తిరుమల : టీటీడీ చైర్మన్ డ్యూటీ ఎక్కారబ్బా..!
x
శ్రీవారి ఆలయ ధ్వజస్తంభానికి మొక్కుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు

తిరుమల : టీటీడీ చైర్మన్ డ్యూటీ ఎక్కారబ్బా..!

బాధ్యతలు స్వీకరించి ఒక రోజు గడవకనే..టీటీడీ చైర్మన్ టీవీ5 బీఆర్ నాయుడు రంగంలోకి దిగారు. ఇంతకీ తిరుమలలో ఆయన ఏమి చేశారు.


తిరుమలలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించారు. యాత్రికుల ఆరోగ్య భద్రత కోసం అన్నట్లు పారిశుద్ధ్య పరిస్థితులపై దృష్టి సారించారు. నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఉదయం నుంచి వర్షం ముసురు కమ్ముకుంది. తిరుమల కొండపై వర్షం దంచికొడుతోంది. మిగతా ప్రాంతాలకంటే శ్రీవారి క్షేత్రంలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా పారిశుద్ధ్యం సమస్య ఎదురుకాకుండా, టీటీడీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయినా, టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన టీవీ5 బిఆర్. నాయుడు రోజు కూడా గడవకముందే డ్యూటీ ఎక్కినట్లు ఉంది. జోరు వర్షంలోనూ ఆయన శానిటరీ విభాగం పనితీరును గురువారం ఆయన స్వయంగా పర్యవేక్షించారు.


తిరుమలలో ఉత్పన్నమయ్యే వ్యర్ధాలను తొలగించడానికి మూడు షిప్టుల్లో కాంట్రాక్టు, టీటీడీ వర్కర్లు పనిచేస్తుంటారు. ఎందుకంటే, స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులతో పాటు రోజుకు సుమారు లక్ష మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో హోటళ్లతో పాటు, తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానసత్రం నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థాలు, ఇస్తారకులు, తదతర వ్యర్థాలను తిరుమలలోని కాకులమానుదిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఆ ప్రాంతానికి వెళ్లిన టీటీడీ చైర్మన్ డంపింగ్ యార్డును పరిశీలించారు. అక్కడ తడి, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియతో పాటు ఇతర అంశాలను పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ పద్ధతులను టీటీడీ శానిటరీ విభాగం అధికారులతో తెలుసుకున్నారు.



తిరుమలలో పారిశుద్ధ్యలోపం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన సూచనలు చేశారు. పాలక మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించకముందే బీఆర్ నాయుడు కొన్ని అంశాలను ప్రస్తావించారు. "తిరుమల ఆలయం వెనుక లోయలో పదుల సంఖ్యలో టన్నుల వ్యర్ధాలు వేశారు. వాటిని నేనే స్వయంగా చూశా" అని బీఆర్ నాయుడు గుర్తు చేశారు. ఆ కొండల నుంచి వాటిని శుభ్రం చేయించాల్సిన అవసరాన్ని కూడా గుర్తుకు చేసుకున్నారు దీంతో..

టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గంటల్లోనే ఆయన పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. కొండల్లో వేసిన వ్యర్థాల వల్ల పర్యావరణానికి ప్రమాదం ఏర్పడడమే కాకుండా, దుర్వాసన వల్ల రోగాలు ప్రబలే అవకాశాన్ని ఆయన ఎత్తి చూపించారు. మొదటి బోర్డు సమావేశం జరిగే లోపల తిరుమలలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి సమయం కేటాయించనున్నట్లు ఆయన సేంకేతాలు ఇచ్చారు. బోర్డు సమావేశం తరువాత ఆయన పనితీరు ఎలా ఉంటుందనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story