పందన లేకపోవడంతో ఇటీవల బీసీవై వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ సారధ్యంలో సాదువులు భారీగా తిరుమలకు చేరుకుని, శ్రీవారి ఆలయం ముందు ధర్నాలకు దిగడం కలకలం రేపింది. తిరుమల చరిత్రలో ఈ తరమా నిరసన జరగడం ఇదే ప్రథమం. దీనిపై బోడె రామచంద్రయాదవ్ సహా పలువురు స్వామీజీలపై కూడా తిరుమల పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసింది.
వివాదానికి తెర
తిరుపతి నగరం అలిపిరికి సమీపంలో ఓబెరా గ్రూప్ సంస్థలు నిర్వహిస్తున్న ముంతాజ్ హోటల్ వ్యవహారంపై సాగుతున్న నిరసనలు, అశాంతికి సీఎం చంద్రబాబు శుక్రవారం తెరదించారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ జే. శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చూదరితో కలిసి సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ,
తిరుపతిలో ఏడుకొండలకు దిగువన ముంతాజ్ హోటల్ నిర్మాణ వివాదానికి తెర దించారు.
"ఆ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నాం" అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమం జరగడానికి వీల్లేదు. కొండలకు సమీపంలో ఎక్కడా కమర్షియలైజేషన్ ను అనుమతించం. అలాంటి వాటికి అవకాశం ఇవ్వం. అందుకని, "ముంతాజ్ హోటల్ తో పాటు మిగతా రెండు వ్యాపార సంస్థలకు 35.2 ఎకరాల అనుమతి రద్దు చేస్తున్నాం" అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తులు కాపాడడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యం" అని ఆయన విష్పష్టంగా చెప్పారు.
ఇదిలావుంటే, ముంతాజ్ హోటల్ నిర్మాణ వ్యవహారం కోర్టులో ఉంటే, హోటల్ నిర్మాణానికి ఆ సంస్థ ప్రతినిధులు తిరుపతి స్థానిక సంస్థలకు కోట్ల రూపాయలు కూడా ఫీజుల రూపేణా చెల్లించారు. దీనిపై పర్యవసానాలు ఎలా ఉంటాయనేది వేచిచూడాల్సిందే.
Next Story