రేపే  తిరుమల  కుమార‌ధార తీర్థ ముక్కోటి యాత్ర
x

రేపే తిరుమల కుమార‌ధార తీర్థ ముక్కోటి యాత్ర



తిరుమలలో ఫిబ్ర‌వ‌రి 24న శ‌నివారం జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కుమారధారకు చేరుకోవడం ఒక సాహయ యాత్ర. సాధారణ రోజుల్లో ఇక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదు.

ముక్కోటి సందర్భంగా శ‌నివారం ఉదయం 5.30 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే కుమార‌ధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్న‌పిల్ల‌లు, వృద్ధుల శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకుని అట‌వీ మార్గంలో ఈ తీర్థానికి న‌డిచి వెళ్ల‌డానికి అనుమ‌తి లేదు.

గోగ‌ర్భం నుండి పాప‌వినాశ‌నం వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు. ట్రాఫిక్ ర‌ద్దీ దృష్ట్యా ప్ర‌యివేటు వాహ‌నాల‌ను అనుమ‌తించ‌రు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది. పాపవినాశనం నుండి కుమార‌ధార‌ తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

మార్గమ‌ధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద ఉదయం 6 గంటల నుండి భక్తులకు పొంగ‌ళి, ఉప్మా, సాంబార‌న్నం, పెరుగన్నం, పాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్ర‌యివేటు సంస్థ‌లు, వ్య‌క్తులు అన్న‌దానం చేసేందుకు అనుమ‌తి లేదు. ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భ‌క్తుల‌కు అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్స్‌లు, డాక్ట‌ర్లు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు.

ఈ సంద‌ర్భంగా చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై టీటీడీ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగం, పోలీసు అధికారులు శుక్ర‌వారం తిరుమ‌ల‌లోని క‌మాండ్ కంట్రోల్ రూమ్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు.


ప్రాశస్త్యం

వరాహ, మార్కండేయ పురాణాల ప్రాకారం ఒక వృద్ద బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు.శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమర ధార’ అనే పేరు వచ్చింది.

పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురిడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థ్లంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందడు. సాక్షత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.


Read More
Next Story