Protection in Tirumala | తిరుమల: జామర్లతో శతృ మూకలకు అడ్డుకట్ట
x

Protection in Tirumala | తిరుమల: జామర్లతో శతృ మూకలకు అడ్డుకట్ట

తిరుమలను నో నో ఫ్లై జోన్ గా ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో టీటీడీ సొంత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటోంది.


అందుబాటులోని వనరులు సద్వినియోగం చేసుకోవడం. రక్షణ పరంగా శాస్ర్తసాంకేతిక వ్యవస్థను వినియోగించడంలో టీటీడీ ముందు వరుసలో ఉంటుంది. ఈపాటికే శ్రీవారి ఆలయం, పరిసరాల్లో జామర్లు ఏర్పాటు చేశారు.

తిరుమల గగనతలాన్ని నోఫ్లై జోన్ గా ప్రకటించడానికి వీలుకాదనే విధంగా డీజీసీఏ అనేక సాంకేతిక అంశాలను తెరమీదకు తెచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా స్వయం సమృద్ధి కలిగిన టీటీడీ తిరుమలలో స్వయంగానే ప్రత్యేక రక్షణ కవచం ఏర్పాటుకు సిద్ధమైంది.
నిత్యం తిరుమలలో సుమారు లక్ష మందికి తక్కువ కాకుండా సంచరించే ప్రదేశంలో ప్రత్యేక రక్షణ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న ఐదంచెల భద్రతకు తోడుగా సాంకేతికత వ్యవస్థ అందుబాటులోకి తీసుకుని రావడానికి కసరత్తు చేపట్టింది. ఆరు కిలోమీటర్ల వరకు శత్రుమూకలు కాదు కదా. కనీసం డ్రోన్ కెమెరాలు కూడా పనిచేయని ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది.
టీటీడీ నిత్యం అందుబాటులోకి వస్తున్న సాంకేతిక వ్యవస్థను వినియోగించుకోవడంలో అప్ డేట్ గా ఉంది. అందులో భాగమే. ఆన్ లైన్ సేవలు. ఎస్ఎస్డీ (Time slot special darshan) సర్వదర్వనం టోకెన్ల జారీ నుంచి గదుల కోటాయింపు. ఆర్జీత సేవా టికెట్లు కూడా ఆన్ లైన్ లో జారీ చేయడం ద్వారా పారదర్శక విధానం అమలు చేస్తున్నట్లు టీటీడీ చెబుతోంది. అంటే సాంకేతికంగా సేవలను అప్ డేట్ చేయడంలో యంత్రాంగం ముందువరుసలో ఉంటోంది. ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధం అవుతోంది.
ఎందుకంటే..
తిరుమలకు రోజుకు సగటున రోజుకు లక్ష మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారిని వారాంతంలో 70 వేల నుంచి 75 వేల మంది దర్శించుకుంటుంటారు. సాధారణ రోజుల్లో ఆ సంఖ్య 60 వేల నుంచి 65 వేల వరకు ఉంటుంది. శుక్రవారం 67,127 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 22,910 మంది తలనీలాలు సమర్పించారు. వారి వల్ల రూ. 3.47 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల ఆరవ తేదీ 58,548 యాత్రికులు దర్శనం చేసుకుంటే వారి వల్ల 3.80 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఐదో తేదీ 63,285 మంది యాత్రికులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇవన్నీ సాధారణ రోజులు మాత్రమే. వారు కాకుండా, చిన్న హోటళ్లు, నిత్యాన్నదానసత్రం, ఇతర ప్రదేశాల్లో పనిచేసే వారిని కలిపితే కనీసం అంటే 20 వేల మందికి పైగానే తిరుమలకు నిత్యం వెళ్లి వస్తుంటారు. రోజుకు 1500 ద్విచక్ర వాహనాలు తిరుమలకు వెళ్లే వాహనదారులు ఉంటారు.
హైసెక్యూరిటీ జోన్
ప్రపంచ స్థాయిలో ఏడాది పొడవునా ఇంతటి రద్దీగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల హైసెక్యూరిటీ జోన్ పరిధిలో ఉంది. 10.33 చదరపు మైళ్ల (26.75 కిలోమీటర్ల వైశాల్యం) వరకు విస్తరించి ఉన్న తిరుమలను హై అలర్ట్ జోన్ గా పరిగణిస్తున్నారు. అలిపిరి, శ్రీవారిమెట్టు
నడక మార్గాలను హైఅటర్ట్ జోన్ గా ప్రకటించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంది అనే విషయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (Central Intelligence Bureau) టీటీడీ (TTD)ని హెచ్చరించినట్లు కథనాలు వస్తుంటాయి. మినహా, దీనిపై రక్షణ పరమైన అంశం కావడం వల్ల అధికారులు దీనిపై ప్రకటన చేయకున్నా, అంతర్గత ఆదేశాలతో భద్రతా ఏర్పాట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా మాంసాహారం నుంచి, పొగాకు వస్తువులు ఇతర నిషేధిత వస్తువులను ఏమాత్రం తిరుమలకు అనుమతించరు. మద్యం తీసుకుని వెళ్లడం కాదు. కాదా, కనీసం మద్యం సేవించిన వారిని కూడా అనుమతించరు. అలిపిరి టోల్ గేట్ వద్దే అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత కానీ వదలరు. కొండపై కూడా ఆలయ పరిసరాలే కాదు. అన్నిప్రాంతాలను విజిలెన్స్ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొండపై అన్ని ప్రాంతాల్లో చీమచిటుక్కుమన్నా, వెంటనే పోలీస్, విజిలెన్స్ విభాగాలు అప్రమత్తం కావడానికి సీపీ కెమెరాల నిఘాలో కంట్రోల్ రూంలో 24/7 సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉంటారు. దీనికి తోడు...
ఐదంచెల భద్రత
తిరుమలలో మొదటి నుంచి రక్షణ శాఖలో ఉద్యోగ విరమణ చేసిన వారిని టీటీడీ సెక్యూరిటీ గార్డులుగా నియమించారు. వారితో పాటు వివిధ స్థాయిల్లో 1,500 వేల మంది ఉద్యోగులు దాదాపు ఐదు దశాబ్దాలుగా పనిచేసేవారు.
1. కాలక్రమంలో ఉద్యోగ విరమణల తరువాత సెక్యూరిటీ గార్డులు, టీటీడీ ఉద్యోగాలను భర్తీ చేయని స్థితిలో టీటీడీ సెక్యూరిటీ గార్డుల సంఖ్య వంద మంది లోపే ఉన్నారు. ఉద్యోగుల సంఖ్య కూడా 6,100 మందికి పరిమితమైంది. వారి పరిస్థితి అలా ఉంటే. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం దేశంలో చోటుచేసుకున్న పరిణామాల తరువాత హిందూ దేవాలయాలకు భద్రత కట్టుదిట్టం చేశారు. దీంతో టీటీడీ రక్షణ వ్యవస్థ పటిష్టం కావడానికి మార్గం ఏర్పడింది. అందులో భాగంగా
2. ఐపీఎస్ (IPS) చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (Chief Vigilance and Security Officer - CVSO) పర్యవేక్షణలో ఆర్మ్ డ్ రిజర్వు (Armed Reserve AR)) ఆంధ్రప్రదేశ్ స్నెషల్ పోలీస్ (Andhra Pradesh Special Police APSP) బెటాలియన్ల నుంచి డెప్యూటీషన్పై కానిస్టేబుల్ నుంచి అదనపు ఎస్పీ స్థాయి అధికారి వరకు 1,500 మంది టీటీడీలో భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. వారికి తోడుగా
3. ప్రైవేటు గార్డులుగా తీసుకున్న 1,200 మంది యువకులు, రక్షణ శాఖ నుంచి ఉద్యోగ విరమణ చేసిన 300 నుంచి 400 మంది విజిలెన్స్ విభాగానికి అనుబంధంగా విధులు నిర్వహిస్తున్నారు. వారికితోడు..
4. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2004లో టీటీడీ మాజీ చైర్మన్ బి. కరుణాకరరెడ్డి తిరుమలలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (Special Protection Force SPF) ను రంగంలోకి తీసుకుని వచ్చారు. కమాండెంట్ స్థాయి అధికారి పర్యవేక్షణలో కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ క్యాడర్ వరకు 560 మంది విధుల్లో ఉన్నారు.
5. అత్యవసర పరిస్థితి ఏర్పడితే మెరుపు దాడులు చేయడం ద్వారా క్షణాల్లో పరిస్థితి అదుపులోకి తీసుకుని రావడానికి అక్టోపస్ దళాలు సంసిద్ధంగా ఉంటాయి. 15 ఏళ్ల కిందట 100 మంది కమాండోలతో స్ధిరమైన రక్షణ వ్యవస్థను బలోపేతం చేశారు.
అయినా.. ముప్పు ఉందా?
ఎలాంటి ముప్పు ఎదురైనా యాత్రికులకు ఇబ్బంది లేకుండా, శ్రీవారి ఆలయం కూడా చెక్కుచెదరని భద్రత కల్పించే విధంగా భద్రతా చర్యలు ఉన్నాయి. అయినా, తరచూ తిరుమల సమీప ప్రాంతాల్లో విమానాలు ప్రయాణించడంపై మీడియా కథనాలు ప్రసారంతో అభద్రత, ఆందోళనకు కారణం అవుతున్నదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వాటి ఆధారంగా టీటీడీ అధికారులు కాకుండా, చైర్మన్లు 2004 నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( Director General of Civil Aviation DGCA) కు తిరుమలను నోఫ్లైన్ జోన్ గా ప్రకటించాలని లేఖలు రాయడం, వారు పట్టించుకోకపోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
"ఇలా ప్రకటించడం వల్ల ఇంకొన్ని ప్రతిపాదనలు రావడమే కాదు. విమానయాన రంగాన్ని పూర్తిస్థాయిలో సాగించడం కష్టం అవుతుంది" అని డీజీసీఏ స్పష్టం చేసింది. దీంతో తిరుమలను నోఫ్లై నోజోన్ ప్రకటించడం సాధ్యం కాదనే విషయం చాలా స్పష్టంగా తేలిపోయింది.
తరువాత ఏంటి పరిస్థితి?
ఈ పరిస్థితుల్లో మున్ముందు ఎదురయ్యే సవాళ్లకు తోడుగా, యాత్రికుల భద్రత కోసం టీటీడీ సొంతంగానే భద్రతా ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కూడా ఉంది. భద్రతా వ్యవహారాలపై నిత్యం కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు అప్రమత్తం చేస్తూనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ..
సెల్ పనిచేయదు
గతంలో టీటీడీ అధికారులే కాదు. ఆలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా సెల్ ఫోన్లు యథేచ్ఛగా తీసుకుని వెళ్లేవారు. యాత్రికులపై ఆంక్షలు విధించే వారు. ఇప్పుడు ఆ పప్పులు ఉడకడం లేదు. పడికావలి (మహద్వారం దాటగానే సూపరింటెండెంట్ కూర్చొనే ప్రదేశం) లో మాత్రమే ల్యాండ్ ఫోన్ ఉంటుంది. మినహా సెల్ ఫోన్లను తీసుకుని వెళ్లడానికి విజిలెన్స్ సిబ్బంది ఆలయం వెలుపలే పూర్తిగా చెక్ చేసి పంపిస్తున్నారు. దీనికి తోడు సెల్ సిగ్నల్ నుంచి ముప్పు లేకుండా ఆనంద నిలయం (ఆలయంలో మూలమూర్తి కొలువైన గోపురం పైభాగం), నాలుగు మాడవీధుల్లో ప్రాకారం గోడలపై కూడా జామర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఫోన్లు పనిచేయడం కూడా కష్టంగా మార్చారు. పోలీస్, సెక్యూరిటీ విభాగం వాకీటాకీలు మినహా మిగతా వాటికి సిగ్నల్లు అందవు.
మరింత పటిష్ట సాంకేతికత
రానున్న రోజుల్లో తిరుమలకు ఆరు కిలోమీటర్ల దూరం వరకు డ్రోన్ కెమెరాలు కూడా పనిచేయని సాంకేతిక వ్యవస్థను టీటీడీ ఏర్పాటు చేయబోతోంది. దీనికోస ఈసీఐఎల్ సహకారంతో యాంటీ డ్రోన్ ప్రదేశంగా శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు జామర్లను తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తరచూ శ్రీవారి ఆలయ గగనతలంలొ విమానాల ప్రయాణాన్ని మీడియా హైప్ చేస్తోంది. ఈ సమస్య అనేది కాకుండా, ముందుముందు ఎలాంటి సాంకేతిక దాడుల వల్ల ఎలాంటి ముప్పు లేకుండా ఉండే విధంగా టీటీడీ యంత్రాంగం ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికోసం ఈసీఐఎల్ సహకారంతో అధునాతన రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు సమాలోచనలు సాగించారు. ఈ జామర్లు ఏర్పాటు చేస్తే, డ్రోన్ కెమెరాలు కూడా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై సాంకేతిక సంస్థలతో చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఈ నెలలో నిర్వహించే టీటీడీ పాలక మండలిలో ఈ విషయంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటారని ఓ అధికారి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
తిరుమలకు వెళ్లేందుకు ముఖద్వారంగా ఉన్న అలిపిరి వద్ద స్కై స్కానింగ్ ఏర్పాటు చేయాలని 2010లో నిర్ణయం తీసుకున్నారు. అంటే గరుడిడి విగ్రహం దాటగానే వాహనం మొత్తం యంత్రాలే స్కానింగ్ చేయడం ద్వారా ఏ వస్తువులు తీసుకుని వెళ్లుతున్నారనేది దీని వల్ల పసిగట్టవచ్చు. అయితే, దీని రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఉద్యోగులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అప్పట్లో ఆ ప్రతిపాదన విరమించకున్నారు.
శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం జామర్లు ఏర్పాటు చేసిన విషయాన్ని ఓ సెక్యూరిటీ అధికారి స్పష్టం చేశారు. రానున్న కాలంలో యాంటీ డ్రోన్ జామర్లు ఏర్పాటుకు కసరత్తు సాగుతున్న విషయాన్ని కూడా ఆయన ధృవీకరించారు. దీనిపై ఎలాంటి నిర్ఱయం తీసుకుంటారనేది వేచిచూడాలి.


Read More
Next Story