తిరుమల:పాపవినాశనంలో బోటింగ్ పై చెలరేగిన వివాదం
x

తిరుమల:పాపవినాశనంలో బోటింగ్ పై చెలరేగిన వివాదం

తనిఖీలు మాత్రమే నిర్వహించాం అని డీఎఫ్ఓ స్పష్టం చేశారు. వైసీపీ దీనిని తప్పు పట్టింది. ట్రయల్ రన్ చేసిన సిబ్బంది ఎవరో చెప్పాలని కరుణాకరరెడ్డి నిలదీశారు.


తిరుమల డ్యాం పరిసర ప్రాంతాల్లో పడవలపై తనిఖీలు సాగించామని డీఎఫ్ఓ స్పష్టం చేశారు. ఇధి ఘోరమైన అపచారం అని వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. ఆ డ్యాం ఎవరి పరిధిలో ఉందో చెప్పాలని టీటీడీ అధికారులను మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో పాపవినాశనంలో పడవలు నడిపిన వ్యవహారం మరింత వివాదంగా మారే వాతావరణం కనిపిస్తోంది. దీనిపై టీటీడీ పక్షాన ఎలాంటి ప్రకటన జారీ కాలేదు. డీఎఫ్ఓ ప్రకటనను టీటీడీ సమాచార శాఖ (TTD Information Department ) విడుదల చేయడం గమనార్హం.

శేషాచలం అటవీప్రాంతంలో ఐదు డ్యాములు ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుమల (Tirumala ) శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల వసతి గదులకు నీటిని పంపింగ్ చేస్తుంటారు. ఈ డ్యాముల్లో పాపవినాశనం డ్యాంలో బోటింగ్ ఏర్పాటు చేస్తారనే విషయంపై కలకలం చెలరేగింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ పనేమిటి? అనే ప్రశ్న తలెత్తింది. దీనిపై తిరుపతి జిల్లా అటవీశాఖాధికారి (Tirupati District Forest Officer ) పీ. వివేక్ స్పష్టత ఇచ్చారు.

"తిరుమల పాపవినాశనం డ్యాంలో తమ శాఖ సిబ్బందితో తనిఖీలు సాగించాం" అని డీఎఫ్ఓ వివేక్ తెలిపారు. శ్రీవేంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం బయోస్ఫేర్ రిజర్వ్ లోని పాపవినాశనం డ్యామ్ లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది" అని ఆయన వెల్లడించారు. ఈ అటవీప్రాంతంలో విస్తారంగా విలువైన ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. స్మగ్లర్లు ( Smugglers ) చొరబడకుండా, అటవీశాఖ (Forest Department ) సిబ్బంది డ్యాంలోని నీటిపై పడవల్లో తిరుగుతూ గస్తీ నిర్వహించారు" అని డీఎఫ్ఓ వివేక్ స్పష్టం చేశారు. దీనికోసమే పడవలు వినియోగించామని ఆయన చెబుతున్నారు. గస్తీ అనంతరం ఆ పడవలు వెనక్కు తీసుకుని వచ్చినట్లు ఆయన వివరించారు.
తిరుమలలో అపచారం : Ycp
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఘోరమైన అపచారానికి పాల్పడ్డారని వైసీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడతానని చెప్పిన కూటమి నేతలు, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? అని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, కరుణాకరరెడ్డి నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
"పాపవినాశనం డ్యాంలో మంగళవారం బోటింగ్ జరిగింది" అని గుర్తు చేసిన కరుణాకరరెడ్డి, ఈ విషయంలో ఎలా వివరణ ఇవ్వాలో అర్థంకాని స్థితిలో అటవీశాఖాధికారులు ఉన్నారు" అని వ్యాఖ్యానించారు.
"చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. బోటింగ్ నిర్వహిస్తున్నాం" అని ఫారెస్ట్ ఉన్నతాధికారి వివేక్ చెప్పడం హాస్యస్పదంగా ఉందని కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు.
"తిరుమల, పాపవినాశనం డ్యాం ఎవరి పరిధిలో ఉంది" అనే విషయంలో టీటీడీ, అదనపు ఈఓ సమాధానం చెప్పాలని కరుణాకరరెడ్డి నిలదీశారు.
ఆ సిబ్బంది ఎవరు?
పాపవినాశనం డ్యాంలో పడవలు నడిపిన అటవీశాఖ సిబ్బంది ఎవరు? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని కరుణాకరరెడ్డి జిల్లా అటవీశాఖాధికారిని డిమాండ్ చేశారు. పాపవినాశనం డ్యాంలో పర్యాటక శాఖ అధికారులు పడవలు నడిపినట్లే కనిపిస్తోంది అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. "ఆధ్యాత్మికం వేరు, టూరిజం వేరు" అనే విషయం తెలియదా అని నిలదీసిన ఆయన ఆధ్యాత్మిక క్షేత్రాన్ని విచ్ఛిన్నం చేయడమే టిడిపి లక్ష్యంగా చేసుకున్నట్లు ఉందని ఆరోపించారు. పాపవినాశనం డ్యాంను యాత్రికులకు అత్యంత పవిత్రంగా భావిస్తారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
"పాపవినాశనం డ్యాం సమీప ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన అటవీశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలి" అని కూడా డిమాండ్ చేశారు. అటవీశాఖాకారి చెప్పినట్లు డ్యాం వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనేది స్పష్టం చేయాలన్నారు.
Read More
Next Story