తిరుమల గుడి శుద్ది ఇలా జరిగింది (ఫోటో గ్యాలరీ)
- భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమా మంత్రాన్ని పఠించాలి
శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు.
ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్కన పెట్టవచ్చు అన్నారు.
అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ, యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు చెప్పారు.
ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు.
సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో, క్షమా మంత్రాలైన.... ''ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ'' లను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్ద జీయర్ స్వామి, తిరుమల శ్రీ చిన్న జీయర్ స్వామి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ప్రధానార్చకులు శ్రీ గోవిందరాజ దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారులు శ్రీరామకృష్ణ దీక్షితులు, శ్రీ సీతారామ దీక్షితులు, వేదపారాయణదారులు, రుత్వికులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.