TIRUMALA: శ్రీనివాసా నీ ఆభరణాలు భద్రమేనా..?
x
తులాభారం వేయించుకుంటున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి (ఫైల్ ఫోటో)

TIRUMALA: శ్రీనివాసా నీ ఆభరణాలు భద్రమేనా..?

టీటీడీ బోర్డు సభ్యుడు జి. భానుప్రకాశ్ రెడ్డి సందేహం. తులాభారంలో రూ. కోట్ల కుంభకోణం జరిగింది. వైసీపీ నేతల వాటాలపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.


తిరుమల శ్రీవారి ఆలయంలో తులాభారం ద్వారా యాత్రికులు మొక్కుబడి కింద చెల్లించిన కానుకలు పెద్దల జేబుల్లోకి వెళ్లిందని టీటీడీ పాలకమండలి సభ్యుడు, బిజెపి అధికార ప్రతినిధి జి. భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వైసిపి ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారంలో శ్రీవారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయో? లేవో అని ఆందో ళన వ్యక్తం చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో తులాభారం కానుకలు స్వాహా చేశారంని ఆరోపిస్తూ, బిజెపి నేత, టీటీడీ బోర్డు సభ్యుడు జి.భానుప్రకాష్ రెడ్డి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (state vigilance and enforcement) తిరుపతి ఎస్పి కరీముల్లా షరీఫ్ కు సోమవారం ఉదయం ఫిర్యాదు చేశారు.

2014 నుంచి 19 వరకు వైసీపీ ప్రభుత్వ కాలంలో శ్రీవారి ఖజానాకు రక్షణ లేకుండా పోయింది. అదే సమయంలో తులాభారం ద్వారా అందిన కానుకల సొమ్ము కూడా పెద్దల జోబుల్లోకి వెళ్ళాయని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
తులాభారం అంటే..
టీటీడీ ఆధీనంలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, అనుబంధ ఆలయాల్లో కూడా తులాభారం ఉంది.
తిరుమల శ్రీవారి ఆలయం మహద్వారం దాటగానే ఎడమవైపున తులాభారం ఉంటుంది. తమ కోరికలు తీరిన యాత్రికులు ఇక్కడ త్రాసులో బరువు తూగి అందుకు సరిపడా నగదు మొక్కుబడి చెల్లించడానికి ప్రాధాన్యత ఇస్తారు. కోరికలు నెరవేరిన భక్తులు పిల్లలకే కాకుండా పెద్దలు కూడా ఓ త్రాసులో ఒకపక్క వారు కూర్చొంటారు. మరోపక్క నాణేలు, చక్కెర, బెల్లం, కలకండ, డ్రైఫ్రూట్స్ ఏదైనా సరే ఒకటి ఉంచుతారు. తమ బరువుకు సరిపడ నగదు టీటీడీకి అందిస్తారు. ఇందులో రెండు, 5, రూపాయి నాణెల బస్తాలు ఉంచి బరువు తూకం వేస్తారు. ఆ యాత్రికుడు ఎంత బరువుంటే అంత సొమ్ము నగదు రూపంలో అక్కడ సిబ్బందికి అప్పగించడం ద్వారా తులాభారంతో శ్రీవారికి మొక్కులు చెల్లిస్తారు.
ఈ వ్యవహారంపై టిటిడి బోర్డు సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కి భాను ప్రకాష్ రెడ్డి మీడియాతో ఏమన్నారంటే..
తులాభారంలో జరిగిన అక్రమాలపై గతంలో ఉన్న ఈవోకు కూడా ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. "ఈ అంశంపై దర్యాప్తు చేశాం. కానీ చర్యలు తీసుకోలేదు" అని గత ఈవో వ్యాఖ్యానించారని భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు.
హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీకే కాదు. యాత్రికులు అందించే కానుకలకు కూడా భద్రత లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తులాభారం వద్ద విధులు నిర్వహించే, కాంట్రాక్టు సిబ్బందిని తొలగించి గతంలో టీటీడీ ఉద్యోగులను నియమించారని ఆయన గుర్తు చేశారు. వివిధ బ్యాంకుల సిబ్బంది ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులను నియమించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో తులాభారం వేసుకున్న యాత్రికులు సమర్పించిన సొమ్ములో సగం వంతు స్వాహా చేశారన్నారు. దీని వెనక వైసిపి కాలంలో పనిచేసిన అధికారులు, పాలకమండలి బాధ్యత ఉందని ఆయన సూటిగా ఆరోపించారు.
"టీటీడీ వ్యవహారాలను మూడు దశాబ్దాలుగా నేను పరిశీలిస్తున్న. ఒకరోజు తులాభారం వద్ద వాకబు చేశా. ఆరోజు 10.18 లక్షల రూపాయలు తులాభారం ద్వారా శ్రీవారికి అందింది" అని టిటిడి పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తన అనుభవాన్ని మీడియాకు వివరించారు. ఈ లెక్కన ఐదేళ్లపాటు తులాభారం ద్వారా ఎంత ఆదాయం లభించిందనే విషయం అర్థం చేసుకోవాలన్నారు.
" నేను వెళ్లిన రోజు వంద మంది తులాభారం వేయించుకున్నారు. తులాభారం వద్ద ఉంచిన యంత్రంలో మ్యాజిక్ చేశారని తన పరిశీలనలో తెలిసిందని ఆయన చెప్పారు. ఒక వేళ వంద మంది వచ్చారనుకుంటే, యంత్రంలో ఆ సంఖ్య తగ్గించడం, ఆ సొమ్మును పక్కదారి పట్టించారు" అని ఆయన వివరించారు. ఈ సొమ్ము ఎవరికి చేరింది? పాత్రధారులు, సూత్రధారులు ఎవరేనేది త్వరంలోనే తులుస్తామన్నారు. గతంలో పేర్లతో సహా ఫిర్యాదు చేశాం. మళ్లీ ఇప్పుడు డీజీపీతో పాటు సీఎం ఎన్. చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
శేష వస్త్రం కూడా..
తిరుమలలో శ్రీవారి మూలవిరాట్టుకి శుక్రవారం అలంకరించే శేషవస్త్రానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రధాని, రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రికి మాత్రమే విశేష వస్త్రంతో ఆశీర్వచనం అందించే నిబంధన ఉందని భాను ప్రకాష్ రెడ్డి ప్రస్తావించారు. వైసిపి ప్రభుత్వ కాలంలో ఈ శేషవస్త్రం సమర్పించడంలో కూడా దుర్వినియోగం జరిగిందని ఆయన ఆరోపించారు.
తిరుమల ఆలయంలో జరిగిన అవినీతి, అక్రమాల్లో పాత్రధారులు, సూత్రధారుల సమగ్ర వివరాలను బహిర్గతం చేస్తామని భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. వారందరూ త్వరలో జైలుకు వెళ్లడం తప్పదని ఆయన హెచ్చరించారు.
Read More
Next Story